ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

సికింద్రాబాద్ కంటోన్మెంట్ రోడ్ల మూసివేత సమస్య విషయంలో ఉపరాష్ట్రపతి చొరవ


• రోడ్ల మూసివేత కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రికి సూచన

• వెంటనే పరిశీలించి, తెలియజేస్తామన్న మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 18 JUL 2021 5:57PM by PIB Hyderabad

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంత చుట్టు పక్కల కాలనీల్లో నివసిస్తున్న వేలాది మంది ప్రజలకు ఇబ్బంది మారిన కంటోన్మెంట్ రహదారుల మూసివేత సమస్యను పరిశీలించాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ కు సూచించారు. 

నూతనంగా సహాయమంత్రిగా నియమితులైన శ్రీ అజయ్ భట్, ఆదివారం నాడు ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో, వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ సమస్యను ప్రస్తావించిన శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు, ఈ సమస్య కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా చర్యలు తీసుకుని, సమస్యను పరిష్కరించాలని సహాయమంత్రికి సూచించారు. 

ఈ సమస్యకు సంబంధించి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కేంద్ర రక్షణమంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ కు రాసిన లేఖ గురించి కూడా ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు.

ఈ విషయాన్ని వెంటనే పరిశీలించి, తెలియజేస్తామని శ్రీ అజయ్ భట్ ఉపరాష్ట్రపతికి తెలిపారు.

***


(రిలీజ్ ఐడి: 1736646) సందర్శకుల సూచీ సంఖ్య : : 157
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi , Tamil