ఆర్థిక మంత్రిత్వ శాఖ

బెంగళూరులో ఆదాయపన్ను విభాగం సోదాలు

Posted On: 13 JUL 2021 7:48PM by PIB Hyderabad

ఈ నెల 8వ తేదీన, బెంగళూరులో, ఓ సంస్థకు చెందిన రెండు వ్యాపార ప్రాంగణాల్లో ఆదాయపు పన్ను అధికారులు సోదాలు చేపట్టారు. మానవ వనరులను అందించే ప్రముఖ సంస్థకు చెందిన వ్యాపార ప్రాంగణాల్లో ఈ తనిఖీలు జరిగాయి. ఆదాయపన్ను చట్టం-1961లోని 80జేజేఏఏ సెక్షన్‌ కింద, తన ఆదాయం నుంచి భారీ తగ్గింపును ఆ సంస్థ తన ఆదాయ చెల్లింపు పత్రాల్లో పేర్కొంది. ఉద్యోగికి చెల్లించే చెల్లింపులు (నెలకు రూ.25 వేల కంటే తక్కువ ఉండాలి), ఉద్యోగ కల్పన రోజుల మొత్తం వంటి కొన్ని షరతులకు లోబడి ఈ సెక్షన్‌ కొత్త ఉపాధి కల్పనను ప్రోత్సహిస్తుంది.

    80జేజేఏఏ సెక్షన్‌ను మదింపుదారు సంస్థ దుర్వినియోగం చేసిందని అధికారుల పరిశోధనలో తేలింది. కొత్త ఉద్యోగులకు ఇచ్చే చెల్లింపులు నెలకు రూ.25 వేలు దాటినా, ఆ చెల్లింపుల నుంచి కొన్ని అంశాలను తీసివేసి, ఆ మొత్తాలను 80జేజేఏఏ సెక్షన్‌కు సరిపోయేలా తప్పుడు లెక్కలు సృష్టించినట్లు అధికారులకు ఆధారాలు లభించాయి. ఈ విధంగా ఆ సంస్థ తప్పుడు మార్గంలో తగ్గింపును పొందుతున్నట్లు తెలిసింది.

    అంతేగాక, రూ.25 వేల లోపు చెల్లింపులు అందుకునే అర్హత గల ఉద్యోగులు కొందరు ఆ సంస్థలో లేకపోయినా, వారి పేరిట తర్వాతి సంవత్సరాల్లోనూ ఈ సెక్షన్‌ కింద తగ్గింపును సదరు సంస్థ పొందినట్లు సోదాల్లో అధికారులు తెలుసుకున్నారు.

    ఈ విధంగా, వివిధ అసెస్‌మెంట్ సంవత్సరాల్లో 880 కోట్ల రూపాయల మేర ఈ సంస్థ మోసం చేసిందని అధికారులు గుర్తించారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.

 

***
 


(Release ID: 1735314) Visitor Counter : 149