హోం మంత్రిత్వ శాఖ
గాంధీనగర్ లోక్.సభ స్థానం పరిధిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం
రూ. 36కోట్ల ప్రభుత్వ పనులకు కేంద్ర హోమ్.మంత్రి అమిత్ షా శ్రీకారం
జగన్నాథ రథయాత్ర సందర్భంగా దేశప్రజలకు శుభాకాంక్షలు
అహ్మదాబాద్ జగన్నాథుడి ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతిసారీ
తనకు కొత్తశక్తి అందుతోందన్న అమిత్ షా..
జగన్నాథుడి ఆశీస్సులు జనులందరిపై వర్షించాలని ఆకాంక్ష
నార్దీపూర్ గ్రామంలో రూ. 25కోట్ల
అభివృద్ధి పనులు జాతికి అంకితం
మన సంస్కృతీ సంప్రదాయాలు తెలుసుకోవాలంటే
ఎవరైనా నార్దీపూర్ వెళ్లాల్సిందేనని వ్యాఖ్య
గాంధీనగర్ నియోజకవర్గం పరిధిలో 3వేల జనాభాను మించిన
గ్రామాలను 2024లోగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక..
పథకాల ప్రయోజనాలను నియోజకవర్గంలో ఎవరూ
కోల్పోరాదన్నదే తమ ధ్యేయమని వెల్లడి..
పద్దెనిమిదేళ్లు దాటిన వారందరికీ ఉచిత వ్యాక్సినేషన్.కు
ప్రధాని ఏర్పాట్లు. మనం తప్పనిసరిగా వ్యాక్సీన్ వేసుకోవాలి
గాంధీ ఆసుపత్రిలో సన్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన
ఆక్సిజన్ ప్లాంటుకు అమిత్ షా ప్రారంభోత్సవం
కోవిడ్.పై పోరులో ప్రత్యేక సేవలందించిన పౌరులకు
ప్రశంసా పత్రాల ప్రదానం
కోవిడ్.పై అవగాహన, బాధితులకు సాయం అందించాలన్న
ప్రధాని పిలుపునకు స్పందించిన గుజరాత్ రాజ్.భవన్
రాజ్.భవన్
Posted On:
12 JUL 2021 6:56PM by PIB Hyderabad
గుజరాత్.లోని గాంధీ నగర్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో రూ. 36కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పథకాలను, ప్రభుత్వ పనులను కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఈ రోజు ప్రారంభించారు. జగన్నాథ రథయాత్రను పురస్కరించుకుని ప్రజలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అహ్మదాబాద్ లోని జగన్నాథ ఆలయంలో జరిగే ప్రార్థనల్లో తాను చాలా ఏళ్లుగా పాల్గొంటున్నానని, పాల్గొన్న ప్రతి సారీ తనకు కొత్త శక్తి అందుతోందని ఆయన అన్నారు. ఈ రోజు కూడా భగవానుడి పూజల్లో పాల్గొనడం తనకు ఎంతో గౌరవప్రదమని, జగన్నాథ స్వామి ఎల్లపుడూ అందిరిపై తన ఆశీస్సులను వర్షిస్తూనే ఉంటాడని అమిత్ షా అన్నారు.
తాను ప్రాతినిధ్యం వహించే గాంధీ నగర్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని నర్దీపూర్ గ్రామంలో రూ. 25కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర హోమ్ మంత్రి ప్రారంభించారు. అదలాజ్ ప్రాంతంలో స్వామినారాయణ్ మందిర్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శారదామణి కమ్యూనిటీ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, ప్రజలెవరూ ఏ రాత్రీ ఆకలితో నిద్రించరాదన్న నియమం పెట్టుకున్న నర్దీపూర్ గ్రామానికి తాను వచ్చానని అన్నారు. ప్రజలే కాకుండా, ఏ ఇతర ప్రాణీ ఆకలితో నిద్రించరాదన్న లక్ష్యంతో ఇక్కడ ఏర్పాట్లు చేశారని కేంద్రమంత్రి అన్నారు. మన సంస్కృతీ, సంప్రదాయాలు, నియమాల గురించి తెలుసుకోదలిచిన వారెవరైనా నర్దీపూర్ గ్రామానికి రావచ్చని అన్నారు. నర్దీపూర్ తనకు ఎన్నో ఇచ్చిందని, తన బాల్యాన్ని నర్దీపూర్ లోనే గడిపానని, మన్సాలో పదవ తరగతి చదువుకొనే వరకూ తాను నర్దీపూర్ లోనే ఉన్నానని చెప్పారు. నర్దీపూర్ లో జరిగే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకైనా తాను వస్తూ ఉంటానని, ప్రజలను కలుసుకుంటూనే ఉంటానని చెప్పారు. ఆసుపత్రి నిర్మాణం, పాఠశాల ఆధునికీకరణ, చిన్నపిల్లల పార్కు, నీటి సరస్సు అభివృద్ధి వంటి ఎలాంటి పనులు, కార్యక్రమాలకైనా తాను వస్తూనే ఉంటానన్నారు.
గాంధీ నగర్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో 3వేల జనాభాకు మించిన ప్రతి గ్రామాన్ని 2024లోగా అభివృద్ధి చేసేందుకు ఒక ప్రణాళిక రూపొందిందని అమిత్ షా తెలిపారు. నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్కరూ,. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ ప్రారంభించే అన్ని పథకాల ప్రయోజనాలనూ అందుకోవలసిందేనని, ఏ ఒక్కరూ పథకాల ప్రయోజనాలను కోల్పోరాదన్నదే తమ ధ్యేయమని ఆయన అన్నారు. మరుగుదొడ్డి, వంటగ్యాస్, పైపు ద్వారా నీటి సరఫరా, విద్యుత్తు లేని ఇల్లు నియోజకవర్గంలో ఒక్కటి కూడా ఉండరాదన్నారు. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి సమయంలో మనం చాలా క్లిష్టపరిస్థితులను చూశామని, సెకండ్ వేవ్ సందర్భంగా కోవిడ్ వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందిందని అన్నారు. వైరస్ వ్యాప్తి తీవ్రతతో పరిస్థితి అదుపు తప్పినప్పటికీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృషితో ఆరేడు రోజుల్లోనే పరిస్థితి మెరుగుపడిందని, వివిధ గ్రామాలకు, నగరాలకు తగినంతమేర ఆక్సిజన్ పంపిణీ జరిగిందని అన్నారు. కోవిడ్ బారినపడి మనం పలువురిని కోల్పోయినప్పటికీ, గాంధీనగర్ లోక్ సభ నియోజకవర్గంలో, నర్దీపూర్ గ్రామంలో కోవిడ్ కారణంగా ఏ ఒక్కరూ మరణించే పరిస్థితికి ఆస్కారం ఇవ్వరాదంటూ మనం ప్రతిన బూనాలని ఆయన అన్నారు. దేశంలో పద్దెనిమిదేళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సీన్ వేయడానికి ప్రధాని ఏర్పాట్లు చేశారని, మనమంతా తప్పకుండా వ్యాక్సీన్ వేయించుకోవాలని అమిత్ షా సూచించారు.
ఈ ప్రాంతంలో ఎర్రరంగు రేషన్ కార్డు కలిగిన కుటుంబాల్లో ఒక్కొక్కరికి నెలకు ఐదు కిలోగ్రాముల చొప్పున ఆహార ధాన్యాలను దీపావళి వరకూ పంపిణీ చేయడానికి ప్రధానమంత్రి ఏర్పాటు చేశారన్న సందేశాన్ని కార్డుదారులందరికీ చేరవేయాలని కేంద్ర హోమ్ మంత్రి విజ్ఞప్తి చేశారు. దేశంలోని 80కోట్ల మంది జనాభాకు ఆహార ధాన్యాల పంపిణీకి మోదీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని, ఈ కార్యక్రమం విజయవంతమయ్యేలా చూసేందుకు గ్రామాల్లో ప్రతిఒక్కరూ, ప్రత్యేకించి యువజనులు సమైక్యం కావాలని పిలుపునిచ్చారు.
గాంధీనగర్ లోని సివిల్ ఆసుపత్రిలో సన్ ఫౌండేషన్ సంస్థ ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంటును అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటుకోసం సన్ ఫౌండేషన్ చేసిన కృషి, గుజరాత్ లో కోవిడ్ కట్టడి పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. ఈ ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటుతో ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయని ఆయన అన్నారు.
కోవిడ్-19 వైరస్ పై పోరాటంలో ప్రత్యేక సేవలందించిన వారికి రాజ్.భవన్ లో ప్రశంసా పత్రాలను ప్రదానం చేసిన సందర్భంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో దేశం సమైక్యంగా కోవిడ్ మహమ్మారిపై పోరాటం జరిపిందని, ప్రతి ఒక్కరూ తమ వంతు సేవలందించారని అన్నారు. కోవిడ్-19 వైరస్ వ్యాప్తిపై అవగాహన కల్పించేందుకు, బాధితులందరికీ సేవలందించేందుకు రాజ్ భవన్ కార్యాలన్నీ కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని, ఆయన పిలుపుమేరకు కోవిడ్ మహమ్మారి సోకిన ప్రజలకు అవసరమైన సహాయం అందించాలని అమిత్ షా సూచించారు. ఈ దిశగా గుజరాత్ రాజ్ భవన్ ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టి స్వార్థరహితంగా ఎన్నో సేవలందించిందని, ఈ కార్యక్రమం ద్వారా ఎందరో పెద్దఎత్తున అందించిన సహాయం ప్రజలకు అందిందని అన్నారు. మోదీజీ నాయకత్వంలో కోవిడ్-19 వైరస్ పై పోరాటం జరిపిన ప్రతి ఒక్కరికీ తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు కేంద్రమంత్రి అమిత్ షా తెలిపారు.
****
(Release ID: 1735045)
Visitor Counter : 205