వ్యవసాయ మంత్రిత్వ శాఖ

చిన్న, మధ్య తరహా రైతుల అభివృద్ధే ధ్యేయం: తోమర్.


నాబార్డ్ వెబినార్.లో కేంద్ర వ్యవసాయమంత్రి ప్రసంగం..
బ్యాంకు 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహణ

వ్యవసాయ చట్టాలు, మౌలిక సదుపాయాల నిధితో
పెట్టుబడులకు మరింత ఊపు: డాక్టర్ సుబ్రమణియం

Posted On: 12 JUL 2021 6:47PM by PIB Hyderabad

  చిన్న, మధ్యతరహా రైతుల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. చారిత్రాత్మకమైన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రూ. 1.35లక్షల కోట్లను 11కోట్లమంది చిన్న, మధ్యతరహా రైతుల బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం నేరుగా బదిలీ చేసినట్టు ఆయన చెప్పారు. వ్యవసాయానికి అయ్యే ఖర్చును దృష్టిలో పెట్టుకుని, వ్యవసాయాన్ని రైతులకు గిట్టుబాటు వృత్తిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు కనీస మద్దతు ధరను పెంచుతూ వచ్చిందన్నారు. అలాగే, ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల సేకరణను కూడా పెంచిందన్నారు. ఇందుకు సంబంధించి రికార్డు స్థాయి కొనుగోళ్లు చేయడంలోను, సుమారు రూ. 50వేల కోట్లను రాష్ట్ర మార్కెటింగ్ సంఘాలకు పంపిణీ చేయడంలోను  జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) కీలకపాత్ర పోషించిందన్నారు. నాబార్డ్ 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వెబినార్ సదస్సులో మాట్లాడుతూ కేంద్రమంత్రి ఈ విషయాలు తెలిపారు.

  

   చిన్న, సన్నకారు రైతులకు సకాలంలో రుణాలు అందించడం చాలా ముఖ్యమని కేంద్రమంత్రి తోమర్ అన్నారు. పి.ఎం. కిసాన్ పథకం లబ్ధిదారులకు కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో కూడా కిసాన్ క్రెడిట్ కార్డులను అందజేసేందుకు భారీ స్థాయిలో అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్టు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబందించిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రుణాలు అందించడానికి రూ. 16లక్షల కోట్లను లక్ష్యంగా నిర్ణయించినట్టు చెప్పారు. సహకార, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ద్వారా రాయితీ రేట్లకు పంటరుణాలను అందించేందుకు నాబార్డ్ ఏర్పాట్లు చేయడం తనకు చాలా సంతృప్తి కలిగిస్తోందన్నారు. గత ఏడేళ్లలో ఈ మొత్తం రూ. 6.5లక్షల కోట్లకు చేరిందని, వ్యవసాయ మార్కెటింగ్ ప్రక్రియను కూడా ప్రభుత్వం పూర్తిగా సంస్కరించిందని అన్నారు.  ప్రస్తుతం వెయ్యి సమగ్ర జాతీయ వ్యవసాయ మార్కెట్  (ఈ నామ్) మండీలు అందుబాటులో ఉన్నాయని, ప్రస్తుత సంవత్సరంలో మరో వెయ్యి మండీలు ఈ నామ్ పోర్టల్ వ్యవస్థతో అనుసంధానమవుతాయని చెప్పారు. 'ఆపరేషన్ గ్రీన్స్', 'కిసాన్ రైలుl' పథకాలు ప్రారంభించడం కూడా ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక చర్యలని అన్నారు. పండ్లు, కూరగాయలను వ్యవసాయ క్షేత్రాలనుంచి వినియోగదారులు ఉండే నగరాలకు రవాణా చేయడం ద్వారా రైతు నష్టాలను తగ్గించ గలుగుతున్నట్టు చెప్పారు. పదివేల కొత్త రైతు ఉత్పత్తిదార్ల సంఘాలను (ఎఫ్.పి.ఒ.లను) ప్రారంభించేందుకు ఒక పథకాన్ని కూడా ఆరంభించామని, సామూహిక స్ఫూర్తితో కూడిన నమూనాతో ఇవి పనిచేస్తాయని చెప్పారు. ఎంతో బృహత్తరమైన ఈ పథకం అమలులో నాబార్డ్ ప్రధాన పాత్రధారి కావడం సంతోషదాయకమని అన్నారు.

   ఆత్మనిర్భర భారత్ అభియాన్ కింద గ్రామీణ, వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని, వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి లక్షన్నర కోట్ల రూపాయలను కేటాయించారని కేంద్ర మంత్రి చెప్పారు. వ్యవసాయంలో పెట్టుబడులను ప్రోత్సహించే లక్ష్యంతో 'వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి' పేరిట ప్రత్యేక నిధికి లక్షకోట్ల రూపాయలు కేటాయించినట్టు చెప్పారు. రైతులు ఇపుడు 3శాతం వడ్డీ రేటుతో ప్రభుత్వంనుంచి ఆర్థిక సహాయం, రుణ గ్యారంటీ పొందవచ్చన్నారు. ఈ పథకంలో భాగస్వామి అయిన నాబార్డ్, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుందన్నారు. 'ఒకే చోట అన్నీ లభ్యమయ్యే దుకాణాలు'గా  35వేల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను (పి.ఎ.సి.లను) అభివృద్ధి చేయాలని నాబార్డ్ లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు చెప్పారు. రైతులకు బహుముఖ సేవలను ప్రారంభించేందుకు వీలుగా 3వేల పి.ఎ.సి.లకు రూ. 1,700కోట్లను నాబార్డ్ మంజూరు చేసిందన్నారు. గత ఏడేళ్లలో గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి కింద 1.81లక్షల కోట్లను నాబార్డ్ వివిధ రాష్ట్రాలకు అందించినట్టు, ఇందులో మూడోవంతును నీటి పారుదల రంగానికి వినియోగించినట్టు కేంద్రమంత్రి చెప్పారు. ఈ నిధి ఇపుడు రూ. 40,000కోట్లకు పెరిగినట్టు చెప్పారు. పి.ఎం. కృషి యోజన పథకం కింద 'ప్రతి నీటిబొట్టుకూ మరింత పంట' సాధించే లక్ష్యంతో నాబార్డ్ తో పాటుగా, మరిన్ని ఇతర సంస్థలు ఎన్నో సేవలందించాయన్నారు. ఈ కార్యక్రమం అమలులో నాబార్డ్ కింద సూక్ష్మ సేద్యపునీటి నిధి గ్రూపు మొత్తాన్ని  రూ. 10వేల కోట్లకు పెంచుతూ కేంద్రం చర్యలుతీసుకున్నట్టు చెప్పారు.

   ఈ వెబినార్ లో ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణియం మాట్లాడుతూ, భారతీయ వ్యవసాయ రంగం అభివృద్ధికి, సృజనాత్మక కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు ప్రైవేటు పెటుబడుల అవసరమన్నారు. చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతికి కొత్త వ్యవసాయ చట్టాలు చాలా ముఖ్యమని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. చిన్న, సన్నకారు రైతులకు రుణ సదుపాయం అందించడం చాలా అవసరమని, దేశంలోని ఈ తరహా రైతులకు రుణసదుపాయం అందించేందుకు నాబార్డ్ వంటి సంస్థలు తగిన ఏర్పాట్లు చేయవలసి ఉందని డాక్టర్ సుబ్రమణియం చెప్పారు.

   నాబార్డ్ చైర్మన్ డాక్టర్ జి.ఆర్. చింతల మాట్లాడుతూ, ప్రస్తుతం హరిత మౌలిక సదుపాయాల వ్యవస్థలో తగిన పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రంగంలో పెట్టుబడులు 2024-25నాటికి రూ. 18.37లక్షల కోట్లకు చేరుకుంటాయని, ఈ మొత్తంలో రూ. 7.35కోట్లను వ్యవసాయ మౌలిక సదుపాయాలకోసం కేటాయించనున్నారని ఆయన చెప్పారు. వ్యవసాయ వాతావరణం, వ్యవస్థ క్రమంగా మారుతూ వస్తోందని, రైతుల జీవితం ఇదివరకంటే మరింత సౌకర్యవంతంగా మారబోతోందని డాక్టర్ చింతల అన్నారు. వివిధ వ్యవసాయ వ్యవస్థలకు, ప్రాసెసింగ్ ప్రక్రియలకు, ఎగుమతికి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వినియోగించే స్థితికి రైతులు చేరుకోబోతున్నట్టు, వారి ఆదాయం కూడా పెరగబోతున్నట్టు ఆయన చెప్పారు. వ్యవసాయ, గ్రామీణ సమాజాన్ని వివిధ చర్యలు, పథకాల ద్వారా అభ్యున్నతి చెందించడానికి నాబార్డ్ గత  కొన్నిదశాబ్దాలుగా  కృషి చేస్తూ వస్తోందన్నారు. "చిన్న, సన్నకారు రైతులు, గ్రామీణ మహిళలు, వ్యవసాయ కార్మికులు ప్రయోజనం పొందేందుకు వీలుగా సరైన వ్యవస్థకు రూపకల్పన చేసేందుకు మేం చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నాం" అని ఆయన స్పష్టం చేశారు.

 

****


(Release ID: 1734935) Visitor Counter : 601