రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

ఆవిష్కరణలు మరియు పరిశోధనల ద్వారా నాణ్యత విషయంలో రాజీ పడకుండా రహదారి నిర్మాణంలో ఉక్కు మరియు సిమెంటు వాడకాన్ని తగ్గించాలని శ్రీ గడ్కరీ పిలుపునిచ్చారు

Posted On: 09 JUL 2021 1:22PM by PIB Hyderabad

ఆవిష్కరణలు మరియు పరిశోధనల ద్వారా నాణ్యత విషయంలో రాజీ పడకుండా రహదారి నిర్మాణంలో ఉక్కు మరియు సిమెంటు వాడకాన్ని తగ్గించాలని  కేంద్ర రహదారి రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ అన్నారు. "భారతదేశంలో రహదారి అభివృద్ధి" పై 16 వ వార్షిక సమావేశంలో ప్రసంగించిన ఆయన.. సిఎన్‌జి, ఎల్‌ఎన్‌జి మరియు ఇథనాల్‌ను రోడ్ ఎక్విప్‌మెంట్ మెషినరీ కోసం ఉపయోగించాలని అన్నారు. ఖర్చుతో కూడుకున్న దిగుమతులకు ప్రత్యామ్నాయంగా కాలుష్య రహిత మరియు దేశీయ పద్ధతులు మరియు ప్రత్యామ్నాయ ఇంధన అభివృద్ధికి మంత్రి ఉద్ఘాటించారు.

సుమారు 63 లక్షల కిలోమీటర్ల రహదారి వ్యవస్థ ఉన్న భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్ అని శ్రీ గడ్కరీ అన్నారు. 70 శాతం వస్తువులు, దాదాపు 90 శాతం ప్రయాణీకుల రాకపోకలు రోడ్ల ద్వారా జరుగుతున్నాయని తద్వారా ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో రహదారి మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. వచ్చే ఐదేళ్లలో భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ప్రధాని దృష్టి పెట్టారని శ్రీ గడ్కరీ అన్నారు. జాతీయ మౌలిక సదుపాయాల పైప్‌లైన్ ద్వారా ప్రభుత్వం 1.4 ట్రిలియన్ డాలర్లు అంటే రూ .111 లక్షల కోట్లు మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు పెడుతోందని, ఈ ఏడాది మరింతగా ప్రభుత్వం  మౌలిక సదుపాయాల క్యాపెక్స్‌ 34 శాతం పెరిగి రూ. 5.54 లక్షల కోట్లకు చేరిందని చెప్పారు. మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెరగడం కోవిడ్‌ సంక్షోభ సమయంలో ఉపాధి కల్పించడంలో సహాయపడుతుందని శ్రీ గడ్కరీ అన్నారు. రోజుకు 40 కిలోమీటర్ల చొప్పున 60,000 కిలోమీటర్ల ప్రపంచ స్థాయి జాతీయ రహదారిని నిర్మించడమే తమ లక్ష్యమని మంత్రి  అన్నారు.

కార్యక్రమ పూర్తి లింక్‌: https://youtu.be/xYxobHaKGQg


(Release ID: 1734524) Visitor Counter : 238