వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

పెద్దగా ఆలోచించి, ఉన్నత శిఖరాలకు ఎదగాలని, దేశంలోని చార్టర్డ్ అకౌంటెంట్ లకు పిలుపునిచ్చిన - శ్రీ పియూష్ గోయల్

Posted On: 01 JUL 2021 6:13PM by PIB Hyderabad

దేశంలోని చార్టర్డ్ అకౌంటెంట్లు, పెద్దగా ఆలోచించి ప్రపంచ స్థాయికి ఎదగాలని, రైల్వే, వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ రోజు పిలుపునిచ్చారు.  73 వ చార్టర్డ్ అకౌంటెంట్స్ డే సందర్భంగా, భారత చార్టర్డ్ అకౌంటెంట్స్ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ,  మన వృత్తి లో ఆశయాలు పునర్ నిర్దేశించుకుని, పూర్తి మనస్తత్వ మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఆయన సూచించారు.  విలీనాలు, సముపార్జనలు, భాగస్వామ్యాలతో పాటు, పెద్ద వెంచర్లను పరిశీలించి, కంపెనీలు, ప్రపంచ స్థాయికి ఎదగాలని, ఆయన పేర్కొన్నారు. 

శ్రీ గోయల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ "ఐ.సి.ఏ.ఐ. సంస్థకు 75 ఏళ్ళు నిండే సమయానికి, ప్రపంచవ్యాప్తంగా ఖాతాదారులకు సేవలందిస్తున్న మన ప్రపంచ స్థాయి చార్టర్డ్ అకౌంటెన్సీ సంస్థల యొక్క మొదటి బృందాన్ని చూడవచ్చు." అని ఆశాభావం వ్యక్తం చేశారు. సంస్థ పెరుగుతున్న కొద్దీ, ప్రపంచ స్థాయి నైతికత, సాంకేతిక పరిజ్ఞానం, కఠినమైన ప్రమాణాలపై దృష్టి పెట్టాలని, మంత్రి సూచించారు. మనం అంతర్జాతీయంగా, సద్భావన, గౌరవం, నమ్మకాన్ని సంపాదించాలంటే,   మనలో ప్రతి ఒక్కరిలో 100 శాతం పరిపూర్ణమైన విశ్వసనీయత పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. సంస్థ కీర్తి పతాకాన్ని సమున్నత స్థాయిలో ఎగుర వేయడం, తమ సమిష్టి బాధ్యతగా స్వీకరించాలని, ఆయన, ప్రతి చార్టెర్డ్ అకౌంటెంట్ ను మరియు సి.ఏ. చదివే విద్యార్దినీ, కోరారు.   అదేవిధంగా,  "మేము దీన్ని చేస్తాం, మేము దీన్ని చేయగలం, మేము దీన్ని చేయడానికి ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం.  దేశ పురోగతిలో మనం భాగస్వామి కావాలంటే, అంకురసంస్థల పర్యావరణ వ్యవస్థలో మనందరం ఏ విధంగా నిమగ్నం కాగలం, అనే విషయంపై ఆలోచించడం ప్రారంభించాలి" అని కేంద్ర మంత్రి వివరించారు. 

శ్రీ గోయల్, ఈసందర్భంగా సి.ఏ.ల వృత్తిని ప్రశంసిస్తూ, గుర్తింపు పొందిన మరియు గౌరవించబడే ఒక వృత్తి గా దీనిని చూడటం చాలా  గొప్ప విషయమని, పేర్కొన్నారు. చార్టర్డ్ అకౌంటెంట్లు కావాలనే ఆరాటం ప్రజల్లో బాగా ఉందని ఆయన అన్నారు.  ఆర్థిక వ్యవస్థకు సేవలు కొనసాగించడం, వృత్తిపరమైన విధులను నిర్వర్తించడం, విద్యార్థులకు విద్యను కొనసాగించడం వంటి బాధ్యతలను, ఈ సంస్థ, తనకు తానుగా స్వీకరించి, నిర్వహిస్తోందని, ఆయన తెలియజేశారు. ఈ 72 సంవత్సరాల్లో, ఈ సంస్థ, ఎన్నో విజయాలు సొంతం చేసుకుందనీ,  నమ్మకాన్ని సాధించిందనీ, ఆయన కొనియాడారు.  వారు దేశ సేవలో ఉన్నారు, వ్యాపార సేవలో ఉంటూ, దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్నారు. ఆయన మాట్లాడుతూ, “నాకు, ఐ.సి.ఏ.ఐ. అంటే,  సమగ్రత, నిబద్ధత, జవాబుదారీతనంతో పాటు, మేధస్సును ప్రతిబింబించాలి. మనం ప్రపంచంలో అగ్ర స్థాయిలో ఉన్న అకౌంటింగ్ సంస్థలలో ఒకటిగా ఉన్నాము. మన ఇన్స్టిట్యూట్‌ లో అమలుచేస్తున్న ఉన్నత ప్రమాణాలు, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు, చాలా కఠినమైన పరీక్షా ప్రమాణాలను, ప్రపంచ వ్యాప్తంగా అందరూ చూశారు.” అని పేర్కొన్నారు. 

దేశంలో టీకాలు వేసే కార్యక్రమం ప్రచారంలో చురుగ్గా పాల్గొనాలని శ్రీ గోయల్ ఈ సంస్థ కు పిలుపునిచ్చారు.  ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా, వ్యాక్సిన్ సంకోచాన్ని అధిగమించే విషయంలో ముఖ్య పాత్ర పోషించాలని, ఆయన కోరారు.  టీకాలు వేసే కార్యక్రమాన్ని చేపట్టడానికి,  కొన్ని గ్రామాలు లేదా కొన్ని ప్రాంతాలను, దత్తత తీసుకోవాలని కూడా ఆయన సూచించారు.  దేశవ్యాప్తంగా టీకాలు వేసే కార్యక్రమం వేగంగా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.



(Release ID: 1732148) Visitor Counter : 156