ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

కరోనా టీకాపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, వారి అనుమానాలను తొలగించాలి: ఉపరాష్ట్రపతి


ఈ దిశగా వైద్యరంగం ప్రత్యేక చొరవతీసుకోవాలని సూచన

టీకాకరణ కార్యక్రమాన్ని ప్రజాఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలి

గ్రామీణ ప్రాంతాల్లో టీకాకరణపై మరింత దృష్టిసారించాలి.. ఇది మనందరి సంయుక్త బాధ్యత కావాలి

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులకు, వైద్యరంగంలోని వారందరికీ శుభాకాంక్షలు, ప్రణామాలు తెలిపిన ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

కరోనా బాధితులకు వైద్యం చేసేందుకు తమ ప్రాణాలను పణంగాపెట్టి నిస్వార్థంగా సేవచేస్తున్నారని వైద్యులపై ప్రశంసలు

Posted On: 01 JUL 2021 12:04PM by PIB Hyderabad

 

కరోనాపై పోరాటంలో విజయం సాధించేందుకు దేశవ్యాప్తంగా టీకాకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇందుకోసం టీకాకరణపై ప్రజల్లో నెలకొన్న అపోహలు, అనుమానాలను నివృత్తి చేస్తూ.. వారిలో చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉందన్నారు. 


జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా బుధవారం చెన్నైలో ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డా. జార్జి అబ్రహామ్ రాసిన “మై పేషెంట్స్ మై గాడ్ – జర్నీ ఆఫ్ ఏ కిడ్నీ డాక్టర్” పుస్తకం తొలి కాపీని ఉపరాష్ట్రపతికి అందజేశారు. వైద్యునిగా, విద్యావేత్తగా, పరిశోధకునిగా శ్రీ అబ్రహామ్ గారి నాలుగు దశాబ్ధాల ప్రస్థానాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు.


ఈ సందర్భంగా తమ సందేశాన్ని తెలియజేసిన ఉపరాష్ట్రపతి, ‘కరోనా విషయంలో ప్రజల్లో కొన్ని అపోహలున్నాయి. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను తొలగించేందుకు మరింత కృషిజరగాలి. టీకాకరణ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఓ ప్రజాఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలి. ఇందుకోసం ప్రజల్లో టీకాకరణ అవసరంపై చైతన్యం కలిగించేందుకు వైద్యరంగంతో అనుసంధానమైన ప్రతి ఒక్కరూ ఇందుకోసం ప్రత్యేకంగా చొరవతీసుకోవాలి’ అని సూచించారు.


కరోనా మహమ్మారిపై పోరాటాన్ని ముందుండి నడపడంలో వైద్యులు చూపించిన చొరవను ప్రశంసించిన ఉపరాష్ట్రపతి, భారతీయ  సమాజాన్ని కరోనా ముప్పు నుంచి కాపాడేందుకు వైద్యులు తమ జీవితాలను పణంగా పెట్టి శ్రమించారన్నారు. కరోనా టీకాపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నవారు, టీకాలు తీసుకోకుండా తమతోపాటు తమ కుటుంబసభ్యుల జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్న విషయాన్ని గుర్తుచేయాలన్నారు.


టీకాకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయడంతోపాటు సమర్థవంతంగా అమలుచేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీమిండియా స్ఫూర్తితో పనిచేయాలని సూచించిన ఉపరాష్ట్రపతి, టీకాకరణపై ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాల్లో పౌరసమాజం సభ్యులు, సినీనటులు, క్రీడాకారులు, పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు ముందుకు రావాలని సూచించారు. ఇది మనందరి సంయుక్త బాధ్యతనే విషయాన్ని మరవరాదని పేర్కొన్నారు. కరోనాపై పోరాటంలో విజయం సాధించేందుకు టీకాకరణ ఉత్తమమైన మార్గమని.. ఇప్పటికే భారతదేశం 32 కోట్ల టీకాలు వేయడం ద్వారా టీకాకరణలో అమెరికాను దాటిపోయిన విషయాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు.


కరోనా మహమ్మారి సమయంలో వైద్యసేవల రంగంలోని వారు చేసిన త్యాగాలను గుర్తుచేసిన ఉపరాష్ట్రపతి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లెక్కల ప్రకారం.. దాదాపు 1500 మంది వైద్యులు, వైద్యసిబ్బంది కరోనాకు బలయ్యారన్నారు. మానవాళిని కాపాడేందుకు వారు నిస్వార్థంగా చేసిన త్యాగాలను యావద్భారతం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు.


ఈ ఏడాది జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ‘సంరక్షకులను రక్షించుకోవాలి’ (సేవ్ ద సేవియర్) ఇతి వృత్తంతో జరుపుకుంటున్న విషయాన్ని ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్న వైద్యుల ఆరోగ్య భద్రత, వారి సంక్షేమం విషయంలోనూ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైద్యులను దైవంతో సమానంగా కీర్తించే ఘనమైన వారసత్వం భారతీయ సమాజంలో ఉందంటూ ‘వైద్యో నారాయణో హరి’ అని పురాణాల్లో పేర్కొన్న అంశాన్ని గుర్తుచేశారు. వైద్యులు కూడా రోగులను పరీక్షించే సమయంలో కాస్త వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు.


భారతీయ సమాజంలో అపారమైన శక్తిసామర్థ్యాలు నిగూఢంగా ఉన్నాయని, కరోనాకు టీకాలను కనుగొనడంతోపాటు ఆపత్కర సమయంలో మాస్కులు, పీపీఈ కిట్లు, వెంటిలేటర్లను హుటాహుటిన సమాజానికి అందించడంలో మన వైద్యులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. 


జాతీయ వైద్య దినోత్సవం సందర్భంగా.. ఈ ప్రత్యేకమైన రోజున స్మరించుకునే ప్రముఖ వైద్యుడు, విద్యావేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్ బిధన్ చంద్రరాయ్ కు ఉపరాష్ట్రపతి నివాళులు అర్పించారు.



(Release ID: 1731844) Visitor Counter : 176