నీతి ఆయోగ్

లాభాపేక్షలేని ఆసుపత్రుల నమూనాపై నీతీ ఆయోగ్ నివేదిక విడుదల

Posted On: 29 JUN 2021 1:10PM by PIB Hyderabad

దేశంలో లాభాపేక్షలేని ఆసుపత్రి ఎలా ఉండాలో సూచించే నమూనాపై ఒక సమగ్రమైన అధ్యయన నివేదికను నీతీ ఆయోగ్ ఈ రోజు విడుదల చేసింది. దీనితో,.. లాభాపేక్షలేని ఆసుపత్రి నమూనాపై పటిష్టమైన విధాన రూపకల్పనలో సమాచారపరంగా ఏర్పడే అంతరాన్ని పూడ్చే దిశగా ముందడుగు పడినట్టు భావించవచ్చు. 


  నివేదిక విడుదల సందర్భంగా నీతీ ఆయోగ్ ఆరోగ్య వ్యవహారాల సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్ మాట్లాడుతూ, “దేశంలో ప్రైవేటు రంగంలో ఆరోగ్య సదుపాయాల విస్తరణకు సంబంధించి పెట్టుబడులు తక్కువ స్థాయిలోనే ఉంటున్నాయి. అయితే, ఇందుకు సంబంధించి పరిస్థితిని చక్కదిద్దేందుకు నిన్న ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ అవకాశం కల్పిస్తుంది. లాభాపేక్షలేని ఆసుపత్రి నమూనా రూపకల్పన కూడా ఆ దిశగా ఒక చిన్న ముందడుగు అవుతుంది.”  అన్నారు.


   అధ్యయన నివేదికను విడుదల చేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నీతీ ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సి.ఇ.ఒ.) అమితాబ్ కాంత్. అదనపు కార్యదర్శి డాక్టర్ రాకేశ్ సర్వాల్, అధ్యయనంలో పాల్గొన్న వివిధ ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు. 


  లాభాపేక్షలేని ఆసుపత్రుల నిర్వహణకు సంబంధించి కూలంకషమైన సూచనలు అందించేందుకు ఈ అధ్యయన నివేదిక దోహదపడుతుంది. అలాంటి ఆసుపత్రులకు సంబంధించి పరిశోధన ఆధారంగా కనుగొన్న అంశాలను ఈ నివేదిక వివరిస్తుంది. యాజమాన్యం, సేవల వర్గీకరణ కిందకు వచ్చే ఈ ఆసుపత్రుల నిర్వహణ గురించి ఇది తెలియజేస్తుంది. ప్రైవేటు ఆసుపత్రులు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆరోగ్య పథకాల మధ్య పోలికలను కూడా ఈ నివేదిక వివరిస్తుంది. 


 దేశంలో ప్రైవేటు రంగంలోని ఆరోగ్య రక్షణ సేవలపై నీతీ ఆయోగ్ గత కొంతకాలంగా విస్తృత స్థాయిలో అధ్యయనం చేస్తూ వస్తోంది. లాభాపేక్షతో కూడిన ఆరోగ్య రక్షణ వ్యవస్థలు, సంస్థలపై  తగినంత సమాచారం అందుబాటులో ఉన్నప్పటికీ, లాభాపేక్షలేని ఆరోగ్య రక్షణ వ్యవస్థలపై మాత్రం విశ్వసనీయమైన, సంస్థాగతమైన సమాచారం అందుబాటులో లేదు. ప్రతి ఒక్కరికి అందుబాటు యోగ్యంగా ఉంటూ నాణ్యమైన ఆరోగ్య రక్షణ సేవలను లాభాపేక్షలేని ఈ ఆసుపత్రులు నిర్విరామంగా అందిస్తూ వస్తున్నాయి. 


  లాభాపేక్షలేని ఆసుపత్రుల రంగం సృజనాత్మక రీతిలో ఆరోగ్య రక్షణ సేవలను అందించడమే కాక, ముందు జాగ్రత్త చర్యలతో కూడిన రక్షణ వ్యవస్థను కూడా అందిస్తోంది. సాంఘిక సంస్కరణలు, సమాజ సేవా కార్యకలాపాలు, విద్య వంటి అంశాలను ఆరోగ్య రక్షణ సదుపాయంతో అనుసంధానిస్తూ వస్తోంది. ప్రభుత్వ వనరులను వినియోగించుకుంటూ లాభాలను గురించి పట్టించుకోకుండా అందుబాటు ధరలో ఆరోగ్య రక్షణ సేవలను ఈ రంగం అందిస్తోంది. అయితే, చాలా ఏళ్లుగా ఈ రంగంపై  ఎలాంటి అధ్యయనం జరగలేదు.  


  వైద్యానికి అయ్యే ఖర్చును కట్టడిచేసేందుకు లాభాపేక్షలేని ఆసుపత్రులు అమలు చేస్తూవస్తున్న వ్యూహాలపై తాజాగా నీతీ ఆయోగ్ అధ్యయనం చేసింది. ఈ తరహా సంస్థల కార్యకలాపాలకు సవాలుగా నిలుస్తూ, వాటి ప్రగతిని ఆటంకపరిచే అంశాలను అర్థం చేసుకోవడానికి నీతీ ఆయోగ్ ఈ అధ్యయనం ద్వారా ప్రయత్నించింది.  


  లాభాపేక్షలేని ఆసుపత్రుల రంగానికి సంబంధించి స్వల్పకాల, దీర్ఘకాల విధానాల రూపకల్పననతో పాటుగా, ఇతర సంబంధిత అంశాలపై ఈ అధ్యయనం పలు సూచనలు చేసింది. లాభాపేక్షలేని ఆసుపత్రులను గుర్తించేందుకు తగిన పద్ధతులను సూచించడం, పనితీరు సూచికల ప్రాతిపదికగా వాటికి ర్యాంకులను నిర్ధారించడం, దాతృత్వ పద్ధతిని అనుసరించే అగ్రశ్రేణి ఆసుపత్రులను తగిన విధంగా ప్రోత్సహించడం తదితర అంశాలపై ఈ నివేదిక కొన్ని విధానాలను సూచించింది. దేశం మారుమూల ప్రాంతాల్లో సైతం పరిమిత ఆర్థిక వనరుల సహాయంతో మానవ వనరులను వినియోగించుకునేందుకు సంబంధించి ఆసుపత్రుల నైపుణ్యాలను ఉపయోగించుకునే అంశానికి కూడా నీతీ ఆయోగ్ అధ్యయనం ప్రాధాన్యత ఇస్తోంది. 


నీతీ ఆయోగ్ నివేదికను ఇక్కడ చూడవచ్చు              



(Release ID: 1731137) Visitor Counter : 217