ప్రధాన మంత్రి కార్యాలయం

అహ్మదాబాద్ లో జెన్ గార్డెన్, కైజెన్ అకాడమీలకు శ్రీకారం!


అహ్మదాబాద్ మేనేజిమెంట్ అసోసియేషన్ లో
ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం

జపాన్.లో ‘జెన్’ అంటే భారత్.లో ‘ధ్యానం’: ప్రధాని

గుజరాత్.లో మినీ జపాన్.ను సృష్టించడమే
తన సంకల్పమన్న మోదీ..
135 జపాన్ కంపెనీలు గుజరాత్ ను
ఎంపిక చేసుకున్నాయని వెల్లడి

శతాబ్దాల సాంస్కృతిక బాంధవ్యం, భవిష్యత్తుపై ఉమ్మడి
దార్శనికత ఉభయదేశాల సొంతం: ప్రధాని

టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ నేపథ్యంలో
జపాన్ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

Posted On: 27 JUN 2021 1:29PM by PIB Hyderabad

అహ్మదాబాద్ లోని అహ్మదాబాద్ మేనేజిమెంట్ అసోసియేషన్ సంస్థ ఆవరణలో జెన్ గార్డెన్.ను, కైజెన్ అకాడమీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్సింగ్ పద్ధతిలో ప్రారంభించారు.

 ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, జెన్ గార్డెన్, కైజెన్ అకాడమీ అంకితభావంతో కూడిన సంస్థలని,  సౌలభ్యానికి, భారత జపాన్ సంబంధాల అధునాతన తత్వానికి ప్రతీకలని అన్నారు. జెన్ గార్డెన్, కైజెన్ అకాడమీల స్థాపనలో జపాన్ కు చెందిన హ్యోగో నగర పాలక సంస్థ ప్రతినిధులు చేసిన కృషిని ప్రధానమంత్రి ఈ సందర్భంగా అభినందించారు. గవర్నర్ తోషిజోల్డోకు, హ్యోగో ఇంటర్నేషనల్ అసోసియేషన్.కు ప్రధాని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. భారత, జపాన్ సంబంధాలను పరిపుష్టం చేసేందుకు అవసరమైన కొత్త శక్తిని అందించిన ఇండో గుజరాత్ ఫ్రెండ్ షిప్ అసోసియేషన్.కు కూడా ప్రధాని అభినందనలు తెలిపారు.

  

  జపాన్.లోని ‘జెన్’ ప్రక్రియకు, భారతీయ ‘ధ్యానం’ ప్రక్రియకు ఉన్న పోలికలను గురించి ప్రధాని ప్రస్తావిస్తూ,..రెండు సంస్కృతుల్లోను బాహ్య ప్రగతి, అభ్యున్నతితో పాటుగా అంతర్గతమైన మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యం ఇచ్చారని ప్రధాని అన్నారు. జెన్ గార్డెన్ లో కూడా శాంతి, నిరాడంబరత, అభ్యున్నతి వంటి లక్షణాలను భారతీయులు కనుగొనవచ్చని, చాలా యుగాలుగా భారతీయులు యోగా ప్రక్రియ ద్వారా వీటిని అనుభూతిస్తూనే ఉన్నారని ప్రధాని చెప్పారు. ‘ధ్యానం’ అనే జ్ఞానోపదేశాన్ని బుద్ధుడు ప్రపంచానికి అందించాడని ప్రధాని చెప్పారు. అలాగే,, కైజెన్.కు గల బాహ్య నిర్వచనాన్ని, అంతరార్థాన్ని కూడా ప్రధాని ఈ సందర్భంగా వివరించారు. ‘నిరంతరాయంగా మెరుగుదల’ సాధించడం ఈ ప్రక్రియ ప్రత్యేకతగా ఆయన చెప్పారు.

  తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గుజరాత్ పరిపాలనా యంత్రాగంలో కైజెన్ ప్రక్రియను ప్రవేశపెట్టానని ప్రధాని గుర్తు చేసుకున్నారు. 2004లో గుజరాత్ పరిపాలనా శిక్షణలో కైజెన్ ప్రక్రియను ప్రవేశపెట్టారు. దీనిపై 2005లో అగ్రశ్రేణి సివిల్ సర్వీస్ ఉన్నతాధికారులకు ప్రత్యేకమైన శిక్షణను కూడా అందించారు. దీనితో పరిపాలనా ప్రక్రియలో సానుకూల దృక్పథం, నిర్మాణాత్మక వైఖరి పెరిగాయి,  ‘నిరంతరాయంగా మెరుగుదల’ ప్రతిబింబించింది. జాతీయ ప్రగతిలో పరిపాలనా ప్రక్రియకు ప్రాముఖ్యతను కొనసాగించాలని ప్రధాని సూచిస్తూ,  తాను ప్రధానమంత్రి అయ్యాక, కైజెన్ ప్రక్రియ అనుభవాన్ని ప్రధానమంత్రి కార్యాలయానికి, కేంద్రప్రభుత్వంలోని ఇతర శాఖలకు తీసుకువచ్చానని చెప్పారు. దీనితో వివిధ పరిపాలనా ప్రక్రియలు మరింత సరళతరం అయ్యాయని, కార్యాలయంలో చోటును మరింత గరిష్ట స్థాయిలో వినియోగించడం సాధ్యమైందని అన్నారు. కైజెన్ ప్రక్రియను పలు శాఖల్లో, సంస్థల్లో, కేంద్రప్రభుత్వానికి సంబంధించిన పలు పథకాల్లో వినియోగిస్తున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు. 

   జపాన్ తో తనకున్న వ్యక్తిగత సంబంధాల ప్రాధాన్యతను గురించి ప్రధానమంత్రి వివరించారు. జపాన్ ప్రజల అప్యాయత, వారి పని సంస్కృతి, నైపుణ్యాలు, క్రమశిక్షణ ఎంతో అభినందనీయమని చెప్పారు. భారతదేశాన్ని సందర్శించే జపాన్ ప్రజల ఆప్యాయతానురాగాలను గురించి ప్రధానమంత్రి అభినందిస్తూ,  “గుజరాత్ లో ఒక మినీ జపాన్ ను సృష్టించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

   ‘చైతన్య గుజరాత్ శిఖరాగ్ర సమావేశం’ పేరిట కొన్నేళ్లుగా నిర్వహించే కార్యక్రమంలో జపాన్ ప్రతినిధులు ఎంతో ఉత్సాహంగా పాలుపంచుకున్న అంశాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఆటోమెబైల్స్.నుంచి బ్యాంకింగ్, నిర్మాణ రంగం, ఫార్మారంగంతో పాటుగా వివిధ రంగాలకు చెందిన 135 కంపెనీలు తమ పెట్టుబడులకు గుజరాత్ ను గమ్య స్థానంగా చేసుకున్నారని ప్రధాని చెప్పారు. సుజుకీ మోటార్స్, హోండా మోటార్ సైకిల్, మిత్సుబిషి, టయోటా, హిటాచీ వంటి సంస్థలు గుజరాత్ లో ఉత్పత్తి ప్రక్రియలో నిమగ్నమయ్యాయని అన్నారు. స్థానిక యువజనుల నైపుణ్యాభివృద్ధికోసం వారు ఎన్నో సేవలందిస్తున్నారన్నారు. గుజరాత్ లో మూడు జపాన్ సంస్థలు వందలాది మంది యువజనులకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తున్నాయన్నారు. ఐ.ఐ.టి.లు వంటి సాంకేతిక విజ్ఞాన సంస్థలతో ప్రత్యేక ఒప్పందం ఏర్పాటు చేసుకుని ఈ శిక్షణ అందిస్తున్నాయన్నారు. అహ్మదాబాద్ లోని జెట్రో కంపెనీ కేంద్రం ఒకేసారి ఐదు కంపెనీలకు వసతి సదుపాయం, శిక్షణ అందిస్తోందన్నారు. దీనివల్ల పలు జపాన్ కంపెనీలకు ప్రయోజనం కలుగుతోందన్నారు.

  గుజరాత్ లో గోల్ఫ్ క్రీడా సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రధాని ప్రత్యేకంగా ప్రయత్నాలు చేశారు. ఇదే సందర్భంలో జపాన్ ప్రజలు గోల్ఫ్ క్రీడను ప్రేమిస్తారన్న అంశాన్ని ప్రధానమంత్రి తెలుసుకొన్నారు. అప్పట్లో గుజరాత్ లో గోల్ఫ్ సదుపాయాలు ఉండేవి కావు. ఇపుడు పరిస్థితి మారిందని, గుజరాత్ లో ఎన్నో గోల్ప్ కోర్సులు వచ్చేశాయని. అలాగే,  అక్కడ ఇపుడు జపాన్ రెస్టారెంట్లు, జపనీస్ భాష విస్తరిస్తున్నాయని ప్రధానమంత్రి చెప్పారు.  జపాన్ పాఠశాల విద్యా వ్యవస్థ ఆధారంగా గుజరాత్ లో నమూనా పాఠశాలలను ఏర్పాటు చేయాలన్న కోరికను ప్రధానమంత్రి వ్యక్తం చేశారు. జపాన్ పాఠశాల విద్యా వ్యవస్థలో ఆధునాతనత్వం, నైతికతల మిశ్రమాన్ని మేళవించాలన్న అభిప్రాయాన్ని ప్రధాని వ్యక్తం చేశారు. టోక్యో నగరంలో తాను తాయ్.మెయ్ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా జ్ఞప్తికి తెచ్చుకున్నారు.

  జపాన్ తో మనకు శతాబ్ధాల చరిత్ర కలిగిన ప్రాచీన సాంస్కృతిక సంబంధాలున్నాయని, భవిష్యత్తుపై ఉభయదేశాలకు ఉమ్మడి దార్శకనితక ఉందని ప్రధానమంత్రి అన్నారు. జపాన్ తో ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ స్థాయి భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు.

   జపాన్ నాయకత్వంతో తనకున్న వ్యక్తిగత సమానత్వ సంబంధాలను గురించి ప్రధాని ప్రస్తావిస్తూ, జపాన్ మాజీ ప్రధాని షింజో అబే గుజరాత్ సందర్శనను గుర్తు చేసుకున్నారు. షింజో అబే పర్యటనతో భారత్, జపాన్ సంబంధాలకు కొత్త ఊపు వచ్చిందన్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో  జపాన్ ప్రస్తుత ప్రధానమంత్రి యోషిహిడే సుగాతట్ తో తనకు ఉన్న సంబంధాలను, భావసారూప్యతను ఆయన ప్రస్తావించారు. ప్రపంచ స్థిరత్వానికి, సౌభాగ్యానికి భారత్, జపాన్ మధ్య స్నేహ సంబంధాలు మరింత ప్రముఖ పాత్ర పోషించాల్సి ఉందని, ప్రస్తుత సవాళ్ల నేపథ్యంలో ఉభయదేశాల మధ్య స్నేహం, భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతున్నాయని ఆయన అన్నారు.

   కైజన్ తోపాటుగా, జపాన్ సాంస్కృతిక సంబంధాలు భారతదేశంలో మరింతగా వ్యాపించాలని, ఉభయదేశాల మధ్య వాణిజ్య సంబంధాల అభివృద్ధిపై మరింత దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని అన్నారు.  టోక్యోలో ఒలింపిక్ క్రీడోత్సవాన్ని నిర్వహించబోతున్న నేపథ్యంలో జపాన్ కు, జపాన్ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు.



(Release ID: 1730743) Visitor Counter : 194