ప్రధాన మంత్రి కార్యాలయం
2021 జూన్ 27వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్ 2.0’ (‘మనసు లో మాట 2.0’) కార్యక్రమం 78వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
Posted On:
27 JUN 2021 11:43AM by PIB Hyderabad
ప్రియమైన నా దేశవాసులారా, నమస్కారం. తరచు గా ‘మన్ కీ బాత్ 2.0’ (‘మనసు లో మాట 2.0) కార్యక్రమం మీరు కురిపించే ప్రశ్నల తో నిండిపోతుంది. ఈ సారి ‘మన్ కీ బాత్ 2.0’ (‘మనసు లో మాట’2.0) కార్యక్రమాన్ని మరో రకం గా నిర్వహించాలని నేను అనుకుంటున్నాను. ఈ సారి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను. మరి, శ్రద్ధ గా వినండి నా ప్రశ్నల ను.
.. ఒలింపిక్స్ లో వ్యక్తిగత స్వర్ణ పతకాన్ని సాధించిన తొలి భారతీయ వ్యక్తి ఎవరు ?
.. ఒలింపిక్ క్రీడోత్సవాల లోని ఏ క్రీడావిభాగం లో భారతదేశం ఇప్పటి వరకు అత్యధిక పతకాల ను గెలుచుకొంది ?
.. ఒలింపిక్స్ లో అత్యధిక పతకాల ను సాధించింది ఎవరు ?
మిత్రులారా, నాకు సమాధానాలను పంపినా లేదా పంపకపోయినా, MyGov లో ఒలింపిక్స్ పై క్విజ్ లోని ప్రశ్నల కు మీరు జవాబు ను ఇస్తే, మీరు చాలా బహుమతులను గెలుచుకోగలరు. MyGov లోని ‘రోడ్ టు టోక్యో క్విజ్’లో ఇలాంటి ప్రశ్నలు అనేకం ఉన్నాయి. ‘రోడ్ టు టోక్యో క్విజ్’ లో మీరు పాల్గొనండి. ఇంతకు ముందు భారతదేశం ఎలాంటి సమర్థత ను చూపించింది ? టోక్యో ఒలింపిక్ క్రీడోత్సవాల కోసం ఇప్పుడు మన సన్నాహాలు ఏమిటి ? - ఇవన్నీ మీరే తెలుసుకోండి. ఇతరుల కు కూడా తెలియజేయండి. ఈ క్విజ్ పోటీ లో మీరు తప్పక పాల్గొనాలని మీ అందరినీ కోరుతున్నాను.
మిత్రులారా, టోక్యో ఒలింపిక్స్ విషయం పై మాట్లాడేటప్పుడు మిల్ఖా సింహ్ గారి లాంటి ప్రసిద్ధ ఎథ్ లీట్ ను ఎవరు మరచిపోగలరు ! కొద్ది రోజుల క్రితమే కరోనా ఆయన ను మన నుంచి లాక్కుంది. ఆయన ఆసుపత్రి లో ఉన్నప్పుడు, ఆయన తో మాట్లాడే అవకాశం నాకు లభించింది.
1964 టోక్యో ఒలింపిక్స్ లో భారతదేశాని కి ఆయన ప్రాతినిధ్యం వహించిన విషయాన్ని ఆయన కు నేను గుర్తు చేశాను. ఆయన తో మాట్లాడేటప్పుడు నేను ఈ సారి మన క్రీడాకారులు ఒలింపిక్స్ కోసం టోక్యో కు వెళ్తున్నప్పుడు మన క్రీడాకారుల ధైర్యాన్ని పెంచాలని, సందేశం అందించి వారి ని ప్రేరేపించవలసిందిని కోరాను. ఆయన కు ఆటల పై చాలా అంకితభావం, మక్కువ ఉన్నాయి. అనారోగ్యం తో ఉండి కూడాను ఆయన వెంటనే దానికి అంగీకరించారు. కానీ దురదృష్టవశాత్తు విధి మరో రకం గా తలచింది. ఆయన 2014 లో సూరత్ కు వచ్చిన విషయం నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. మేం ఓ నైట్ మారథన్ ను ప్రారంభించాం. ఆ సమయం లో జరిగిన పిచ్చాపాటీ కబుర్లలో క్రీడల గురించి మాట్లాడటం వల్ల నేను కూడా చాలా ప్రేరణ పొందాను. మిల్ఖా సింహ్ గారి కుటుంబ సభ్యులు అందరూ క్రీడల కు అంకితం అయ్యి, భారతదేశం గౌరవాన్ని పెంచుతూ వస్తూ ఉన్నారన్న సంగతి మనకు అందరికీ తెలిసిందే.
మిత్రులారా, ప్రతిభ, అంకితభావం, సంకల్ప బలం, క్రీడా స్ఫూర్తి.. ఇవన్నీ ఉన్న వారు చాంపియన్ అవుతారు. మన దేశం లో చాలా మంది ఆటగాళ్ళు చిన్న చిన్న నగరాల నుంచి, పట్టణాల నుంచి, గ్రామాల నుంచి వచ్చారు. టోక్యో క్రీడల కు వెళ్ళే చాలామంది క్రీడాకారుల జీవితం చాలా స్ఫూర్తి ని ఇస్తుంది. మీరు మన ప్రవీణ్ జాదవ్ గారి గురించి వింటే ఆయన చాలా కఠినమైన సంఘర్షణ ల ద్వారా ఇక్కడి దాకా చేరుకొన్నారని కూడా మీరు తెలుసుకుంటారు. ప్రవీణ్ జాదవ్ గారు మహారాష్ట్ర లోని సతారా జిల్లా లో ఒక గ్రామం లో నివసిస్తున్నారు. ఆయన విలువిద్య లో ఉత్తమ క్రీడాకారుడు. ఆయన తల్లితండ్రులు కుటుంబాన్ని పోషించడానికి కార్మికులు గా పనిచేస్తున్నారు. ఇప్పుడు వారి కుమారుడు మొదటి సారి ఒలింపిక్స్ క్రీడల లో పాల్గొనేందుకు టోక్యో కు వెళ్తున్నాడు. ఇది అతని తల్లితండ్రులు మాత్రమే కాక మనం అందరం గర్వించదగ్గ విషయం. అదే విధం గా నేహా గోయల్ అనే మరో క్రీడాకారిణి కూడా ఉన్నారు. టోక్యో కు వెళ్లే మహిళల హాకీ జట్టు లో నేహా సభ్యురాలు. ఆమె తల్లి, సోదరీమణులు కుటుంబాన్ని పోషించడానికి సైకిల్ ఫ్యాక్టరీ లో పనిచేస్తున్నారు. నేహా మాదిరి గానే దీపికా కుమారి జీవితం కూడా ఒడుదొడుకుల తో నిండి ఉంది. దీపిక తండ్రి ఆటో రిక్శా ను నడుపుతున్నారు. ఆమె తల్లి ఒక నర్సు. ఇప్పుడు చూడండి- టోక్యో ఒలింపిక్స్ లో మహిళ ల విలువిద్య క్రీడ లో భారతదేశం నుంచి పాల్గొనే ఏకైక క్రీడాకారిణి దీపిక. ప్రపంచ నంబర్ వన్ విలువిద్య క్రీడాకారిణి దీపిక కు ఇవే మన అందరి శుభాకాంక్షలు.
మిత్రులారా, మనం జీవితం లో ఏ దశ కు చేరుకొన్నప్పటికీ, మనం ఎంత ఎత్తు కు చేరుకొన్నప్పటికీ, భూమి తో ఈ సంబంధం ఎల్లప్పుడూ మన మూలాల తో ముడిపడి ఉంటుంది. పోరాటం తరువాత సాధించిన విజయం లోని ఆనందం ఎంతో ఉంటుంది. టోక్యో కు వెళ్ళే బృందం సభ్యులు బాల్యం లో అభ్యాసం చేయడం లో ఎన్నో అడ్డంకులు ఎదురైనప్పటికీ, ఆట ను వదులుకోలేదు; వారు ఆట తో ముడిపడే ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని ముజఫర్‌నగర్ కు చెందిన ప్రియాంక గోస్వామి గారి జీవితం కూడా చాలా నేర్పిస్తుంది. ప్రియాంక తండ్రి బస్ కండక్టర్. పతక విజేత లు పొందే బ్యాగ్ ను చిన్నతనం లో ప్రియాంక ఇష్టపడింది. ఈ ఆకర్షణ లో ఆమె మొదటి సారి రేస్-వాకింగ్ పోటీ లో పాల్గొన్నారు. ఇప్పుడు- ఈ రోజు ఆమె అందులో పెద్ద చాంపియన్.
జావెలిన్ త్రో లో పాల్గొంటున్న శివ్ పాల్ సింహ్ గారు బనారస్ కు చెందిన వారు. శివ్ పాల్ గారి కుటుంబం మొత్తం ఈ ఆట తో ముడిపడి ఉంది. ఆయన తండ్రి, బాబాయి, సోదరుడు.. అందరూ జావెలిన్ త్రో లో నిపుణులు. కుటుంబ వారసత్వం టోక్యో ఒలింపిక్స్ లో పని చేయబోతోంది. టోక్యో ఒలింపిక్ క్రీడోత్సవాలకు వెళ్ళే చిరాగ్ శెట్టి, అతని భాగస్వామి సాత్విక్ సాయిరాజ్ ల ధైర్యం కూడా స్ఫూర్తిదాయకం. ఇటీవల చిరాగ్ తాతయ్య కరోనా తో మరణించారు. సాత్విక్ కు కూడా గత సంవత్సరం కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ ఇబ్బందులు ఉన్నప్పటికీ వారు ఇద్దరూ పురుషుల డబుల్ షటిల్ పోటీ లో వారి ఉత్తమ ప్రతిభ ను ప్రదర్శించేందుకు సన్నద్ధం అవుతున్నారు.
నేను మీకు మరొక క్రీడాకారుడి ని పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆయన హరియాణా లోని భివానీ కి చెందిన మనీష్ కౌశిక్ గారు. మనీష్ గారు ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. చిన్నతనం లో పొలాల లో పనిచేస్తున్నప్పుడు మనీష్ కు బాక్సింగ్ అంటే ఇష్టం ఏర్పడింది. ఈ రోజు ఆ అభిరుచే ఆయన ను టోక్యో కు తీసుకుపోతోంది. మరొక క్రీడాకారిణి సి.ఎ. భవానీ దేవి గారు. ఆమె పేరు భవాని.. ఆమె కత్తి పోరాటం లో నిపుణురాలు. చెన్నైకి చెందిన భవాని ఒలింపిక్స్ కు అర్హత ను సాధించిన తొలి భారతీయ ఫెన్సర్. భవాని గారు శిక్షణ ను కొనసాగించేందుకు ఆమె తల్లి తన ఆభరణాల ను తనఖా పెట్టినట్లు నేను ఎక్కడో చదివాను.
మిత్రులారా, అసంఖ్యాకమైన పేరు లు ఉన్నాయి. కానీ ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) లో ఈ రోజు నేను కొన్ని పేరుల ను మాత్రమే ప్రస్తావించగలిగాను. టోక్యో కు వెళ్లే ప్రతి క్రీడాకారుడు/ ప్రతి క్రీడాకారిణి జీవితం లో దాని కోసం సొంత పోరాటం ఉంది. ఇది చాలా సంవత్సరాల కృషి. వారు వారి కోసం మాత్రమే కాకుండా దేశం కోసం వెళ్తున్నారు. ఈ ఆటగాళ్ళు భారతదేశ గౌరవాన్ని పెంచాలి. ప్రజల హృదయాలను కూడా గెలుచుకోవాలి. అందుకే నా దేశవాసుల కు కూడా నేను సలహా ఇవ్వాలనుకుంటున్నాను.. మనం ఈ ఆటగాళ్ళ పై తెలిసి గానీ తెలియకుండా గానీ ఒత్తిడి తీసుకు రాకూడదు. మంచి మనసు తో వారికి మద్దతు ఇవ్వండి. ప్రతి క్రీడాకారుడిలో/ ప్రతి క్రీడాకారిణి లో
ఉత్సాహాన్ని పెంచండి.
సామాజిక మాధ్యమాల లో #Cheer4India తో మీరు ఈ ఆటగాళ్లకు మీ శుభాకాంక్షల ను తెలియజేయవచ్చు. మీరు మరింత వినూత్నమైన పని ని చేయాలి అనుకొంటే ఖచ్చితం గా అది కూడా చేయండి. మన ఆటగాళ్ల కోసం దేశం అంతా కలిసి ఏదైనా చేయాలనే ఆలోచన మీకు వస్తే మీరు దానిని నాకు తప్పక నాకు పంపించండి. టోక్యో కు వెళ్లే మన ఆటగాళ్ల కు మనందరం కలిసి సమర్థన ను తెలియజేద్దాం. Cheer4India!!!Cheer4India!!!Cheer4India!!!
ప్రియమైన నా దేశవాసులారా, కరోనా కు వ్యతిరేకం గా మన దేశవాసుల పోరాటం కొనసాగుతోంది. ఈ పోరాటంలో మనం చాలా అసాధారణమైన మైలురాళ్లను కూడా సాధిస్తున్నాం. కొద్ది రోజుల క్రితం మన దేశం అపూర్వమైన పని చేసింది. టీకా కార్యక్రమంలోని తరువాతి దశ జూన్ 21 న ప్రారంభమైంది. అదే రోజున దేశం 86 లక్షల మందికి పైగా వాక్సీన్ ను ఉచితం గా అందించిన రికార్డు ను సాధించింది. అదీనూ ఒకే ఒక రోజు లో!. భారత ప్రభుత్వం ద్వారా ఇంత పెద్ద సంఖ్యలో ఉచిత టీకా లు- అది కూడా కేవలం ఒక్క రోజు లో! సహజంగానే ఇది చర్చనీయాంశమైంది.
మిత్రులారా, ఒక సంవత్సరం క్రితం టీకా ఎప్పుడు వస్తుంది ? అనే ప్రశ్న అందరి ముందు ఉండేది. ఈ రోజు మనం ఒకే రోజు లో లక్షల కొద్దీ మంది కి మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సీన్ ను ఉచితం గా ఇప్పించుకోగలుగుతున్నాం. ఇది న్యూ ఇండియా తాలూకు బలం.
మిత్రులారా, టీకామందు సంబంధి భద్రత ను దేశం లోని ప్రతి ఒక్కరు పొందాలి. ఈ విషయం లో మనం నిరంతరం గా ప్రయత్నాల ను చేయవలసి ఉంది. వాక్సీన్ ను వేసుకోవడం లో ఉన్న సంకోచాన్ని దూరం చేసేందుకు అనేక సంస్థ లు ముందుకు వచ్చాయి. సమాజం లోని ప్రజలు కూడా ఈ విషయం లో చొరవ ను తీసుకొంటున్నారు. అందరూ కలిసి చాలా మంచి పని ని చేస్తున్నారు. రండి.. ఈ రోజు కూడా ఒక గ్రామానికి వెళ్లి, టీకామందు ను గురించి అక్కడి వ్యక్తుల తో మాట్లాడుదాం. మధ్య ప్రదేశ్ లోని బైతూల్ జిల్లా లో ఉన్న డులారియా గ్రామానికి వెళ్దాం.
ప్రధాన మంత్రి: హెలో!
రాజేశ్: నమస్కారం సర్!
ప్రధాన మంత్రి: నమస్కారమండీ.
రాజేశ్: నా పేరు రాజేశ్ హిరావే. మాది భీంపూర్ బ్లాక్ లోని డులారియా గ్రామ పంచాయతీ సర్.
ప్రధాన మంత్రి: రాజేశ్ గారూ.. మీ గ్రామం లో కరోనా పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలని నేను మిమ్మల్ని పిలిచాను.
రాజేశ్: సర్. ఇక్కడ కరోనా పెద్దగా ఏమీ లేదు సర్.
ప్రధాన మంత్రి: ప్రస్తుతం ప్రజలు అనారోగ్యం తో లేరా ?
రాజేశ్: అవును సర్.
ప్రధాన మంత్రి: గ్రామ జనాభా ఎంత ? గ్రామం లో ఎంత మంది ఉన్నారు ?
రాజేశ్: గ్రామం లో 462 మంది పురుషులు, 332 మంది మహిళలు ఉన్నారు సర్.
ప్రధాన మంత్రి: సరే, రాజేశ్ గారూ.. మీరు టీకా తీసుకున్నారా ?
రాజేశ్: లేదు సర్. ఇంకా తీసుకోలేదు.
ప్రధాన మంత్రి: ఓహ్! ఎందుకు తీసుకోలేదు ?
రాజేశ్: సర్... ఇక్కడ కొంతమంది వాట్సాప్ లో కొంత గందరగోళం కలిగించారు సర్. దాంతో ప్రజలు అయోమయం లో పడ్డారు సర్.
ప్రధాన మంత్రి: కాబట్టి మీ మనసులో కూడా భయం ఉందా?
రాజేశ్: అవును సర్. ఇలాంటి పుకార్లు గ్రామమంతా వ్యాపించాయి సర్.
ప్రధాన మంత్రి: అయ్యో.. టీకా విషయం లో గందరగోళం గురించా మీరు మాట్లాడేది! రాజేశ్ గారూ.. చూడండి ..
రాజేశ్: సర్.
ప్రధాన మంత్రి: భయాన్ని తొలగించుకొమ్మని మీకు, మీ ఊరి లోని సోదర సోదరీమణుల కు నేను చెప్తున్నాను.
రాజేశ్: సర్.
ప్రధాన మంత్రి: మన దేశం లో 31 కోట్ల మందికి పైగా ప్రజలు టీకా మందు ను వేయించుకొన్నారు.
రాజేశ్: సర్
ప్రధాన మంత్రి: మీకు తెలుసా! నేను కూడా టీకామందు తాలూకు రెండు డోసులు వేయించుకొన్నాను.
రాజేశ్: అవును సర్.
ప్రధాన మంత్రి: మా అమ్మ కు దాదాపు 100 సంవత్సరాలు. ఆమె కూడా రెండు డోసు లు తీసుకొన్నారు. కొన్ని సార్లు ఎవరికైనా జ్వరం లాంటివి వస్తాయి. కానీ అవి చాలా మామూలు. కొన్ని గంటలు మాత్రమే ఉంటాయి. టీకామందు తీసుకోక పోవడం అనేది చాలా ప్రమాదకరం.
రాజేశ్: అవును సర్.
ప్రధాన మంత్రి: దీని ద్వారా మీకు మీరుగా ప్రమాదం లో పడటమే కాదు- మీ కుటుంబాన్ని, గ్రామాన్ని కూడా ప్రమాదం లో పడేసే ప్రమాదం పొంచి ఉంది.
రాజేశ్: సర్.
ప్రధాన మంత్రి: రాజేశ్ గారూ.. కాబట్టి వీలైనంత త్వరగా వాక్సీన్ తీసుకోండి. గ్రామం లోని ప్రతి ఒక్కరికీ భారత ప్రభుత్వం వాక్సీన్ ను ఉచితం గా ఇస్తోందని, 18 ఏళ్లు మించిన వయస్సు ఉన్న వారందరికీ టీకా ఉచితం అని చెప్పండి.
రాజేశ్: సర్ .. సరే సర్.
ప్రధాన మంత్రి: కాబట్టి మీరు ఈ విషయాన్ని గ్రామంలోని ప్రజలకు కూడా చెప్పాలి. గ్రామం లో ఈ భయపూరిత వాతావరణానికి కారణమే లేదు.
రాజేశ్: వదంతి ని వ్యాప్తి చేయడం వల్ల ప్రజలు చాలా భయపడ్డారు సర్. టీకా వల్ల జ్వరం వస్తుందని, దాంతో వ్యాధి పెరిగి మరణానికి కూడా దారి తీస్తుందని పుకారులు వచ్చాయి సర్.
ప్రధాన మంత్రి: అలాగా.. ఈ రోజుల లో రేడియో ఉంది, టీవీ ఉంది. వీటిలో చాలా వార్త లు వస్తాయి. కాబట్టి ప్రజల కు వివరించడం చాలా సులభం అవుతుంది.
చూడండి.. గ్రామం లోని అందరూ టీకామందు ను తీసుకొన్న పల్లె లు కూడా భారతదేశం లో చాలానే ఉన్నాయి. అంటే గ్రామాని కి చెందిన 100 శాతం మంది టీకామందు తీసుకున్న గ్రామాలు. నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను..
రాజేశ్: సర్.
ప్రధాన మంత్రి: కశ్మీర్ లో బాందీపురా జిల్లా ఉంది. ఆ జిల్లా లో వ్యవన్ అనే గ్రామం ప్రజలు 100 శాతం వాక్సీన్ ను లక్ష్యం గా పెట్టుకొని దానిని సాధించారు. ఈ కశ్మీర్ గ్రామం లో ఉన్న 18 ఏళ్లు పైబడిన వయస్సు వారందరికీ టీకామందు ను వేయడమైంది. నాగాలాండ్ లోని మూడు గ్రామాల లో కూడా 100 శాతం టీకా వేసుకొన్నట్లు నాకు తెలిసింది.
రాజేశ్: సర్ ...
ప్రధాన మంత్రి: రాజేశ్ గారూ.. మీరు ఈ సంగతి ని మీ గ్రామానికి, మీ చుట్టుపక్కల గ్రామాలకు కూడా తెలియజేయాలి. మీరు చెప్పిన విషయం కేవలం ఒక భ్రమ. అవి పుకారు లు మాత్రమే.
రాజేశ్: అవును ...
ప్రధాన మంత్రి: కాబట్టి గందరగోళానికి సమాధానం ఏమిటంటే మీరే స్వయం గా టీకా వేసుకొని, అందరినీ అందుకు ఒప్పించడం. ఆ పని ని మీరు చేస్తారు కదా..!
రాజేశ్: సరే సర్.
ప్రధాన మంత్రి: తప్పకుండా చేస్తారు గా!
రాజేశ్: అవును సర్. అవును సర్. మీతో మాట్లాడటం వల్ల టీకా వేయించుకొని, దాని ని గురించి ప్రజలకు తెలియజేయాలని అనుకుంటున్నాను సర్.
ప్రధాన మంత్రి: సరే. నాతో మాట్లాడేందుకు మీ గ్రామం నుంచి ఇంకా ఎవరైనా ఉన్నారా ?
రాజేశ్: అవును సర్.
ప్రధాన మంత్రి: ఎవరు మాట్లాడతారు ?
కిశోరీలాల్: హెలో సర్ ...నమస్కారం.
ప్రధాన మంత్రి: నమస్కారమండీ.. మీరు ఎవరు మాట్లాడుతున్నారు?
కిశోరీలాల్: సర్.. నా పేరు కిశోరీలాల్ దూర్వే.
ప్రధాన మంత్రి: కిశోరీలాల్ గారూ.. నేను ఇప్పటి వరకు రాజేశ్ గారి తో మాట్లాడుతున్నాను.
కిశోరీలాల్: మరే సర్.
ప్రధాన మంత్రి: ప్రజలు టీకా పై ఇంకొక రకం గా మాట్లాడుతున్నారని ఆయన చాలా బాధ తో చెప్పారు.
కిశోరీలాల్: అవును సర్
ప్రధాన మంత్రి: మీరు కూడా ఇలాంటివి విన్నారా ?
కిశోరీలాల్: అవును సర్ .. నేను విన్నాను సర్ ..
ప్రధాన మంత్రి: మీరేం విన్నారు ?
కిశోరీలాల్: సమీపం లోని మహారాష్ట్ర లో బంధువులు ఉన్న కొందరు- అక్కడి ప్రజలు వాక్సీన్ వేయించుకోవడం ద్వారా చనిపోతున్నట్లు పుకారుల ను వ్యాపింపజేశారు సర్. కొందరు చనిపోతున్నారని, కొందరు అనారోగ్యానికి గురవుతున్నారని వదంతులు పుట్టించారు సర్. ప్రజల లో ఎక్కువ గందరగోళం ఉంది కాబట్టి తీసుకోవడం లేదు సర్.
ప్రధాన మంత్రి: లేదు .. అసలు వాళ్ళేమంటారు ? ఇప్పుడు కరోనా పోయిందని అంటున్నారా ?
కిశోరీలాల్: అవును సర్.
ప్రధాన మంత్రి: కరోనా తో ఏమీ కాదని చెప్తున్నారా ?
కిశోరీలాల్: లేదు సర్. కరోనా పోయిందని చెప్పడం లేదు. కరోనా ఉంది కానీ, టీకా తీసుకోవడం వల్ల జబ్బు పడుతున్నారని, అందరూ చనిపోతున్నారని చెప్తున్నారు సర్.
ప్రధాన మంత్రి: అయితే టీకా కారణంగా చనిపోతున్నారని చెప్తున్నారా ?
కిశోరీలాల్: మాది ఆదివాసీ ప్రాంతం సర్. వాళ్లు చాలా త్వరగా భయపడతారు. .. పుకారులు వ్యాప్తి చెందుతున్నందువల్ల ప్రజలు వాక్సీన్ వేయించుకోవడం లేదు సర్.
ప్రధాన మంత్రి: కిశోరీలాల్ గారూ.. చూడండి ..
కిశోరీలాల్: సర్ ..
ప్రధాన మంత్రి: పుకారుల ను వ్యాప్తి చేసే ఇటువంటి వ్యక్తులు పుకారుల ను వ్యాప్తి చేస్తూనే ఉంటారు.
కిశోరీలాల్: అవును సర్.
ప్రధాన మంత్రి: మనం ప్రాణాల ను కాపాడుకోవాలి. మన గ్రామస్తుల ను కాపాడాలి. మన దేశవాసుల ను కాపాడాలి. కరోనా పోయిందని ఎవరైనా చెప్పారంటే ఆ భ్రమ లో ఉండకండి.
కిశోరీలాల్: సర్.
ప్రధాన మంత్రి: ఈ వ్యాధికారక వైరస్ తన రూపాన్ని మార్చుకొంటూ ఉంటుంది.
కిశోరీలాల్: అవును సర్.
ప్రధాన మంత్రి: ఇది రూపం మారుతుంది. కొత్త రూపాలను తీసుకొన్న తరువాత అది ప్రజలను చేరుకొంటుంది.
కిశోరీలాల్: అవును సర్.
ప్రధాన మంత్రి: దాని నుంచి తప్పించుకోవడానికి మనకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి కరోనా కోసం తయారుచేసిన నియమాలు- మాస్క్ ను ధరించడం, సబ్బు తో తరచు గా చేతులను కడుక్కొంట ఉండటం, ఒక వ్యక్తి కి దూరాన్ని పాటించడం. దాంతో పాటు టీకా లు వేయడం మరొక మార్గం. అది కూడా మంచి రక్షణ కవచం. దాని ని గురించి ఆలోచించండి.
కిశోరీలాల్: సర్
ప్రధాన మంత్రి: సరే.. కిశోరీలాల్ గారూ.. ఈ విషయం చెప్పండి.
కిశోరీలాల్: సర్.
ప్రధాన మంత్రి: ప్రజలు మీతో మాట్లాడేటప్పుడు మీరు ప్రజల కు ఈ విషయాన్ని ఎలా వివరిస్తారు ? లేదా మీరు కూడా పుకార్ల మాయ లో పడిపోతారా ?
కిశోరీలాల్: వివరించడం కాదు సర్.. ఆ వ్యక్తులు ఎక్కువైతే, మనం కూడా భయపడిపోతాం కదా సర్.
ప్రధాన మంత్రి: చూడండి.. కిశోరీలాల్ గారూ.. నేను ఈ రోజు మీతో మాట్లాడాను. మీరు నా స్నేహితులు.
కిశోరీలాల్: సర్
ప్రధాన మంత్రి: మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ప్రజల భయాన్ని తొలగించాలి. మీరు దాన్ని తొలగిస్తారా ?
కిశోరీలాల్: అవును సర్. సర్.. మేం ప్రజల భయాన్ని తొలగిస్తాం సర్. నేనే స్వయం గా ఆ పని ని చేస్తాను.
ప్రధాన మంత్రి: చూడండి.. పుకారుల ను పట్టించుకోవద్దు.
కిశోరీలాల్: సర్
ప్రధాన మంత్రి: మీకు తెలుసా.. ఈ టీకా తయారీ కోసం మన శాస్త్రవేత్తలు చాలా కష్టపడ్డారు.
కిశోరీలాల్: అవును సర్.
ప్రధాన మంత్రి: సంవత్సరమంతా రాత్రనక పగలనక చాలా మంది గొప్ప శాస్త్రవేత్త లు పని చేశారు. అందుకే మనం సైన్స్ ను విశ్వసించాలి. శాస్త్రవేత్తల ను నమ్మాలి. ఈ అబద్ధాలను వ్యాప్తి చేసే వ్యక్తుల కు మళ్లీ మళ్లీ వివరించాలి. ఇంత మంది టీకా వేయించుకొన్నారు.. ఏమీ జరుగదు అని వారికి చెప్పాలి.
కిశోరీలాల్: సరే సర్.
ప్రధాన మంత్రి: పుకారుల నుంచి సురక్షితం గా ఉండాలి. గ్రామాన్ని కూడా రక్షించాలి.
కిశోరీలాల్: అవును సర్.
ప్రధాన మంత్రి: రాజేశ్ గారు, కిశోరీ లాల్ గారు.. మీలాంటి నా మిత్రులు కేవలం మీ ఊళ్లో అనే కాకుండా ఇతర గ్రామాల లో సైతం ఈ పుకారుల ను ఆపడానికి, నేను మాట్లాడిన విషయాన్ని ప్రజల కు చెప్పడానికి పని ని చేయాలి.
కిశోరీలాల్: సరే సర్.
ప్రధాన మంత్రి: చెప్పండి.. నా పేరు చెప్పండి.
కిశోరీలాల్: చెప్తాం సర్. ప్రజల కు అర్థం చేయిస్తాం సర్. నేను కూడా టీకా తీసుకొంటాను సర్.
ప్రధాన మంత్రి: చూడండి.. మీ గ్రామాని కి నా శుభాకాంక్షలు.
కిశోరీలాల్: సర్.
ప్రధాన మంత్రి: తప్పకుండా టీకా తీసుకోండి అని అందరికీ చెప్పండి ...
కిశోరీలాల్: సర్ ...
ప్రధాన మంత్రి: తప్పక టీకా ను తీసుకోండి.
కిశోరీలాల్: సరే సర్.
ప్రధాన మంత్రి: ఈ పని లో గ్రామం లోని మహిళల ను, మన మాతృమూర్తుల ను, సోదరీమణుల ను కలుపుకోండి.
కిశోరీలాల్: సర్
ప్రధాన మంత్రి: వారిని మీతో పాటు చురుకు గా ఉంచండి.
కిశోరీలాల్: సరే సర్
ప్రధాన మంత్రి: కొన్నిసార్లు తల్లులు, సోదరీమణులు చెప్పే విషయాలను ప్రజలు త్వరగా అంగీకరిస్తారు.
కిశోరీలాల్: అవును సర్.
ప్రధాన మంత్రి: మీ గ్రామం లో టీకాలు వేయడం పూర్తయినప్పుడు మీరు నాకు చెప్తారా ?
కిశోరీలాల్: అవును సర్. చెప్తాం సర్.
ప్రధాన మంత్రి: తప్పకుండా చెప్తారా ?
కిశోరీలాల్: అవును సర్.
ప్రధాన మంత్రి: చూడండి.. నేను మీ జాబు కోసం వేచి ఉంటాను.
కిశోరీలాల్: సరే సర్.
ప్రధాన మంత్రి: రాజేశ్ గారు, కిశోర్ గారు.. చాలా ధన్యవాదాలు. మీతో మాట్లాడే అవకాశం వచ్చింది.
కిశోరీలాల్: ధన్యవాదాలు సర్. మీరు మాతో మాట్లాడారు. మీకు కూడా చాలా ధన్యవాదాలు సర్.
మిత్రులారా, భారతదేశం లోని వివిధ గ్రామాల ప్రజలు- మన ఆదివాసీ సోదరులు, ఆదివాసీ సోదరీమణులు ఈ కరోనా కాలం లో వారి శక్తి ని, అవగాహన ను ఎలా చూపించారు అనే విషయం ప్రపంచానికి ఒక అధ్యయనాంశం అవుతుంది. గ్రామాల ప్రజలు క్వారన్టీన్ కేంద్రాల ను ఏర్పాటు చేసుకొన్నారు. స్థానిక అవసరాల ను దృష్టి లో పెట్టుకొని కోవిడ్ ప్రోటోకాల్ ను తయారు చేశారు. గ్రామ ప్రజలు - ఎవరినీ ఆకలి తో నిద్రపోనివ్వలేదు. వ్యవసాయ పనుల ను కూడా ఆపలేదు. సమీప నగరాల కు పాలు, కూరగాయలు- ఇవన్నీ రోజూ చేరుకొంటూనే ఉన్నాయి. ఈ విధం గా గ్రామాలు తమ ను తాము చూసుకోవడం తో పాటు ఇతరుల ను కూడా చూసుకున్నాయి. అదేవిధం గా టీకా ప్రచారం లో కూడా మనం అదే చేస్తూనే ఉండాలి. మనకు అవగాహన ఉండాలి. ఇతరులకు అవగాహన కల్పించాలి. గ్రామాల్లోని ప్రతి వ్యక్తి వాక్సీన్ వేయించుకోవాలి. అది ప్రతి గ్రామ లక్ష్యం. గుర్తు పెట్టుకోండి- నేను ప్రత్యేకం గా మీకు చెప్పాలనుకుంటున్నాను.. మీరు మీ మనస్సు లో మీకు మీరే ఒక ప్రశ్న ను వేసుకోండి. ప్రతి ఒక్కరూ విజయవంతం కావాలని కోరుకుంటారు. కానీ నిర్ణయాత్మక విజయ మంత్రం ఏమిటి ? నిర్ణయాత్మక విజయ మంత్రం – నిరంతరత. అందువల్ల, మనం మందగించకూడదు. ఏ భ్రమలోనూ జీవించకూడదు. మనం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి. కరోనా పై గెలవాలి.
ప్రియమైన నా దేశవాసులారా, ఇప్పుడు రుతుపవనాలు కూడా మన దేశాని కి వచ్చాయి. మేఘాలు వర్షం కురిపించినప్పుడు అవి కేవలం మన కోసం వర్షాన్ని కురిపించవు. రాబోయే తరాల కోసం కూడా మేఘాలు వర్షిస్తాయి. వాన నీరు నేల లోకి ఇంకడం తో పాటు భూమి పై ఉండే నీటి స్థాయి ని కూడా మెరుగుపరుస్తుంది. అందుకే జల సంరక్షణ ను దేశాని కి చేసే సేవ గా నేను భావిస్తున్నాను. మీరు కూడా చూసి ఉంటారు- మనలో చాలా మంది ఈ పని ని బాధ్యత గా తీసుకుంటున్నారు. అలాంటి వారిలో ఒకరు ఉత్తరాఖండ్ లోని పౌడీ గఢ్ వాల్ కు చెందిన సచ్చిదానంద్ భారతి గారు. ఆయన ఒక ఉపాధ్యాయుడు. ఆయన తన రచన ల ద్వారా ప్రజల కు చాలా మంచి విద్య ను అందించారు. ఆయన కృషి కారణం గా ప్రస్తుతం పౌడీ గఢ్ వాల్ లోని ఉఫ్ రైంఖాల్ ప్రాంతం లో పెద్ద నీటి సంక్షోభం ముగిసింది. ఒకప్పుడు ప్రజలు నీటి కోసం ఆరాటపడిన చోట నేడు ఏడాది పొడవునా నీటి సరఫరా ఉంది.
మిత్రులారా, పర్వతాల లో నీటి సంరక్షణ కు ఒక సాంప్రదాయిక పద్ధతి ఉంది, దీనిని ‘చాల్ ఖాల్’ అని కూడా అంటారు. అంటే, నీటి ని నిలవ చేయడానికి ఒక పెద్ద గొయ్యి ని తవ్వడమన్న మాట. భారతి గారు కొన్ని కొత్త పద్ధతుల ను కూడా జోడించారు. ఆయన కొన్ని పెద్ద, చిన్న చెరువుల ను నిర్మించారు. వాటి వల్ల ఉఫ్ రైంఖాల్ కొండ లు పచ్చ గా మారడమే కాకుండా ప్రజల తాగునీటి సమస్య కూడా పోయింది. భారతి గారు ఇలాంటి 30 వేల కు పైగా నీటి వనరుల ను నిర్మించారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 30 వేలు! ఆయన భగీరథ ప్రయత్నం నేటికీ కొనసాగుతూనే ఉంది. అది చాలా మందికి స్ఫూర్తి ని ఇస్తోంది.
మిత్రులారా, అదే విధం గా ఉత్తర్ ప్రదేశ్ లోని బాందా జిల్లా లో ఉన్న అన్థావ్ గ్రామ ప్రజలు కూడా భిన్నమైన ప్రయత్నం చేశారు. వారు వారి ఉద్యమానికి చాలా ఆసక్తికరమైన పేరు ను పెట్టుకొన్నారు. అది ‘ఖేత్ కా పానీ ఖేత్ మేఁ, గాఁవ్ కా పానీ గాఁవ్ మేఁ’. అంటే ‘పొలం నీళ్ళు పొలం లోనే, ఊరి నీళ్ళు ఊరిలోనే’ అని. ఈ ఉద్యమం లో భాగం గా గ్రామం లోని అనేక వందల ఎకరాల విస్తీర్ణం లోని పొలాల లో ఎత్తైన కట్టల ను నిర్మించారు. ఈ కారణం గా వర్షపు నీరు పొలం లో సేకరణ ప్రారంభమై భూమి లోకి వెళ్ళడం మొదలైంది. ఇప్పుడు ఈ ప్రజలందరూ పొలాల కట్టలపై మొక్కల ను నాటాలని ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు రైతుల కు నీరు, మొక్కలు, డబ్బు- మూడూ లభిస్తాయి. వారి మంచి పనుల ద్వారా ఆ గ్రామాని కి సుదూర ప్రాంతాలలో కూడా గుర్తింపు లభించింది.
మిత్రులారా, వీటన్నిటి నుంచి ప్రేరణ ను పొంది మన చుట్టూ ఉన్న నీటి ని ఏ విధంగానైనా ఆదా చేసుకోగలగాలి. నీటి ని మనం కాపాడుకోవాలి. ముఖ్యమైనటువంటి ఈ రుతుపవనాల కాలాన్ని మనం కోల్పోవలసిన అవసరం లేదు.
ప్రియమైన నా దేశవాసులారా, ‘‘నాస్తి మూలమ్ అనౌషధం’’ అని మన గ్రంథాల లో చెప్పారు.
ఈ మాటల కు, ఔషధ గుణాలు లేని మొక్కంటూ భూమి మీద లేదు అని భావం. ఇలాంటి చెట్లు, మొక్కలు మన చుట్టూ చాలానే ఉన్నాయి. వాటిలో అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. కానీ చాలా సార్లు వాటి గురించి కూడా మనకు తెలియదు! నైనీతాల్ కు చెందిన ఓ సహచరుడు పరితోష్ అనే సోదరుడు ఇదే విషయం పై నాకు ఒక లేఖ ను పంపారు. కరోనా వచ్చిన తరువాత మాత్రమే గిలోయ్, అనేక ఇతర మొక్క ల అద్భుత వైద్య లక్షణాల ను గురించి తాను తెలుసుకున్నట్టు ఆయన రాశారు. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) శ్రోత లు అందరూ మీ చుట్టూ ఉన్న వృక్ష సంపద ను గురించి తెలుసుకోవాలి అంటూ పరితోష్ గారు సూచించారు. వారంతా ఇతరుల కు కూడా చెప్పాలని కూడా ఆయన కోరారు. నిజానికి ఇది మన పురాతన వారసత్వం, మనం దీన్ని ఎంతో ఆదరించాలి. ఈ దిశ లో మధ్య ప్రదేశ్ లోని సత్ నా కు చెందిన శ్రీమాన్ రామ్‌లోటన్ కుశ్ వాహా గారు, చాలా ప్రశంసనీయమైన పని ని చేశారు. రామ్‌లోటన్ గారు తన పొలం లో దేశీయ సంగ్రహాలయాన్ని ఏర్పాటు చేశఆరు. ఈ మ్యూజియమ్ లో ఆయన వందల కొద్దీ ఔషధ మొక్కల ను, విత్తనాల ను సేకరించి భద్రపరచారు. వాటిని చాలా దూరం నుంచి ఇక్కడ కు తీసుకు వచ్చారు. ఇవి కాకుండా ఆయన ప్రతి ఏటా అనేక రకాల కూరగాయల ను కూడా పండిస్తారు. ఈ దేశీయ మ్యూజియం ను, రామ్‌లోటన్ గారి తోట ను, సందర్శించేందుకు ప్రజలు వస్తారు. దాని నుంచి వారు ఎంతో నేర్చుకొంటారు. నిజమే, ఇది చాలా మంచి ప్రయోగం. దేశం లోని వివిధ ప్రాంతాల లో కూడా ఇలా చేయవచ్చును. మీలో అలాంటి ప్రయత్నాన్ని చేయగల వారు ఆ పని ని తప్పక చేయాలి అని నేను కోరుకుంటున్నాను. దీనితో మీ ఆదాయానికి కొత్త మార్గాలు తెరచుకోవచ్చును. మరొక లాభం కూడా కలుగుతుంది, అది ఏమిటి అంటే స్థానిక వనస్పతుల మాధ్యమం ద్వారా మీ ప్రాంతానికి గుర్తింపు సైతం పెరుగుతుంది.
ప్రియమైన నా దేశవాసులారా, ఇప్పటి నుంచి కొన్ని రోజుల తరువాత జులై 1న మనం ‘జాతీయ వైద్యుల దినా’న్ని జరుపుకొంటాం. దేశం లోని గొప్ప వైద్యుడు, రాజనీతిజ్ఞుడు డాక్టర్ బి.సి. రాయ్ జయంతి కి ఈ దినం అంకితం అయింది. కరోనా కాలం లో వైద్యుల తోడ్పాటు కు మనమంతా కృతజ్ఞత ను తెలుపుకోవలసివుంది. వైద్యులు వారి జీవితాల ను పట్టించుకోకుండా మనకు సేవలను అందించారు. ఈ కారణం గా, ఈ సారి జాతీయ వైద్యుల దినం మరింత ప్రత్యేకత ను సంతరించుకొంది.
మిత్రులారా, మందుల ప్రపంచం లో అత్యంత గౌరవనీయమైన వ్యక్తుల లో ఒకరైన హిపోక్రెటీస్ ఈకింది విధం గా అన్నారు :
“Wherever the art of Medicine is loved, there is also a love of Humanity.”
ఈ మాటల కు, ఎక్కడయితే వైద్య కళ పట్ల ప్రేమ ఉంటుందో, అక్కడ మానవత పట్ల కూడా ప్రేమ ఉట్టిపడుతుంది అని భావం. డాక్టర్ లు, ఈ ప్రేమ తాలూకు శక్తి తో నే మనకు సేవ చేయగలుగుతారు. అందువల్ల, వారికి అంతే ప్రేమ తో ధన్యవాదాలు చెప్పడం, ప్రోత్సహించడం మన కర్తవ్యం. మరింత ముందుకు వెళ్ళి వైద్యులకు సహాయం చేసే వారు కూడా మన దేశం లో చాలా మంది ఉన్నారు. శ్రీనగర్ లో అలాంటి ఒక ప్రయత్నం జరిగినట్లు నాకు తెలిసింది. అక్కడి దాల్ సరస్సు లో బోట్ ఎంబ్యులన్స్ సర్వీసు ను ప్రారంభించడం జరిగింది. ఈ తరహా సేవ ను హౌస్ బోట్ యజమాని శ్రీనగర్ కు చెందిన తారిక్ అహమద్ పత్ లూ గారు మొదలుపెట్టారు. ఆయన స్వయం గా కోవిడ్-19 తో యుద్ధం చేశారు. ఇది ఎంబ్యులన్స్ సేవ ను ప్రారంభించడానికి ఆయన కు ప్రేరణ ను ఇచ్చింది. ఈ ఎంబ్యులన్స్ గురించి ప్రజల కు అవగాహన కల్పించడానికి ఒక ప్రచారం కూడా జరుగుతోంది. వారు కూడా ఎంబ్యులన్స్ నుంచి నిరంతరం ప్రకటన లు కూడా చేస్తున్నారు. ప్రజలు మాస్క్ ధరించడం మొదలుకొని ఇతర ప్రతి ఒక్క అవసరమైన జాగ్రత్తల ను తీసుకోవాలనేదే ఈ ప్రయత్నం గా ఉంది.
మిత్రులారా, డాక్టర్స్ డే తో పాటు జులై 1న చార్టర్డ్ అకౌంటెంట్స్ డే ను కూడా పాటించడం జరుగుతుంది. నేను కొన్ని సంవత్సరాల క్రితం దేశం లోని చార్టర్డ్ అకౌంటెంట్ లను, ప్రపంచ స్థాయి లో ఉండగల భారతీయ ఆడిట్ సంస్థల కానుక ను ఇమ్మని అడిగాను. ఈ రోజు న నేను వారికి దీనిని గురించి గుర్తు చేయాలనుకుంటున్నాను. ఆర్థిక వ్యవస్థ లో పారదర్శకత్వాన్ని తీసుకు రావడం కోసం చార్టర్డ్ అకౌంటెంట్ లు చాలా మంచిదైనటువంటి, సకారాత్మకమైనటువంటి పాత్ర ను పోషించవచ్చు. నేను చార్టర్డ్ అకౌంటెంట్స్ అందరికీ, వారి కుటుంబ సభ్యుల కు నా శుభాకాంక్షలను అందజేస్తున్నాను.
ప్రియమైన నా దేశవాసులారా, కరోనా పై భారతదేశం చేసిన పోరాటం లో గొప్ప లక్షణం ఉంది. ఈ పోరాటం లో దేశం లోని ప్రతి వ్యక్తి తన వంతు పాత్ర ను పోషించారు. నేను ‘‘మన్ కీ బాత్’’ (‘మనసు లో మాట’) లో దీనిని గురించి తరచు గా ప్రస్తావించాను. కానీ కొంత మంది వారి గురించి అంత గా చర్చ జరగడం లేదని ఫిర్యాదు చేస్తుంటారు. చాలా మంది, వారు బ్యాంక్ సిబ్బంది కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, చిన్న వ్యాపారులు కావచ్చు, దుకాణదారులు కావచ్చు, దుకాణాల లో పని చేసే వ్యక్తులు కావచ్చు, వీధి వ్యాపారులు కావచ్చు, సెక్యూరిటీ వాచ్ మెన్ కావచ్చు ,పోస్ట్‌మెన్ కావచ్చు, తపాలా కార్యాలయం ఉద్యోగులు కావచ్చు- నిజానికి ఈ జాబితా చాలా పెద్దదిగా ఉంది. మరి ప్రతి ఒక్కరు వారి వంతు పాత్ర ను పోషించారు. పరిపాలన లో కూడా ఎంతో మంది వేరు వేరు స్థాయిల లో నిమగ్నమై ఉన్నారు.
మిత్రులారా, భారత ప్రభుత్వం లో కార్యదర్శిగా ఉన్న గురూ ప్రసాద్ మహా పాత్ర గారి పేరు మీరు బహుశా విని ఉంటారు. నేను ఈ రోజు న ‘మన్ కీ బాత్’లో, ఆయన విషయం కూడా ప్రస్తావించాలనుకుంటున్నాను. గురూ ప్రసాద్ గారి కి కరోనా వచ్చింది. ఆయన ఆసుపత్రి లో చేరారు. అయినా తన కర్తవ్యాన్ని కూడా నిర్వహిస్తూ వచ్చారు. దేశం లో ఆక్సీజన్ ఉత్పత్తి ని పెరగాలని, సుదూర ప్రాంతాల వరకు ఆక్సీజన్ చేరాలని అందుకోసం ఆయన పగలనక రాత్రనక పని చేశారు. ఒక వైపు కోర్టు చుట్టూ ప్రదక్షిణలు, ప్రసార మాధ్యమాల ఒత్తిడి - ఏక కాలం లో అనేక యుద్ధక్షేత్రాల లో ఆయన పోరాడుతూనే ఉన్నారు; అనారోగ్యం కాలంలోనూ ఆయన పని చేయడాన్ని ఆపివేయలేదు. వద్దని చెప్పిన తరువాత కూడా ఆయన మొండి గా ఆక్సీజన్ పై జరగబోయే వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనాలనుకొన్నారు. దేశవాసుల ను గురించిన అంత ఆందోళన ఉండింది ఆయన మనస్సు లో. ఆయన ఆసుపత్రి మంచం మీద తన ను గురించిన ఆలోచన చేయకుండానే, దేశ ప్రజల కు ఆక్సీజన్ అందించడం కోసం ఏర్పాట్లు చేస్తూనే వచ్చారు. ఈ కర్మ యోగి ని కూడా దేశం కోల్పోయిందే అనేది మన అందరికీ దు:ఖదాయకమైన విషయం. కరోనా ఆయన ను మన నుంచి లాగేసుకొంది. చర్చ కు కూడా నోచుకోని వారు అసంఖ్యాకం గా ఉన్నారు. కోవిడ్ ప్రోటోకాల్ ను మనం తు.చ. తప్పక అనుసరించడం, వాక్సీన్ ను తప్పక తీసుకోవడమే అలాంటి ప్రతి వ్యక్తి కి మన శ్రద్ధాంజలి కాగలదు.
ప్రియమైన నా దేశవాసులారా, ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) గొప్పతనం ఏమిటంటే, ఇందులో నాకన్నా ఎక్కువ గా మీ అందరి తోడ్పాటు ఉండటం. ఇప్పుడే నేను MyGov లో ఒక పోస్ట్ చూశాను.. చెన్నై కి చెందిన ఆర్. గురూప్రసాద్ గారు రాసిన విషయం తెలుసుకోవడం మీకూ సంతోషం గా ఉంటుంది. ఆయన ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమాన్ని క్రమం తప్పక వింటూ ఉంటాను అని రాశారు. గురుప్రసాద్ గారు రాసిన దానిలో నుంచి కొన్ని పంక్తుల ను ఇప్పుడు నేను ఉట్టంకిస్తున్నాను. ఆయన రాసిన వాక్యాలు:
“మీరు తమిళ నాడు గురించి మాట్లాడినప్పుడల్లా నా ఆసక్తి మరింతగా పెరిగిపోతుంది.
మీరు తమిళ భాష, తమిళ సంస్కృతి తాలూకు గొప్పతనాన్ని, తమిళ పండుగ లు, తమిళ నాడు లోని ప్రధాన ప్రదేశాల ను గురించి చర్చించారు.”
గురూ ప్రసాద్ గారు ఇంకా ఇలా రాశారు.
“మన్ కీ బాత్” (‘మనసు లో మాట’) లో తమిళ నాడు ప్రజల విజయాల గురించి కూడా చాలా సార్లు చెప్పారు. తిరుక్కురళ్ పై మీకు ఉన్నటువంటి ప్రేమ ను గురించి, తిరువళ్లువర్ గారి పట్ల మీకు గల గౌరవాన్ని గురించి ఏమని చెప్పేది! అందుకే మీరు తమిళ నాడు ను గురించి మాట్లాడినవన్నీ ‘మన్ కీ బాత్ 2.0’ (‘మనసు లో మాట 2.0’)లో సంకలనం చేసి E-Book సిద్ధం చేశాను. మీరు ఈ E-Book ను గురించి ఏదైనా చెబుతారని, దీనిని NamoApp లో కూడా విడుదల చేయగలరా ? ధన్యవాదాలు.”
ఇదుగో నేను గురూ ప్రసాద్ గారి లేఖ ను మీ ముందు చదువుతున్నాను.
గురూ ప్రసాద్ గారూ.. మీ ఈ పోస్ట్ ను చదివి చాలా ఆనందం కలిగింది. ఇప్పుడు మీ E-Book లో మరో పేజీ ని జోడించేయండి.
.. 'నాన్ తమిళ కళా చారాక్తిన్ పెరియె అభిమాని!
నాన్ ఉలగతలయే పలమాయాం తమిళ్ మొలియన్ పెరియె అభిమాని!!'
ఉచ్చారణ దోషాలు ఉండే ఉంటాయి. కానీ నా ప్రయత్నం, నా ప్రేమ ఎప్పటికీ తగ్గిపోవు. ఎవరయితే తమిళ భాషీయులు కారో, వారికి నేను తెలియజెప్పాలనుకుంటున్నాను, గురూప్రసాద్ గారితో నేను అన్నది -
“నేను తమిళ సంస్కృతి కి పెద్ద అభిమాని గా ఉన్నాను.
నేను ప్రపంచం లోని అన్నిటి కన్నా ప్రాచీన భాష అయినటువంటి తమిళానికి పెద్ద అభిమాని గా ఉన్నాను.”
మిత్రులారా, ప్రపంచం లోని అత్యంత ప్రాచీన భాష మన దేశాని కి చెందిందే అయినందుకు ప్రతి భారతీయుడు దీనిని కీర్తించాలి. దీనిని చూసుకొని గర్వపడాలి. నేను కూడా తమిళం విషయం లో చాలా గర్వపడుతున్నాను. గురూ ప్రసాద్ గారూ.. మీ ఈ ప్రయత్నం నాకు కొత్త దృష్టి ని ఇవ్వబోతోంది. ఎందుకంటే నేను ‘మన్ కీ బాత్ 2.0’ (‘మనసు లో మాట 2.0’) ను వెల్లడించేటప్పుడు విషయాల ను సహజం గా, సరళం గా ఉండేలా చూస్తాను. ఇది కూడా ఒక లక్షణం అని నాకు తెలియదు. మీరు పాత విషయాలన్నీ సేకరించినప్పుడు నేను కూడా ఒక సారి కాదు రెండు సార్లు చదివాను. గురూ ప్రసాద్ గారూ.. నేను మీ ఈ పుస్తకాన్ని NamoApp లో తప్పక అప్‌లోడ్ చేయిస్తాను. భవిష్యత్తు ప్రయత్నాలకై మీకు చాలా చాలా శుభాకాంక్షలు.
ప్రియమైన నా దేశవాసులారా, ఈ రోజు న మనం కరోనా ఇబ్బందుల ను, జాగ్రత్తల ను గురించి మాట్లాడాం. దేశం, దేశస్థుల అనేక విజయాల ను గురించి కూడా చర్చించాం. ఇప్పుడు మరో ముఖ్యమైన సందర్భం కూడా మన ముందు ఉంది. ఆగస్టు 15 కూడా రాబోతోంది. స్వాతంత్ర్యం తాలూకు 75 సంవత్సరాల అమృత మహోత్సవం మనకు చాలా పెద్ద ప్రేరణ గా నిలవనుంది. మనం దేశం కోసం జీవించడాన్ని నేర్చుకుందాం. స్వాతంత్ర్య సమరం- దేశం కోసం మరణించిన వారి కథ. స్వాతంత్య్రం తరువాత ఈ సమయాన్ని మనం దేశం కోసం జీవించే వారి కథ గా మలచవలసివుంది. India First.. ఇదే మన మంత్రం కావాలి. మన ప్రతి నిర్ణయానికి India First ఆధారం కావాలి.
మిత్రులారా, అమృత్- మహోత్సవ్ లో దేశం అనేక సామూహిక లక్ష్యాల ను నిర్దేశించుకొంది. మనం మన స్వాతంత్య్ర సమరయోధుల ను స్మరించుకొంటూ వారి తో ముడిపడ్డ చరిత్ర ను పునరుజ్జీవింపచేయాలి. స్వాతంత్య్ర సమర చరిత్ర రాయాలని, పరిశోధన చేయాలని ‘మన్ కీ బాత్ 2.0’ (‘మనసు లో మాట 2.0’) కార్యక్రమం లో యువత ను నేను కోరిన విషయం మీకు గుర్తు ఉండే ఉంటుంది. యువ ప్రతిభ ముందుకు రావాలి. యువత- ఆలోచన, యువత- అభిప్రాయాలు ముందుకు రావాలి. యువత కొత్త శక్తి తో రాయాలి. చాలా తక్కువ సమయం లో ఈ పని చేయడానికి రెండున్నర వేల కు పైగా యువత ముందుకు వచ్చారు. మిత్రులారా, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 19వ, 20వ శతాబ్దాల యుద్ధం గురించి సాధారణం గా మాట్లాడుతారు. కానీ 21వ శతాబ్దం లో జన్మించిన యువ మిత్రులు 19వ, 20వ శతాబ్దపు స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రజల ముందు ఉంచడానికి ముందుకు వచ్చారు. MyGov లో తమ పూర్తి వివరాలను పంపారు. వారు హిందీ, ఇంగ్లిషు, తమిళం, కన్నడం, బంగ్లా, తెలుగు, మరాఠీ, మలయాళం, గుజరాతీ మొదలైన దేశం లోని వివిధ భాషల లో స్వాతంత్య్ర సంగ్రామాన్ని గురించి రాస్తారు. స్వాతంత్ర్య పోరాటం తో సంబంధం కలిగి ఉండే తమ సమీప ప్రదేశాల గురించి సమాచారాన్ని కొందరు సేకరిస్తారు. కొందరు ఆదివాసీ స్వాతంత్ర్య సమరయోధుల గురించిన పుస్తకాన్ని రాస్తున్నారు. మంచి ప్రారంభం. మీ అందరి కీ నేను చేసే విన్నపం ఏమిటి అంటే, మీరంతా అమృత్ మహోత్సవ్ లో ఎలాగ జతపడినా, తప్పక జతపడండి అనేదే. మనం స్వాతంత్ర్య 75 సంవత్సరాల వేడుకల కు సాక్షులం కానున్నాం. అది మన అదృష్టం. ఈ కారణం గా తదుపరి పర్యాయం మనం ‘మన్ కీ బాత్ 2.0’ (‘మనసు లో మాట 2.0’)లో కలుసుకొన్నప్పుడు అమృత్-మహోత్సవ్ ను గురించి, ఆ కార్యక్రమం సన్నాహాల ను గురించి కూడా మాట్లాడుకుందాం. మీరు అందరు ఆరోగ్యం గా ఉండండి, కరోనా కు సంబంధించిన నియమాల ను పాటిస్తూ ముందుకు సాగండి, మీ కొత్త- కొత్త ప్రయాసల తో దేశాని కి ఇలాగే జోరు ను అందిస్తూ ఉండండి. ఇవే శుభాకాంక్షల తో, చాలా చాలా ధన్యవాదాలు.
***
(Release ID: 1730670)
Visitor Counter : 450
Read this release in:
Gujarati
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam