హోం మంత్రిత్వ శాఖ
జమ్ము-కశ్మీర్ కు చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ప్రధానమంత్రి ఉన్నత స్థాయి సమావేశం
జమ్ము-కశ్మీర్ లో గ్రామీణ స్థాయి నుంచి ప్రజాస్వామ్యం పటిష్ఠతకే ప్రాధాన్యత : ప్రధానమంత్రి
పోలింగ్ సజావుగా జరగాలంటే. పునర్విభజన త్వరిత గతిన జరగాల్సిందే : ప్రధానమంత్రి
జమ్ము-కశ్మీర్ లో ఎన్నికైన ప్రజాప్రభుత్వం రావాలి, అప్పుడే జమ్ము-కశ్మీర్ అభివృద్ధి పథంలో పురోగమించే బలం చేకూరుతుంది : ప్రధానమంత్రి
జమ్ము-కశ్మీర్ లో అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతి పట్ల సంతృప్తి ప్రకటించిన ప్రధానమంత్రి
జమ్ము-కశ్మీర్ లో కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకున్న వ్యక్తిగత లబ్ధిదారుల సంఖ్య 90% చేరింది : హోం మంత్రి
Posted On:
24 JUN 2021 9:44PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జమ్ము-కశ్మీర్ కు చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులతో అత్యున్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. జమ్ము-కశ్మీర్ లో ప్రజాస్వామ్య పటిష్ఠతపై సవివరమైన చర్చ జరిగింది. ఎన్నికలు నిర్వహించి బ్లాక్, జిల్లా అభివృద్ధి మండలులు ఏర్పాటు చేయడం ద్వారా మూడంచెల పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు చేసిన నేపథ్యంలో జమ్ము-కశ్మీర్ లో ప్రజాస్వామ్య ప్రక్రియకు మరింత ఉత్తేజం కల్పించడం ఎలా అనే అంశంపై చర్చ విస్తృతంగా జరిగింది. ఈ దిశగా ముందడుగు వేసే విషయంలో వివిధ పార్టీల నాయకులు తమ తమ అభిప్రాయాలు పంచుకున్నారు. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్య పటిష్ఠతకు వారు తమ కట్టుబాటును ప్రకటించారు.
చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరగడంతో పాటు నాయకులందరూ దాపరికం లేకుండా తమ అభిప్రాయాలు ప్రకటించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. జమ్ము-కశ్మీర్ లో గ్రామీణ స్థాయి ప్రజాస్వామ్య పటిష్ఠత తమ ప్రాధాన్యత అని ఆయన నొక్కి చెప్పారు. జమ్ము-కశ్మీర్ లో ఎన్నికలు జరిగి ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలంటే వేగంగా పునర్విభజన జరగాలని, అప్పుడే జమ్ము-కశ్మీర్ అభివృద్ధి యానానికి బలం చేకూరుతుందని ఆయన అన్నారు.
జమ్ము-కశ్మీర్ లో ప్రజలు, ప్రత్యేకించి యువత రాజకీయ నాయకత్వం వహించడం ద్వారా తమ ఆకాంక్షల సాకారానికి మార్గం సుగమం చేయాలని ప్రధానమంత్రి పిలుపు ఇచ్చారు.
జమ్ము-కశ్మీర్ లో అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతి పట్ల ప్రధానమంత్రి సంతృప్తి ప్రకటించారు. యువత ఆకాంక్షలు సాకారం చేయడం, జమ్ము-కశ్మీర్ ను అభివృద్ధి పథంలో నిలపడానికి నాయకులందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన కోరారు.
పారదర్శకతతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడంలో జమ్ము-కశ్మీర్ సుదీర్ఘ దూరం ప్రయాణించిందని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. జమ్ము-కశ్మీర్ లో కేంద్రప్రభుత్వ పథకాలు వినియోగించుకున్న వ్యక్తిగత లబ్ధిదారుల సంఖ్య సుమారు 90% ఉన్నట్టు ఆయన చెప్పారు. పలు ప్రధాన రోడ్డు ప్రాజెక్టులు, రెండు కొత్త ఎయిమ్స్, 7 కొత్త వైద్య కళాశాలలు నెలకొల్పుతున్నారు. జమ్ము-కశ్మీర్ పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయడం ద్వారా 4.5 లక్షల ఉపాధి కల్పించడం లక్ష్యంగా రూ.28,400 కోట్ల ప్యాకేజితో కొత్త పారిశ్రామిక విధానం ప్రకటించారు.
పార్లమెంటులో ప్రకటించిన మేరకు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలంటే పునర్విభజన ప్రక్రియ (నియోజకవర్గాల మధ్య సరిహద్దుల నిర్ధారణ) వేగవంతం కావడం, శాంతియుతంగా ఎన్నికల నిర్వహణ కీలక మైలురాళ్లు అని శ్రీ అమిత్ షా వివరించారు.
శ్రీ ఫరూక్ అబ్దుల్లా, శ్రీ గులామ్ నబీ అజాద్, శ్రీమతి మెహబూబా ముఫ్తి, శ్రీ ఒమర్ అబ్దుల్లా, శ్రీ కవీందర్ గుప్తా, శ్రీ ముజఫర్ హుస్సేన్ బేగ్, శ్రీ నిర్మల్ సింగ్, శ్రీ తారాచంద్, శ్రీ మహమ్మద్ అల్తాఫ్ బుఖారీ, శ్రీ సజద్ గని లోన్, శ్రీ రవీందర్ రైనా, శ్రీ గులాం అహ్మద్ మీర్, శ్రీ మహమ్మద్ యూసఫ్ తరిగామి, శ్రీ భీమ్ సింగ్ ఈ సమావేశానికి హాజరయ్యారు.
హోం మంత్రి శ్రీ అమిత్ షా, జమ్ము-కశ్మీర్ లెఫ్టనెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా, ఎన్ఎస్ఏ శ్రీ అజిత్ దోవల్, కేంద్ర సహాయ మంత్రి (పిఎంఓ) శ్రీ జితేంద్ర సింగ్, సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
(Release ID: 1730230)
Visitor Counter : 237