కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

శ్రామిక శక్తి ప్రాతినిధ్యంలో లింగ తారతమ్యాన్ని తగ్గించేందుకు భారత్ సమష్టి కృషి జరుపుతోందన్న కార్మిక మంత్రి

జి 20 దేశాల కార్మిక మరియు ఉపాధి శాఖల మంత్రుల సమావేశంలో ప్రకటన మరియు ఉపాధి అధ్యయన బృందం ప్రాధాన్యతలపై ప్రసంగం చేసిన సంతోష్ గంగ్వార్

Posted On: 23 JUN 2021 5:05PM by PIB Hyderabad

శ్రామిక శక్తి ప్రాతినిధ్యంలో లింగ తారతమ్యాన్ని తగ్గించేందుకు భారత్ సమష్టి కృషి జరుపుతున్నదని కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖల మంత్రి  శ్రీ సంతోష్ గంగ్వార్ అన్నారు.  విద్య, శిక్షణ,  నైపుణ్యం, వ్యవస్థాపకత అభివృద్ధి మరియు ఒకే విధమైన పనికి ఒకే విధమైన వేతనం (సమానత్వం)  ఉండేలా దేశం నిశ్చయం చేసుకుంటున్నదని మంత్రి అన్నారు.  జి 20 దేశాల కార్మిక మరియు ఉపాధి శాఖల మంత్రుల సమావేశంలో ప్రకటన మరియు ఉపాధి అధ్యయన బృందం ప్రాధాన్యతలపై  బుధవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో  ప్రసంగిస్తూ మంత్రి శ్రీ గంగ్వార్ 2019 వేతనాల నియమావళిని ప్రస్తావించారు.  ఈ నియమావళి  వేతనాలు,  నియామకాలు మరియు ఉద్యోగ పరిస్థితులలో లింగ వివక్షను తగ్గించగలదని మంత్రి అన్నారు.

     అన్ని రకాల సంస్థలలో అన్ని రకాల పనులకు మహిళలు అర్హులు. యజమానులు వారికి తగిన రక్షణ మరియు పని వేళలను కల్పించాలి.   ఇప్పుడు మహిళలు రాత్రి వేళల్లో  కూడా పని చేయవచ్చునని అన్నారు.  మహిళలకు వేతనంపై ప్రసూతి సెలవును 12 వారాల నుంచి 26 వారాలకు పెంచినట్లు  శ్రీ గంగ్వార్ తెలిపారు.  మహిళలు చిన్న చిన్న సంస్థలను ఏర్పాటు చేయడానికి ప్రధానమంత్రి ముద్ర యోజన ద్వారా ఆర్ధిక సహాయం చేస్తున్నారు.  ఈ పథకం కింద అదనపు భద్రత లేకుండా 9 లక్షల కోట్ల
రుణాలను పంపిణీ చేశారు.  ఈ స్కీము ద్వారా ఋణం పొందిన వారిలో 70 శాతం ఖాతాలు మహిళలవే.  కొత్తగా రూపొందించిన సామాజిక భద్రతా నియమావళిలో ఇప్ప్పుడు స్వయం ఉపాధి పొందుతున్నవారు మరియు ఇతర అన్ని శ్రేణులకు చెందిన శ్రామికులకు సామాజిక భద్రత వర్తింపజేయడం కూడా ఉంది.  2019లో ప్రవేశపెట్టిన స్వచ్ఛంద,  వాటా చెల్లింపు పింఛను పథకం ద్వారా  అవ్యవస్థిత  రంగానికి చెందిన కార్మికులకు 60 సంవత్సరాలు దాటిన తరువాత  కనీస  పింఛను లభిస్తుంది.  
           మంత్రుల సమావేశం విడుదల చేసే ఉమ్మడి ప్రకటన ఆమోదాన్ని బలపరచిన మంత్రి సభ్య దేశాలు చేపడుతున్న   ఈ ప్రయత్నం సర్వతోముఖాభివృద్ధికి మరియు యావత్ యువతరం సామర్ధ్య నిర్మాణానికి సహాయకారి కాగలదని అన్నారు.  
ఉపాధి అధ్యయన బృందం మహిళల ఉపాధి,  సామాజిక భద్రత మరియు సుదూరం  నుంచి పనిచేయడం వంటి కీలక అంశాలపై పర్యాలోచన చేసింది.   సమీకృత, నిలకడైన మరియు స్థితిస్థాపకతతో శ్రామిక మార్కెట్లు మరియు సమాజాలు వృద్ధిచెందడానికి దోహదం చేయడం మంత్రుల సమావేశం ఉద్దేశం.  
           బ్రిస్ బేన్ లో 2014లో జరిగిన జి20 దేశాల నాయకుల సమావేశం ఉపాధి మార్కెట్ లో స్త్రీ, పురుషుల మధ్య వివక్షను తగ్గించాలని  ప్రతిన పూనింది.  తదనుగుణంగా ఇప్పుడు ప్రయత్నాలు సాగుతున్నాయి.  2025 నాటికి  శ్రామికుల మార్కెట్ లోకి 10 కోట్ల మంది  మహిళలను తీసుకురావడం ద్వారా పేదరికాన్ని,  అసమానతను తగ్గించాలని సంకల్పం.  ఇటీవల కాలంలో దాదాపు అన్ని జి20 దేశాలు  సమానావకాశాలు కల్పించడంలో ప్రగతిని సాధించాయి.  అయితే మహమ్మారి కారణంగా ఈ ప్రక్రియ కొంత వేగం తగ్గింది.  కార్మిక మార్కెట్ లో మహిళల ప్రాతినిధ్యం పెంపు  మరియు వారి ఉపాధి నాణ్యతలో మెరుగుదలకు అనేక అంశాలు అడ్డంకిగా ఉన్నాయి.  ఈ అడ్డంకులను అధిగమించినప్పుడే బ్రిస్ బేన్  లక్ష్యాలను సాధించడంతో పాటు  కార్మిక మార్కెట్ లో మరియు సమాజాలలో పూర్తి లింగ సమానత్వాన్ని సాధించవచ్చు.    ఇందుకోసం విధానపరమైన,   లింగ వివక్షను  ఎదుర్కొనే  చర్యలు చేపట్టవలసి ఉంటుంది.  (Release ID: 1730220) Visitor Counter : 177