ప్రధాన మంత్రి కార్యాలయం

లింక్డ్ ఇన్ లో ప్రధానమంత్రి బ్లాగ్ పూర్తి పాఠం నిశ్చయం, ప్రోత్సాహకాలతో కూడిన సంస్కరణలు


నిశ్చయం, ప్రోత్సాహకాలతో కూడిన సంస్కరణలు

Posted On: 22 JUN 2021 8:04PM by PIB Hyderabad

కోవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు విధానపరంగా కొత్త సవాళ్లు ముందుకు తెచ్చింది. అందుకు భారత్ కూడా అతీతం కాదు. ఒకపక్క స్థిరత్వం దెబ్బ తినకుండానే ప్రజాసంక్షేమానికి అవసరం అయిన వనరులు సమీకరించుకోవడం ఆ పెను సవాళ్లలో ఒకటి.

ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలన్నీ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కూడా భారతదేశానికి చెందిన రాష్ర్టాలు మాత్రం 2020-21లో సమీకరించిన నిధుల కన్నా అధికంగా నిధులు సమీకరించగలిగాయని మీకు తెలుసా?  2020-21లో భారత రాష్ర్టాలన్నీ కలిసి రూ.1.06 లక్షల కోట్లు సమీకరించగలిగాయంటే మీకు ఆశ్చర్యం కలగవచ్చు. కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్యం పునాదిగా అనుసరించిన వైఖరి వల్లనే ఇలా అధిక మొత్తంలో వనరులు అందుబాటులో ఉంచడం సాధ్యమయింది.

కోవిడ్-19 సంక్షోభానికి స్పందనగా మేం ఆర్థిక చర్యలు చేపట్టిన సమయంలో “అందరి విషయంలో ఒకే తరహా వైఖరి” అనుసరించడం సాధ్యం కాదనే విషయం ప్రధానంగా దృష్టిలో ఉంచుకున్నాం. ఖండాంతర కోణాలున్న ఒక ఫెడరల్ దేశంలో రాష్ట్రప్రభుత్వాలు సంస్కరణలు చేపట్టడాన్ని ప్రోత్సహిస్తూ జాతీయ స్థాయిలో విధానపరమైన చర్యలు రూపొందించడం వాస్తవంగా ఒక సవాలు. కాని మన ఫెడరల్ వ్యవస్థలోని శక్తిపై గల నమ్మకంతో కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్య స్ఫూర్తితో మేం ముందడుగేశాం.

2020 మే నెలలో ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజిలో భాగంగా 2020-21 సంవత్సరానికి రాష్ట్రప్రభుత్వాలు అదనంగా వనరులు సమీకరించుకునేందుకు అనుమతిస్తున్నట్టు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. జిఎస్ డిపిలో 2% శాతం మేరకు అదనంగా నిధులు సమీకరించుకునేందుకు అనుమతించాం. అందులో 1% నిర్దిష్ట ఆర్థిక సంస్కరణలు అమలుపరిచే షరతుపై అనుమతించడం జరిగింది. భారత పబ్లిక్ ఫైనాన్స్ లో ఈ తరహా సంస్కరణలు ప్రతిపాదించడం అతి అరుదైన అంశం. అదనపు నిధులు ఉపయోగించుకునేందుకు రాష్ర్టాలు ప్రగతిశీలక విధానాలు చేపట్టడాన్ని ప్రోత్సహించడమే దీని ప్రధాన లక్ష్యం. చక్కని ఆర్థిక విధానాలు చేపట్టడం ఎవరో కొందరికే పరిమితం కాదనే దురభిప్రాయం పోగొట్టి సంస్కరణల దిశగా అందరినీ ప్రోత్సహించేందుకు ఆచరించిన విధానాల ఫలితమే ఇది. 

అదనపు నిధుల సమీకరణ కోసం అమలుపరిచిన నాలుగు ప్రధాన సంస్కరణలకు (ఒక్కోటి 0.25%) రెండు స్వభావాలున్నాయి. ప్రజలు...ప్రత్యేకించి పేదలు, సమాజంలో నిరాదరణకు గురవుతున్న వారు, మధ్యతరగతి ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడంతో అనుసంధానం చేయడం ఒకటైతే ఆర్థిక స్థిరత్వాన్ని ప్రోత్సహించడం రెండో స్వభావం.
  
ఈ సంస్కరణల్లో మొదటిదైన “ఒక జాతి ఒకే రేషన్ కార్డు” విధానం కింద రాష్ర్టాల్లోని రేషన్ కార్డులన్నింటినీ జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎస్ఎఫ్ఏ) కింద జారీ చేయించడం, వాటన్నింటినీ కుటుంబ సభ్యులందరి ఆధార్ తో అనుసంధానం చేయడం, అన్ని చౌక ధరల దుకాణాలు ఎలక్ర్టానిక్ పాయింట్ ఆఫ్ సేల్ డివైస్ లు కలిగి ఉండేలా చూడడం వంటి చర్యలు తీసుకున్నాం. వలస కార్మికులు దేశంలో ఎక్కడైనా ఆహార రేషన్ తీసుకునే వీలు కల్పించడం దీని వల్ల వచ్చిన ప్రధాన ప్రయోజనం. పౌరులకు అందిన ఈ ప్రయోజనాలతో పాటు బోగస్ కార్డులు, డూప్లికేట్ సభ్యుల ఏరివేత ద్వారా ఆర్థిక ప్రయోజనం కూడా లభించింది. 17 రాష్ర్టాలు ఈ సంస్కరణ సంపూర్ణంగా అమలుపరచడంతో అదనంగా రూ.37,600 కోట్లు సమీకరించుకునేందుకు అధికారం ఇవ్వడం జరిగింది.

వ్యాపారానుకూలతను పెంపొందించడం కోసం ఉద్దేశించిన రెండో సంస్కరణ ద్వారా కేవలం లైసెన్సు ఫీజు చెల్లించడం ద్వారానే 7 చట్టాల కింద వ్యాపార సంబంధిత లైసెన్సులు ఆన్లైన్ లో, వివక్షారహితంగా  ఆటోమేటిక్ గా రెన్యూ చేసే అధికారం కల్పించాం.  అలాగే 12 చట్టాల కింద చేపట్టే తనిఖీల్లో అవినీతి, వేధింపులను తగ్గించడం కోసం కంప్యూటరైజ్డ్ రాండమ్ విధానంలో మాత్రమే తనిఖీలకు కంపెనీలను ఎంపిక చేయాలన్న షరతుతో పాటు, ముందస్తు నోటీసు ద్వారా మాత్రమే ఇన్ స్పెక్షన్ చేపట్టాలన్న షరతు విధించడం జరిగింది. ప్రధానంగా ఈ సంస్కరణ (19 చట్టాలకు వర్తించేలా) “ఇన్ స్పెక్టర్ రాజ్” ద్వారా బాధ పడుతున్న సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ఎంతో సహాయకారి అయింది. పైగా పెట్టుబడుల వాతావరణం మెరుగుపడడంతో పాటు భారీ పెట్టుబడులు, త్వరిత వృద్ధికి మార్గం సుగమం అయింది. ఈ సంస్కరణను విజయవంతంగా అమలుపరిచిన 20 రాష్ర్టాలకు రూ.39,521 కోట్ల అదనపు సమీకరణ అవకాశం కల్పించడం జరిగింది.

ప్రాపర్టీలపై పన్నుల విధానం హేతుబద్ధంగా ఉండాలని 15వ ఆర్థిక సంఘంతో పాటు పలు అధ్యయన నివేదికలు నొక్కి చెప్పాయి. దీని కింద చేపట్టిన మూడో సంస్కరణ కింద ప్రాపర్టీ లావాదేవీలకు సంబంధించిన స్టాంప్ డ్యూటీ మార్గదర్శకాల కింద పట్టణ ప్రాంతాల్లో ప్రాపర్టీ టాక్స్ లు, నీటి కనెక్షన్లు, మురుగునీటి కనెక్షన్లకు ఫ్లోర్ రేట్లు ప్రకటించాలని సూచించాం. దీని వల్ల పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపడడంతో పాటు వృద్ధికి ఊతం లభించడమే కాకుండా పట్టణ పేదలు, మధ్య తరగతి ప్రజలకు నాణ్యమైన సేవలందుకునే వీలు కలుగుతుంది. ప్రాపర్టీ పన్ను ప్రగతి శీలంగా ఉండడంతో పట్టణ ప్రాంతాలు అధికంగా లబ్ధి పొందుతాయి. పైగా తరచు వేతనాలు జాప్యం అవుతున్న మునిసిపల్ సిబ్బందికి కూడా ఈ సంస్కరణల వల్ల ప్రయోజనం చేకూరుతుంది. 11 రాష్ర్టాలు ఈ సంస్కరణ విజయవంతంగా అమలుపరిచి రూ.15,597 కోట్లు అదనంగా సమీకరించుకునే స్వేచ్ఛ పొందాయి.

రైతులకు ఉచితంగా విద్యుత్ సరఫరా స్థానంలో ప్రవేశపెట్టిన ప్రత్యక్ష నగదు బదిలీ (డిబిటి) నాలుగో సంస్కరణ. కనీసం ఒక జిల్లాలో ఏడాది చివరి నాటికి ప్రయోగాత్మక ప్రాతిపదికపై అమలుపరచడానికి వీలుగా రాష్ట్ర స్థాయిలో విధానం రూపొందించాలని సూచించాం. 0.15% అదనపు సమీకరణతో దీన్ని అనుసంధానం చేశాం. అలాగే టెక్నికల్, వాణిజ్యపరమైన నష్టాలు తగ్గించడం ద్వారా ఆదాయాలు, వ్యయాల మధ్య వ్యత్యాసం తగ్గించడానికి (ఒక్కో దానికి జిఎస్ డిపిలో 0.05% వంతున) ప్రోత్సాహకం కల్పించాం. దీని వల్ల డిస్ర్టిబ్యూషన్ కంపెనీల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఇది నీరు, ఇంధన నాణ్యత పెంచడానికి దోహదపడడంతో పాటు మెరుగైన ఆర్థిక, టెక్నికల్ సామర్థ్యాలతో  సేవల నాణ్యత పెరుగుతుంది. 13 రాష్ర్టాలు ఈ సంస్కరణలో ఒక్క దాన్ని పూర్తి చేయడంతో పాటు 6 రాష్ర్టాలు డిబిటిని అమలుపరిచాయి. ఫలితంగా అవి రూ.13,201 కోట్ల అదనపు సమీకరణ అవకాశం పొందాయి.

మొత్తం మీద రూ.2.14 లక్షల కోట్ల అదనపు వనరుల సమీకరణ సామర్థ్యంలో 23 రాష్ర్టాలు రూ.1.06 లక్షల అదనపు వనరులు సమీకరించుకోగలిగాయి. ఫలితంగా 2020-21లో (షరతులు, బేషరతుగా) రాష్ర్టాలు పొందిన అదనపు రుణసమీకరణ జిఎస్ డిపిలో 4.5% మేరకు ఉంది.

సంక్లిష్టమైన సవాళ్లున్న ఇంత పెద్ద దేశంలో ఇది ఒక ప్రత్యేక అనుభవం. అందుకోసమే ఎన్నో సంవత్సరాలుగా ఆచరణీయం కాకుండా ఉండిపోయిన పలు స్కీమ్ లు, సంస్కరణలు మేం ఆచరణీయం చేశాం. గతంలోని విధానాలకు భిన్నమైన ఈ విధానంతో  మహమ్మారి నేపథ్యంలో అతి తక్కువ కాలంలో ప్రజోపయోగ సంస్కరణలు కేంద్ర రాష్ర్టాలు కలిసి ఉమ్మడిగా చేపట్టగలిగాయి. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ ద్వారానే ఇది సాధ్యమయింది. ఈ అదనపు నిధుల ప్రోత్సాహమే లేకపోయి ఉంటే ఈ విధానాల రూపకల్పనకు సంవత్సరాల వ్యవధి పట్టేదని ఈ సంస్కరణలపై కృషి చేసిన అధికారులన్నారు.  భారతదేశం “కఠోరంగా, నిర్బంధంతో సంస్కరణల అమ‌లుకు ఇన్నేళ్లుగా ఒక నమూనా”గా నిలిచింది. కాని ఈ కొత్త సంస్కరణ “కట్టుబాటు, ప్రోత్సాహకాలతో సంస్కరణల” నమూనాగా భారత్ ను మార్చింది. అత్యంత సంక్లిష్టమైన సమయంలో కూడా పౌరుల జీవనం మెరుగుపరచడం కోసం ఈ కొత్త విధానాల అమలుకు చొరవ చూపిన రాష్ర్టాలన్నింటికీ ధన్యవాదాలు. 130 కోట్ల మంది భారతీయుల సత్వర పురోగతికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం.
 



(Release ID: 1729977) Visitor Counter : 206