కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
‘అనుబంధ సేవా ప్రదాతల’కు మార్గదర్శకాల్లో మరింత సడలింపు
టెలికమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ ప్రకటన;
దేశీయ, అంతర్జాతీయ ‘అనుబంధ సేవాప్రదాతల’ మధ్య ఎలాంటి తేడా ఉండదు.. వ్యాపారాల మధ్య మెరుగైన సమన్వయమే ఇందులోని అంతరార్థం;
ఇంటినుంచే పని... ఎక్కడినుంచైనా పని సులభతరం చేయబడింది
Posted On:
23 JUN 2021 3:31PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ‘అనుబంధ సేవా ప్రదాత’ (ఓఎస్‌పీ)లకు నిర్దేశించిన మార్గదర్శకాలను టెలికమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ మరింత సడలించిందని కేంద్ర ఎలక్ట్రానిక్-సమాచార సాంకేతిక; కమ్యూనికేషన్లు; చట్ట/న్యాయశాఖల మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఇవాళ న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో ప్రకటించారు. భారత్‌సహా ఇతర దేశాల్లో ఇలాంటి సంస్థలు ‘గళాధారిత’ (బీపీవో) సేవలవంటివి అందిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నేడు విడుదల చేసిన మార్గదర్శకాల్లో వీటికి మరింత సడలింపులు ప్రకటించింది. ఇందులో భాగంగా 2020 నవంబరులో ప్రకటించి, ఇప్పటికే అమలు చేస్తున్న ప్రధాన చర్యలతోపాటు తాజా మార్గదర్శకాలతో ఆ సంస్థలకు ప్రత్యేక సౌలభ్యం లభిస్తుంది.
ప్రపంచంలోని అతిపెద్ద పరిశ్రమలలో భారతదేశంలోగల బీపీవో పరిశ్రమ ఒకటని శ్రీ ప్రసాద్ ఈ సందర్భంగా చెప్పారు. నేడు భారత్‌లోగల ‘ఐటీ-బీపీఎం’ (బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్) పరిశ్రమ విలువ (2019-20నాటికి) 37.6 బిలియన్ డాలర్లుగా... అంటే-దాదాపు రూ.2.8 లక్షల కోట్ల స్థాయిలో ఉందన్నారు. దేశంలోని లక్షలాది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదని తెలిపారు. అంతేగాకుండా రెండంకెల వృద్ధిని సాధించగల సామర్థ్యం ఈ పరిశ్రమకు ఉందని, ఆ మేరకు 2025నాటికి సుమారు 55.5 బిలియన్ డాలర్లు.. అంటే- రూ.3.9 లక్షల కోట్ల స్థాయికి చేరగలదని అంచనా వేసినట్లు చెప్పారు.
‘స్వయం సమృద్ధ భారతం’ ప్రభుత్వం అత్యంత నిశితంగా దృష్టిసారించిన లక్ష్యాల్లో కీలకమైనది కాగా- ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ దిశగా ముందంజ వేస్తున్నామని తెలిపారు. తదనుగుణంగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. ఈ రంగంలో సముదాయాల ఏర్పాటు కోసం ప్రత్యేక పథకాన్ని కూడా తెచ్చిందని, అలాగే టెలికం పరికరాల తయారీకి కూడా ప్రత్యేక ‘పీఎల్‌ఐ’ పథకాన్ని ప్రకటించిందని తెలిపారు. అదేవిధంగా వాణిజ్య సౌలభ్య కల్పన మరొక ఆధారస్తంభంగా నిలిచిందని, దీనికింద సమాచార సాంకేతికత-టెలికం పరిశ్రమల రంగాల్లో ప్రస్తుత ప్రభుత్వం వరుసగా అనేక సంస్కరణలు తెచ్చిందని తెలిపారు. ఒక్క దరఖాస్తుతో వర్చువల్ నెట్‌వర్క్ ఆపరేటర్ (వీఎన్‌ఓ) లైసెన్స్, స్పెక్ట్రం భాగస్వామ్యం-వాణిజ్యం, కొన్ని ఫ్రీక్వెన్సీ బాండ్లను లైసెన్స్ పరిధి నుంచి తప్పించడం ఇప్పటికే తీసుకున్న కొన్ని చర్యలు. ఈ నేపథ్యంలో తాజాగా ‘భవిష్యత్తరం అనుబంధ సేవా ప్రదాత’లకు సడలింపులిస్తూ కొత్త మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి.
నవంబరు 2020లో ‘ఓఎస్‌పీ’ల మార్గదర్శకాల్లో సడలింపులు కిందివిధంగా ఉన్నాయి:-
- డేటా సంబంధిత ‘ఓఎస్‌పీ’లు నియంత్రణ పరిధినుంచి పూర్తిగా తప్పించబడ్డాయి
- బ్యాంకు గ్యారంటీల అవసరం లేదు
- స్థిర ‘ఐపీ’ (ఇంటర్నెట్ ప్రొటోకాల్ అడ్రస్) అవసరం లేదు
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్‌కు నివేదించాల్సిన పనిలేదు
- నెట్‌వర్క్ డయాగ్రమ్ ప్రచురించాల్సిన అవసరం లేదు
- జరిమానాలు రద్దు
- ఎక్కడినుంచైనా పనిచేయడానికి వాస్తవరూపం ఇవ్వబడింది
మహమ్మారి పరిస్థితుల మధ్య కూడా ‘బీపీఎం’ పరిశ్రమ రాబడులు పెరిగాయి. ఈ మేరకు 2019-20లో 37.6 బిలియన్ డాలర్లుగా నమోదైతే, 2020-21లో ఇది 38.5 బిలియన్ డాలర్లకు పెరగడం గమనార్హం. ఈ పరిశ్రమకు ఎక్కడినుంచైనా పనిచేయగల సామర్థ్యం ఉండటంవల్లనే ఇదంతా సాధ్యమైంది. ప్రభుత్వం నుంచి ‘ఓస్‌పీ’ నియమావళిలోని ‘డబ్ల్యూఎఫ్‌హెచ్’ కింద పాటించాల్సిన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించడం మరింతగా తోడ్పడింది. ఈ మేరకు 2020 మార్చి నెలలో తాత్కాలిక సడలింపులు ప్రకటించగా, 2020 నవంబరు నాటి మార్గదర్శకాల్లో పూర్తి సంస్కరణలను ప్రభుత్వం అమలు చేసింది.
ఈ పరిశ్రమ అంతర్జాతీయ వాణిజ్యంలో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి:-
- ప్రస్తుత ‘బీపీఎం’ మార్కెట్ విలువ – 198 బిలియన్ డాలర్లు
- ఔట్‌సోర్సింగ్ మార్కెట్ విలువ – 91 బిలియన్ డాలర్లు (46 శాతం)
- ప్రస్తుత ‘బీపీఎం’ ఔట్‌సోర్సింగ్ రాబడులు... భారత్- 38.5 బిలియన్ డాలర్లు (రూ.2.8 లక్షల కోట్లు)
నేడు ప్రకటించిన సరళీకృత మార్గదర్శకాల్లో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి:-
ఎ. దేశీయ, అంతర్జాతీయ ‘ఓఎస్‌పీ’ల మధ్య వ్యత్యాసం తొలగించబడింది. ఉమ్మడి టెలికం వనరులున్న ఏ ‘బీపీఓ’ అయినా భారత్‌సహా ప్రపంచంలో ఎక్కడున్న వినియోగదారులకైనా సేవలందించవచ్చు.
బి. ‘ఓఎస్‌పీ’ల ‘ఈపీఏబీఎక్స్’ (ఎలక్ట్రానిక్ ప్రైవేట్ ఆటోమాటిక్ బ్రాంచ్ ఎక్స్ఛేంజి) ప్రపంచంలో ఎక్కడైనా ఉండొచ్చు. అదేవిధంగా టెలికం సేవా ప్రదాతల నుంచి ‘ఈపీఏబీఎక్స్’ సేవలను ‘ఓఎస్‌పీ’లు వాడుకోవడంతోపాటు భారతదేశంలోని మూడో పక్షం డేటా కేంద్రాల పరిధిలో ‘ఈపీఏబీఎక్స్’లను ఏర్పాటు చేయవచ్చు.
సి. దేశీయ, అంతర్జాతీయ ‘ఓఎస్‌పీ’ల మధ్య అంతరాన్ని తొలగించిన నేపథ్యంలో అన్నిరకాల ‘ఓఎస్‌పీ’ కేంద్రాల అంతర-సంధానం అనుమతించబడుతుంది.
డి. ‘ఓఎస్‌పీ’ల సుదూర ప్రాతినిధ్య సంస్థలు ఇకపై కేంద్రీకృత ‘ఈపీఏబీఎక్స్’/ ఓఎస్‌పీల ‘ఈపీఏబీఎక్స్’ లేదా వినియోగదారు ‘ఈపీఏబీఎక్స్’లతో నేరుగా సంధానం కావచ్చు. ఇందుకోసం వైర్‌లైన్/వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సాంకేతికతను కూడా వాడుకోవచ్చు.
ఇ. ఒకే కంపెనీ లేదా కంపెనీల సమూహానికి చెందిన లేదా సంబంధంలేని కంపెనీలకు చెందిన ‘ఓఎస్‌పీ’ కేంద్రాల మధ్య డేటా అంతర-సంధానంపై ఎలాంటి ఆంక్షలూ ఉండవు.
ఎఫ్. టెలికం శాఖ ఇప్పటికే డేటా ఆధారిత సేవలను ‘ఓఎస్పీ’ నియంత్రణల నుంచి తొలగించింది. దీంతోపాటు ‘ఓఎస్‌పీ’లకు రిజిస్ట్రేషన్ నిబంధనల నుంచి కూడా విముక్తం చేసింది. అంతేకాకుండా బ్యాంకు గ్యారంటీలు సమర్పించే అవసరమూ లేదు. ఇంటినుంచి పని... ఎక్కడినుంచైనా పని సౌలభ్యానికి అనుమతించింది.
జి. ఈ వ్యాపారాలపై ప్రభుత్వానికిగల విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తూ ఉల్లంఘనలపై జరిమానాల విధింపు తొలగించబడింది.
హెచ్. అదనపు సడలింపులతో ఇవాళ జారీచేసిన మార్గదర్శకాలు భారత్‌లో ‘ఓఎస్‌పీ’ పరిశ్రమ వృద్ధికి దోహదపడుతుంది. తద్వారా దేశంలో అపార అవకాశాలు అందుబాటులోకి రావడమేగాక ఆదాయం, ఉపాధి కూడా పెరుగుతాయి.
‘ఓఎస్‌పీ’ సంస్కరణల ప్రభావంపై 2021 ఏప్రిల్‌లో ‘నాస్‌కామ్’ నిర్వహించిన అధ్యయనంలో కింది ముఖ్యమైన అంశాలు వెల్లడయ్యాయి:-
- ‘ఓఎస్‌పీ’ సంస్కరణలపై అధ్యయనంలో పాల్గొన్నవారిలో 72 శాతం అత్యంత సంతృప్తి వ్యక్తం చేశారు.
- భారతదేశంలో వాణిజ్య వ్యయం భారం తగ్గడంతోపాటు నిబంధనల జంఝాటం తగ్గించడంలో ఈ మార్గదర్శకాలు తోడ్పడ్డాయని పాల్గొన్నవారిలో 95 శాతం చెప్పారు.
- అంతర్జాతీయంగా ఐటీ సేవలలో పోటీతత్వాన్ని పెంచడంలో మరింత తోడ్పడగలవని 95 శాతం ప్రతిస్పందకులు తెలిపారు.
- ఉత్పాదకతను పెంచడంలో ‘ఓఎస్‌పీ’ సంస్కరణలు దోహదపడ్డాయనని మరో 77 శాతం ప్రతిస్పందకులు పేర్కొన్నారు.
- ఈ సంస్కరణలు కంపెనీలపై ఆర్థిక భారాన్ని తగ్గించడంలో తోడ్పడ్డాయని 92 మంది ప్రతిస్పందకులు వివరించారు.
- ‘ఓఎస్‌పీ’ సంస్కరణల నేపథ్యంలో తాజా పెట్టుబడులు పెట్టడం లేదా తమ కార్యకలాపాలనుఉ విస్తరించడంపై ఆలోచిస్తామని 62 శాతం ప్రతిస్పందకులు చెప్పారు.
- ఈ సంస్కరణలు కొత్త ఉపాధి అవకాశాల సృష్టితోపాటు ప్రతిభను అందుబాటులోకి తెస్తాయని 55 శాతం ప్రతిస్పందకులు పేర్కొన్నారు.
‘బీపీఎం’ పరిశ్రమ వ్యవస్థాపన వ్యయం తగ్గడంతోపాటు వివిధ కంపెనీల నడుమ సమన్వయం మెరుగుపడటానికి ఇవాళ ప్రకటించిన సంస్కరణలు తోడ్పడతాయి. ఈ సంస్కరణలతో బహుళ జాతి కంపెనీ (ఎంఎన్‌సీ)లు భారత్‌ను ఆకర్షణీయ గమ్యంగా పరిగణించి ఆకర్షితమవుతాయి. తద్వారా దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)లు ఇనుమడిస్తాయి.
ఈ నేపథ్యంలో ప్రస్తుత, మునుపటి ‘యూపీఏ’ ప్రభుత్వాల హయాంలో ‘ఎఫ్‌డీఐ’లను ప్రముఖంగా పరిశీలించాల్సి ఉంది:-
|
2007-14
|
2014-21
|
వృద్ధి (శాతం)
|
టెలికాం
|
11.64 బిలియన్ డాలర్లు
|
23.5 బిలియన్ డాలర్లు
|
102%
|
ఐటీ రంగం (కంప్యూటర్ సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్)
|
7.19 బిలియన్ డాలర్లు
|
58.23 బిలియన్ డాలర్లు
|
710%
|
***
(Release ID: 1729868)
Visitor Counter : 255