విద్యుత్తు మంత్రిత్వ శాఖ
బ్రిక్స్ గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ నిర్వహించిన ఎన్‌టీపీసీ
Posted On:
23 JUN 2021 12:30PM by PIB Hyderabad
కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన ఎన్‌టీపీసీ, గ్రీన్ హైడ్రోజన్ అంశంపై రెండు రోజుల కార్యశాలను నిర్వహించింది. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రీన్ హైడ్రోజన్‌కు అత్యంత ప్రాముఖ్యత, డిమాండ్ ఉంది. శక్తి సామర్థ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే వాహకంగా దీనిని భావిస్తున్నారు.
బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, ద.ఆఫ్రికా (బ్రిక్స్) దేశాల నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. గ్రీన్ హైడ్రోజన్ విషయంలో వారి దేశాల్లో ప్రస్తుతమున్న పరిస్థితులను వివరించారు.
ఆగ్నెస్ ఎం.డా కోస్టా (గనుల మంత్రిత్వ శాఖ, బ్రెజిల్), కోవెలెవ్ ఆండ్రీ (రష్యన్ ఎనర్జీ ఏజెన్సీ, రష్యా), డా.ప్రకాష్ చంద్ర మైథాని, (శాస్త్రవేత్త, ఎంఎన్ఆర్ఈ), ఫు తియాన్యి
(నేషనల్ ఎనర్జీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా), మక్‌గాబో హెచ్ సిరి (అంతర్జాతీయ సంబంధాలు, జాతీయ శక్తి విభాగంద.ఆఫ్రికా) ముఖ్య వక్తలుగా ఈ వెబినార్‌లో ప్రసంగించారు.
వెబినార్‌లో ప్రసంగించిన కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అలోక్ కుమార్, ప్రస్తుత నిబంధనలు పెట్టుబడులకు అనవసర అడ్డంకులు కాదని నిరూపించేలా ప్రభుత్వం, పరిశ్రమలు కలిసి పనిచేయాలని అన్నారు. హైడ్రోజన్ సురక్షిత రవాణా, నిల్వ, ఉత్పత్తి స్థానానికి సంబంధించిన ధృవీకరణ పత్రం కలిగి ఉండటం కోసం పాటించే ఉమ్మడి అంతర్జాతీయ ప్రమాణాల నుంచి హైడ్రోజన్ వాణిజ్యం ప్రయోజనం పొందుతుందని చెప్పారు. ఈ అంశాలపై బ్రిక్స్ దేశాలు కలిసి పనిచేయగలవన్నారు.
గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కోసం, భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక నేషనల్ హైడ్రోజన్ మిషన్‌ను ప్రారంభించిందని వెల్లడించారు. ప్రైవేటు రంగాన్ని కూడా కలుపుతూ, ఎరువుల సంస్థలు, శుద్ధి సంస్థల కోసం పారదర్శకంగా, పోటీ పద్ధతిలో హైడ్రోజన్ కొనుగోలు బాధ్యతలను ప్రవేశపెట్టడానికి ఈ మిషన్‌ను ప్రారంభించిందని వివరించారు.
సమ్మిట్‌కు అందరికీ స్వాగతం పలికిన ఎన్‌టీపీసీ సీఎండీ శ్రీ గురుదీప్ సింగ్; సుస్థిర అభివృద్ధి, సమగ్ర ఆర్థికాభివృద్ధిపై ఐదు బ్రిక్స్ దేశాలు ఉమ్మడి అభిప్రాయాన్ని పంచుకుంటాయని చెప్పారు. ఇంధన సహకారాన్ని బలోపేతం చేయడం, అందరికీ అందుబాటు ధరల్లో నమ్మకమైన, సురక్షితమైన ఇంధనం అందేలా చూడడం బ్రిక్స్ దేశాల ఎజెండాలో ప్రాముఖ్యత గల వ్యూహాత్మక అంశమని అన్నారు.
హైడ్రోజన్ ఆర్థిక వ్యవస్థకు భారత్ మారడం వల్ల, హైడ్రో కార్బన్ ఇంధనాల దిగుమతిపై దేశం ఆధారపడటాన్ని తగ్గించడమేగాక, ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందిస్తుందని, హరితవాయు ఉద్గారాలను పూర్తిగా నిర్మూలిస్తుందని, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని నెరవేరుస్తుందని గురుదీప్ సింగ్ వివరించారు.
కర్బన రహిత ఉద్గారాల నిర్ధరించేలా బ్రిక్స్ దేశాలు చర్యలు తీసుకోగలవు. ఎందుకంటే, అభివృద్ధి చెందుతున్న ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయడానికి అయ్యే ఖర్చు అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఈ దేశాల్లో భిన్నంగా ఉంటుంది. కర్బన ఉద్గారాల నియంత్రణ ప్రపంచవ్యాప్తంగా సానుకూల ప్రభావం చూపుతుంది.
భారత్‌లో గ్రీన్ హైడ్రోజన్ కార్యక్రమాల్లో ఎన్‌టీపీసీ ముందడుగులో ఉంటోంది. కర్బన ఉద్గారాల నియంత్రణ, హైడ్రోజన్ రంగాల్లో అధ్యయనాలు, ప్రయోగాలు చేస్తున్న ఎన్‌టీపీసీ, గ్రీన్ హైడ్రోజన్‌పై కొన్ని నమూనా ప్రాజెక్టులను కూడా చేపట్టింది.
స్థిరమైన ఇంధన సరఫరాను నిర్ధరించడంలో, శక్తి లభ్యత స్థాయిని పెంచడంలో, పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడంలో గ్రీన్ హైడ్రోజన్‌కు అధిక సామర్థ్యం ఉంది. అందుకే గ్రీన్ హైడ్రోజన్ విషయంలో బ్రిక్స్ సహా అన్ని దేశాలకు అమిత ఆసక్తి ఉంది.
***
(Release ID: 1729743)
Visitor Counter : 188