భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 పై జరుగుతున్న పోరాటానికి సహకరిస్తున్న ' భెల్'


ఇంతవరకు 5లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా ఆక్సిజన్ సరఫరా చేసిన భెల్ యూనిట్లు

ఆక్సిజన్ ఉత్పత్తిని ఎక్కువ చేయడానికి చర్యలు

Posted On: 21 JUN 2021 2:53PM by PIB Hyderabad

కోవిడ్-19 మహమ్మారి రూపంలో ఎదురైన సమస్యను ఎదుర్కొని క్లిష్ట పరిస్థితి నుంచి గట్టెక్కడానికి జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలకు ' భెల్' (భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్) తనవంతు సహకారాన్ని అందిస్తూ ప్రజలను ఆదుకోవడానికి చర్యలను అమలు చేస్తోంది. భోపాల్, హరిద్వార్ లలో ఉన్న ' భెల్' యూనిట్లు తమ వద్ద ఉన్న వనరులతో తమ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు అవసరమైన మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేశాయి. 

' భెల్' హరిద్వార్ యూనిట్ రోజుకి 24,000 క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయగల సామర్ధ్యం కలిగి ఉంది. దీనిని ప్లాంట్ సొంత అవసరాల కోసం ఉత్పత్తి చేస్తున్నారు. అయితే, ఏప్రిల్ మధ్యలో ఆక్సిజన్ కు ఏర్పడిన కొరతను దృష్టిలో ఉంచుకుని రోజుకి 3,000 సిలిండర్లను ఆక్సిజన్ తో నింపగల సామర్ధ్యాన్ని సమకూర్చుకుంది. వారం రోజుల రికార్డ్  వ్యవధిలో అన్ని వనరులను సమకూర్చుకుని సిబ్బంది సహకారంతో రేయింబవళ్లు పనిచేసి  ' భెల్' ఈ సామర్ధ్యాన్ని సమకూర్చుకుంది. ఈ ప్లాంట్ ఇప్పటివరకు ఆస్పత్రులు మరియు జిల్లా అధికారులుపిఎస్‌యులుఉత్తరాఖండ్యుపిలోని సాయుధ దళాలు మరియు ఎన్‌సిఆర్ ఢిల్లీ  అవసరాలను తీర్చడానికి దాదాపు 67,000 సిలిండర్లు (3,87,000 క్యూఎంలకు పైగా) వైద్య ఆక్సిజన్‌ను సరఫరా చేసి వేలాది మంది ప్రాణాలను రక్షించడంలో తనవంతు సహకారాన్ని అందించింది. 

ఇదేవిధంగా' భెల్' భోపాల్ ప్లాంట్ ఇప్పటివరకు 1,74,000 క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్‌ను (26,000 సిలిండర్లకు పైగా) మధ్యప్రదేశ్ లోని కస్తూర్బా హాస్పిటల్, ఎయిమ్స్, మిలిటరీ హాస్పిటల్, రైల్వే హాస్పిటల్, పోలీస్ హాస్పిటల్‌తో పాటు  వివిధ ప్రైవేట్ ఆసుపత్రులకు సరఫరా చేసింది.

వైద్య అవసరాల కోసం ఆక్సిజన్ సరఫరాకు పెరిగిన డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని ' భెల్' హైదరాబాద్ యూనిట్ 12 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న ఆక్సిజన్ ప్లాంటుకు అత్యవసర మరమ్మత్తులు సర్వీసింగ్ చేసి రికార్డు సమయంలో దీనిలో ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ ప్లాంట్ రోజుకి 2000  క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని కలిగి ఉంది. దీనిని అవసరమైన ఆసుపత్రులకు సరఫరా చేస్తారు. 

' భెల్' ఇతర యూనిట్లలో కూడా ఆక్సిజన్ ఉత్పత్తి సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. జాతీయ అవసరాలకు స్పందించడానికి ' భెల్' సిద్ధంగా ఉంది. 

భారతదేశంలో అతిపెద్ద ఇంజనీరింగ్ మరియు ఉత్పాదక సంస్థలలో ' భెల్' ఒకటి. దేశ ఆర్ధిక వ్యవస్ధలో 180 ప్రధాన రంగాలకు అవసరమైన పరికరాల   డిజైన్, ఇంజనీరింగ్, నిర్మాణం, పరీక్ష, కమీషనింగ్ మరియు సర్వీసింగ్‌ కార్యక్రమాలను ' భెల్' చేపడుతోంది. 

 

***



(Release ID: 1729185) Visitor Counter : 225