శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సెన్సిట్ ర్యాపిడ్ కొవిడ్-19 ఏజీ కిట్
Posted On:
19 JUN 2021 9:19AM by PIB Hyderabad
కొవిడ్-19 కారణంగా ప్రపంచదేశాలన్నింటిపై తీవ్ర ప్రభావం పడింది. కొవిడ్ సోకే సమయంలో ఏర్పడే లక్షణాల తీవ్రత గుర్తించలేని స్థాయి నుంచి ప్రాణాంతకం వరకు ఉంటుంది. యాంటీజెన్ పరీక్షతో కూడిన త్వరితగతి పరీక్షల విధానంలో, అతి తక్కువ సమయంలోనే వందలాది నమూనాలను పరీక్షించవచ్చు. ఇలాంటి వేగవంతమైన పరీక్షలను ప్రజలకు దగ్గరకు చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన కృషి ప్రశంసనీయం. కచ్చితమైన ఫలితాన్ని చూపే, భరించగలిగే ఖర్చులో ఉండే పరీక్ష సామగ్రిని అభివృద్ధి చేయడానికి చాలామంది ఆవిష్కర్తలు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ప్రస్తుత కష్టకాలంలో, వైరస్‌ను సులువుగా గుర్తించేలా ఆరోగ్య సిబ్బందికి సాయపడడమేగాక, మనదేశంలో జీవసాంకేతికత వ్యవస్థను వృద్ధి చేయడానికి కూడా ఈ ఆవిష్కరణలు ఉపయోగపడతాయి.
కొవిడ్-19 పరిశోధన సంస్థల బృందం ఆధ్వర్యంలో, డీబీటీ-బిరాక్ మద్దతుతో, "సెన్సిట్ ర్యాపిడ్ కొవిడ్-19 ఏజీ కిట్"ను 'యుబయో బయోటెక్నాలజీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్' రూపొందించింది. సార్స్ కోవ్-2 న్యూక్లియోకాప్సిడ్ ప్రోటీన్‌ను 15 నిమిషాల్లో కచ్చితంగా గుర్తించేందుకు ఈ కిట్‌ను రూపొందించారు. కిట్ వినియోగం కోసం, అనుమానిత వ్యక్తి నుంచి నమూనాలు సేకరిస్తారు. ఐసీఎంఆర్ అనుమతి కూడా పొందిన ఈ కిట్, ఒక క్రోమాటోగ్రాఫిక్ ఇమ్యునోఅసే. అంటే, పరీక్ష ఫలితాన్ని ఇది దృశ్యరూపంలో చూపుతుంది. 'శాండ్‌విచ్ ఇమ్యునోఅసే' సూత్రంపై, ఒక జత మోనోక్లోనల్ యాంటీబాడీలను ఉపయోగించుకుని పనిచేస్తుంది. కొవిడ్ నిర్దిష్ట యాంటిజెన్‌తో కలిసినప్పుడు రంగు రేఖను చూపుతుంది. ఈ కిట్ 86 శాతం సున్నితత్వాన్ని, 100 శాతం విశిష్టతను ప్రదర్శిస్తుంది. దీని జీవితకాలం 24 నెలలు. "సెన్సిట్ రాపిడ్ కొవిడ్-19 ఏజీ కిట్"ను విక్రయాల కోసం మార్కెట్‌లోకి సైతం తీసుకొచ్చారు.
కరోనా వైరస్ సోకిన వ్యక్తులను ఆరోగ్య సిబ్బంది త్వరగా గుర్తించడానికి, వారి సమయాన్ని ఆదా చేయడానికి, రోగికి మెరుగైన సూచనలు, చికిత్స అందించడానికి ఇలాంటి త్వరితగతి పరీక్ష కిట్లు వీలు కల్పిస్తాయి.
*****************************************
మరింత సమాచారం కోసం డీబీటీ/బిరాక్ ఈ-సంప్రదింపుల విభాగాన్ని సంప్రదించవచ్చు
@DBTIndia@BIRAC_2012
www.dbtindia.gov.in
www.birac.nic.in
డీబీటీ గురించి:
కేంద్ర విజ్ఞాన, సాంకేతికత మంత్రిత్వ శాఖ పరిధిలో బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ) పనిచేస్తుంది. మనదేశంలో వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, జంతుశాస్త్రాలు, పర్యావరణం, పరిశ్రమల్లో జీవ సాంకేతికత పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
బిరాక్ గురించి:
షెడ్యూల్-బిలోని సెక్షన్ 8 కింద, డీబీటీ ఏర్పాటు చేసిన లాభాపేక్షలేని ప్రభుత్వ రంగ సంస్థ "బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్" (బిరాక్). దేశంలో ఉత్పత్తి వృద్ధి అవసరాలకు సంబంధించి, వ్యూహాత్మక పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను నిర్వహించడానికి జీవ సాంకేతికత పరిశ్రమను బలోపేతం చేయడానికి, కార్యకలాపాలు సులభతరం చేసే సమన్వయ సంస్థగా ఇది పనిచేస్తుంది.
****
(Release ID: 1728495)
Visitor Counter : 331