ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

శాస్త్రీయ ఆధారాలతో తీసుకున్న పారదర్శక నిర్ణయం!


కోవిషీల్డ్ డోసుల మధ్య గడువు పెంపుపై ఎన్.టి.ఎ.జి.ఐ. చైర్మన్ అరోరా వివరణ

ఈ నిర్ణయంపై ఎన్.టి.ఎ.జి.ఐ. సభ్యుల్లో ఎలాంటి అసమ్మతీ లేదని స్పష్టీకరణ

“శాస్త్రీయ ఆధారాలపై పర్యవేక్షణకు భారతదేశానికి పటిష్టమైన యంత్రాంగం ఉంది”

ప్రజల ఆరోగ్యం, రక్షణ అంశాలకు ప్రాధాన్యమిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నామని ప్రకటన

Posted On: 16 JUN 2021 8:29AM by PIB Hyderabad

  వ్యాధినిరోధక కార్యక్రమంపై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా సంఘపు కార్యాచరణ బృందం (ఎన్.టి.ఎ.జి.ఐ.) అధ్యక్షుడు డాక్టర్ ఎన్.కె. అరోరా, తాజాగా దూరదర్శన్ న్యూస్ (డి.డి.న్యూస్) ఛానల్ తో మాట్లాడారు. కోవిడ్ వైరస్ మహమ్మారి కట్టడికోసం భారతదేశం చెపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం గురించి ఆయన వివరించారు. 

 

శాస్త్రీయ ఆధారాలతోనే కోవిషీల్డ్ డోసుల మధ్య గడువు హెచ్చింపు

  కోవిషీల్డ్ వ్యాక్సీన్ రెండు డోసుల మధ్య గడువు పెంచాలన్న నిర్ణయం వెనుక ప్రాథమిక శాస్త్రీయ కారణం ఉందని డాక్టర్ ఎన్.కె. అరోరా అన్నారు. శాస్త్రీయ ఆధారాలను, ఎడెనో వెక్టార్ వ్యాక్సీన్ల పనితీరును ప్రాతిపదికగా చేసుకుని రెండు డోసుల మధ్య గడువును 4-6వారాలనుంచి 12-16వారాల వరకూ పెంచినట్టు డాక్టర్ ఎన్.కె. అరోరా వివరించారు. “రెండు డోసుల మధ్య గడువు 12 వారాలుగా ఉన్నపుడు వ్యాక్సీన్ సామర్థ్యం 65శాతంనుంచి 88శాతం వరకూ ఉందని, యునైటెడ్ కింగ్ డమ్ ప్రధాన ఆరోగ్య సంస్థ అయిన పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ ఈ ఏడాది ఏప్రిల్ లో వెలువరించిన సమాచారం ద్వారా తెలిపింది. ఈ సమాచారం ఆధారంగానే  అల్ఫా వేరియంట్ గా చెప్పుకునే  వైరస్ ను వ్యాప్తిని వారు అధిగమించగలిగారు. డోసుల మధ్య 12వారాల గడువు పెట్టినందునే యు.కె. ఈ సమస్యను అధిగమించగలిగింది. గడువు పెంచినపుడు ఎడెనో వెక్టార్ వ్యాక్సీన్లు మరింత మెరుగైన ఫలితాలు అందిస్తున్నాయని మౌలిక శాస్త్రీయ ఆధారాలతో సహా రుజువైందున ఇది మంచి ఆలోచనే అని మేమూ భావించాం.  దీనితో రెండు డోసుల మధ్య గడువును 12-16వారాలకు పెంచాలని ఈ ఏడాది మే 13న నిర్ణయం తీసుకోవడం జరిగింది.” వ్యాక్సీన్ వేసుకునే ప్రజలకు కూడా ఇది సౌకర్యమేనని, ఎందుకంటే ప్రతి ఒక్కరూ కచ్చితంగా 12 వారాల తర్వాత రెండవ డోసుకోసం రాలేరని ఆయన అభిప్రాయపడ్డారు.

   కోవిషీల్డ్ వ్యాక్సీన్ రెండు డోసుల మధ్య అంతరాన్ని పెంచాలన్న నిర్ణయం పూర్తిగా శాస్త్రీయ ఆధారాలతో తీసుకున్నదేనని ఆయన ఉద్ఘాటించారు. “ఈ విషయంలో నిర్ణయాలు తీసుకోవడానికి  ఎంతో పారదర్శకమైన వ్యవస్థ మాకు అందుబాటులో ఉంది. శాస్త్రీయ ప్రాతిపదిక ఆధారంగానే నిర్ణయాలు కూడా జరుగుతాయి. ఈ విషయంపై కోవిడ్ కార్యాచరణ బృందం నిర్ణయం తీసుకున్నపుడు సభ్యులనుంచి ఎలాంటి వ్యతిరేకతా, అసమ్మతీ ఎదురుకాలేదు. ఎన్.టి.ఎ.జి.ఐ. సమావేశంలో కూడా కూలంకషంగా ఈ అంశంపై చర్చించాం. అక్కడా అసమ్మతి తలెత్తలేదు. రెండు డోసుల మధ్య 12నుంచి 16వారాల మధ్య వ్యవధి ఉండాలని ఆ సమావేశం కూడా సిఫార్సుచేసింది.” అని అరోరా అన్నారు. రెండు డోసుల మధ్య నాలుగు వారాల వ్యవధి ఉండాలంటూ ప్రారంభంలో తీసుకున్న నిర్ణయం అప్పటికి అందుబాటులో ఉన్న సమాచారంతోనే తీసుకున్నామని అన్నారు. డోసుల మధ్య అంతరం పెంచినపుడు వ్యాక్సీన్ మరింత మెరుగైన సామర్థ్యంతో పనిచేసినట్టుగా వెలువడిన అధ్యయనాల ప్రాతిపదికగా ఈ గడువు పెంచినట్టు ఆయన చెప్పారు. “కోవిషీల్డ్ వ్యాక్సీన్ పై తొలుత జరిగిన అధ్యయనాల ఫలితాలు రకరకాలుగా ఉన్నాయి. యు.కె. వంటి దేశాల్లో గత ఏడాది డిసెంబరులో ఈ వ్యాక్సీన్ ను ప్రవేశపెట్టినపుడే రెండు డోసుల మధ్య 12వారాల గడువు పెట్టారు. ఈ సమాచారం గురించిన మాకు తెలియనపుడు, మేం మాత్రం ట్రయల్ సమాచారం ఆధారంగా 4వారాల గడువును నిర్ణయించాం. వ్యాధి నిరోధక స్పందనలో ఇదే మంచి గడువు అనిపించింది. అనంతరం, శాస్త్రీయం ఆధారాలు, లేబరేటరీ పరిశోధనల ప్రాతిపదికగా ఆరువారాల గడువుకు సంబంధించి మాకు అదనపు సమాచారం తారసపడింది. అంతే,..గడువును నాలుగు వారాలనుంచి 8 వారాలకు పెంచాలని భావించాం. రెండు డోసుల మధ్య గడువు 4వారాలు ఉన్నపుడు వ్యాక్సీన్ సామర్థ్యం దాదాపు 57శాతమని, గడువు ఎనిమిది వారాలైనపుడు సామర్థ్యం 60శాతమేనని పలు అధ్యయనాల ద్వారా తెలియడంతో గడువు పెంచాలన్న ఆలోచన మాకూ వచ్చింది.” అని ఆయన అన్నారు.

   రెండు డోసుల మధ్య గడువును 12 వారాలకు ఎన్.టి.ఎ.జి.ఐ. ముందుగానే ఎందుకు పెంచలేదన్న అంశంపై ఆయన మాట్లాడుతూ, “యు.కె.లో క్షేత్రస్థాయి సమాచారం కోసం వేచి చూడాలని మేం మొదట్లో నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఆస్ట్రీజెనెకా (మన దేశంలో కోవిషీల్డ్) వ్యాక్సీన్ ను మన తర్వాత పెద్దఎత్తున వినియోగించిన మరో దేశం యు.కె. మాత్రమే.” అని ఆయన అన్నారు.  ఆస్ట్రా జెనెకా వ్యాక్సీన్ రెండు డోసుల మధ్య 12నుంచి 16 వారాల గడువును అమలు చేసిన దేశాలకు ఉదాహరణగా కెనడా, శ్రీలంక, తదితర దేశాలు కూడా నిలిచాయని అన్నారు.

ఒక డోసు-రెండుడోసులతో రక్షణ

  వ్యాక్సీన్లకు సంబంధించి పాక్షిక వ్యాధి నిరోధక ప్రక్రియ ఎలా ఉంది.., సంపూర్ణ ప్రక్రియ సామర్థ్యం ఎలా ఉంది...అనే అంశాలపై కూడా ఎన్.టి.ఎ.జి.ఐ. ఒక పరిశీలన జరిపిందని డాక్టర్ అరోరా చెప్పారు. “రెండు మూడు రోజుల తర్వాత డోసుల మధ్య గడువు పెంచాలని నిర్ణయించాం. ఒక డోసు ఆస్ట్రా జెనెకా వ్యాక్సీన్ 33శాతం రక్షణ ఇస్తున్నదని, రెండు డోసుల వ్యాక్సీన్ అయితే 60శాతం రక్షణ ఇస్తున్నదని అప్పట్లో యు.కె.నుంచి సమాచారం అందింది.; అయితే, ఈ నేపథ్యంలో,.. గడువు నాలుగు వారాలా...లేక 8 వారాలా.. అన్న అంశంపై భారతదేశంలో మే నెల మధ్యకాలంనుంచి చర్చలు సాగుతూనే వచ్చాయి.” అని ఆయన అన్నారు.

 ఈ దశలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రభావశీలతను అంచనా వేయడానికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలని అప్పడే నిర్ణయం జరిగింది. “ఎన్.టి.ఎ.జి.ఐ. ఈ నిర్ణయం తీసుకునేటప్పటికి,..మేం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రభావాన్ని అంచనా వేయడానికేకాక, వ్యాక్సీన్ రకాలు, డోసుల మధ్య గడువు, పాక్షిక, సంపూర్ణ వ్యాక్సినేషన్ ప్రక్రియల ఫలితాలు వంటి అంశాలను కూడా పరిశీలించాలని అప్పటికే నిర్ణయం తీసుకున్నాం. భారతదేశంలోని 17-18కోట్ల ప్రజలకు ఇప్పటికీ ఒక డోసు వ్యాక్సీన్ మాత్రమే అందినా, నాలుగు కోట్ల మందికి రెండు డోసులు అందిన పరిస్థితుల్లో ఈ నిర్ణయం చాలా అవసరం.” అని డాక్టర్ అరోరా అన్నారు.

  పాక్షిక వ్యాధి నిరోధక ప్రక్రియ,.. సంపూర్ణ వ్యాధినిరోధక ప్రక్రియల ప్రభావశీలతలను పోల్చుతూ చండీగఢ్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ (పి.జి.ఐ.) చేపట్టిన అధ్యయనాన్ని డాక్టర్ అరోరా ఈ సందర్భంగా ప్రస్తావించారు. “వ్యాధి నిరోధక ప్రక్రియ పాక్షికమైనా, సంపూర్ణమైనా అది 75శాతం సామర్థ్యంతో ఉన్నట్టుగా చండీగఢ్ పి.జి.ఐ. అధ్యయనం స్పష్టంగా తెలిపింది. అంటే, పాక్షికమైనా, సంపూర్ణమైనా వ్యాక్సీన్ సామర్థ్యం ఒకేలా ఉందన్నమాట. పంజాబ్, ఉత్తరాది రాష్ట్రాలు, ఢిల్లీ ప్రాంతాల్లో ఆల్ఫా వేరియంట్ వైరస్ పై కూడా దీని ప్రభావం ఇలాగే ఉంది. అంటే, మీకు ఒకే డోసు వ్యాక్సీన్ అందినా మీకు రక్షణ లభించినట్టే.” అని డాక్టర్ అరోరా అన్నారు.

  వేలూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (సి.ఎం.సి.) పరిశోధనల ఫలితాలు కూడా ఇలాగే ఉన్నాయని ఆయన అన్నారు. “తమిళనాడులో ఏప్రిల్, మే నెలల్లో సెకండ్ వేవ్ వ్యాప్తి చెందిన సమయంలోనే వ్యాక్సినేషన్ పై ఈ అధ్యయనం చేపట్టారు. ఎవరికైనా పాక్షికంగా కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ జరిగి ఉంటే, అది 61శాతం సామర్థ్యాన్ని చూపించిందని,  రెండు డోసులు ఇచ్చినపుడు 65శాతం సామర్థ్యంతో పనిచేసిందని చెప్పారు. మొదటి డోసుకు, రెండవ డోసుకు మధ్య సామర్థ్యంలో చాలా తక్కువ తేడా కనిపించింది. అయితే,. ఈ లెక్కల్లో కొంతమేర అనిశ్ఛిత పరిస్థితి కనిపిస్తోంది.” అని ఆయన అన్నారు.

వ్యాక్సీన్ సామర్థ్యంపై కొనసాగుతున్న పర్యవేక్షణ, అధ్యయనాలు

   వ్యాక్సినేషన్ పై  పి.జి.ఐ., వేలూరు సి.ఎం.సి. అధ్యయనాలతో పాటుగా, ఢిల్లీ పరిధిలోని మరో రెండు సంస్థల అధ్యయనాలు కూడా వెలువడ్డాయని డాక్టర్ అరోరా చెప్పారు. “ఒక డోసుతో 4శాతం, రెండు డోసులతో 5శాతం ఇన్ ఫెక్షన్ ఉన్నట్టు ఒక అధ్యయనం పేర్కొంది. మౌలికంగా చూస్తే రెండింటి మధ్య ఇన్ ఫెక్షన్ లో పెద్దతేడా ఏమీ లేదు. అలాగే 1.5నుంచి 2 శాతం ఇన్.ఫెక్షన్ చోటుచేసుకున్నట్టు మరో అధ్యయనం చెబుతోంది.” అని ఆయన అన్నారు.

   వివిధ వనరులనుంచి అందిన సమాచారాన్ని సమగ్రంగా రూపొందించి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రభావశీలత, తదితర అంశాలపై నివేదిక ఇస్తామని డాక్టర్ అరోరా చెప్పారు. అలాగే, వ్యాధి నిరోధక ప్రక్రియతో తలెత్తే ప్రతికూలతలపై పర్యవేక్షణకోసం భారతదేశానికి కూడా ఒక పటిష్టమైన వ్యవస్థ(ఎ.ఇ.ఎఫ్.ఐ.) ఉందని ఆయన చెప్పారు.

 

కోవిషీల్డ్ డోసుల మధ్య గడువును తగ్గించే ప్రతిపాదన ఏదైనా ఉందా?

  ఈ ప్రశ్నకు డాక్టర్ అరోరా సమాధానమిస్తూ,..దీనిపై శాస్త్రీయబద్ధంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజల ఆరోగ్యం, రక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ నిర్ణయం తీసుకుంటామన్నారు. “కోవిషీల్డ్ వ్యాక్సీన్, వ్యాక్సినేషన్ ప్రక్రియా రెండూ క్రియాశీలంగానే ఉన్నాయి. తక్కువ గడువుతో వ్యాక్సినేష్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని రేపో మాపో ఏదైనా అధ్యనం తేల్చిన పక్షంలో,.. దీని ప్రయోజనం కనీసం 5నుంచి పది శాతం ఉన్నా సరే.. ఫలితాలపై వివేచన ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం. అలా కాకుండా ప్రస్తుతం తీసుకున్న నిర్ణయమే బాగుందనుకుంటే దీన్నే కొనసాగిస్తాం.” అని ఆయన స్పష్టం చేశారు. చివరకు మన ప్రజలకు ఆరోగ్యం, తగిన రక్షణ అందేలా చూడటమే మా ముఖ్య ప్రాధాన్యత అని అన్నారు. “మా చర్చల్లో ప్రధాన పాత్ర పోషించేది ఇదే. కొత్త శాస్త్రీయ ఆధారాలు కనిపెట్టడానికి, ఏదైనా సముచిత నిర్ణయం తీసుకోవడానికి ఇదే కీలకం” అని ఆయన అన్నారు.

 

****



(Release ID: 1727688) Visitor Counter : 211