ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

యోగా సదస్సు 2021ని ఉద్దేశించి ప్రసంగించిన డాక్టర్ హర్షవర్ధన్


“జనాభా సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ, సంక్షేమానికి యోగా అందిస్తున్న ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని యోగాను ప్రతీ ఒక్క పౌరునికి దగ్గర చేయాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం”.
యోగా ఆచరించడం వల్ల మానవాళికి సమకూరుతున్న ప్రయోజనాలను ప్రపంచ దేశాలన్నీ గుర్తించాయి : డాక్టర్ హర్షవర్ధన్

Posted On: 15 JUN 2021 7:39PM by PIB Hyderabad

ప్రపంచ యోగా సదస్సు 2021 ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద్ యశో నాయక్ సమక్షంలో కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రసంగించారు. జూన్ 21వ తేదీ 7వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ,  భారత సాంస్కృతిక వ్యవహారాల మండలితో కలిసి “మోక్షాయతన్ యోగ సంస్థాన్” ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
మానవాళి సంపూర్ణ ఆరోగ్యం, సంక్షేమం గురించి ఈ రోజు ప్రపంచం యావత్తు మాట్లాడుకోవడాన్ని బట్టి యోగా ప్రాచీన వైభవం తెలుస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి నొక్కి చెప్పారు. “ప్రపంచవ్యాప్తంగా యోగా ఆచరణను ప్రపంచం అంతా ఆమోదించడం దాని విస్తృత ప్రాచుర్యానికి నిదర్శనం.  చివరికి పాశ్చాత్య ప్రపంచం కూడా యోగాను రోజువారీ జీవనశైలిలో భాగంగా చేసుకుంది. ఈ మహమ్మారి కాలంలో శారీరక, మానసిక ఆరోగ్యం ప్రాధాన్యతను సర్వత్రా నొక్కి చెబుతున్న నేపథ్యంలో చాలా మంది ప్రజలు యోగా ఆచరించడం ప్రారంభించారు” అన్నారు.

యోగా దినోత్సవ ప్రాధాన్యతను నొక్కి చెబుతూ (“యోగాతోనే జీవించు, ఇంటి దగ్గరే ఉండు”) “ప్రస్తుత అంతర్జాతీయ ఆరోగ్య ఎమర్జెన్సీ నేపథ్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిలిపివేశారు. కోవిడ్-19 కాలంలో ఈ సందేశం ప్రాధాన్యత నేపథ్యంలో ఈ సందేశం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. స్థూల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రజలందరూ అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం అవసరం. ప్రజల సంపూర్ణ ఆరోగ్యం, సంక్షేమానికి యోగా అందిస్తున్న ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని యోగాను ప్రతీ ఒక్క పౌరునికి చేరువ చేయాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం”.
2014 సెప్టెంబర్ లో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ ప్రస్తావించిన మాటలు డాక్టర్ హర్షవర్థన్ గుర్తు చేస్తూ “2014 ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు అందరికీ తెలిసిందే. యోగా ప్రయోజనాలను ప్రపంచానికి తెలియచేసేందుకు ప్రతీ ఏడాది జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పాటిద్దాం” అని ప్రతిపాదించారు.

“కోవిడ్-19 కారణంగా ప్రజోపయోగ స్థలాల్లో విధించిన పరిమితుల నేపథ్యంలో యోగా అందించిన ప్రయోజనాల గురించి ప్రస్తావిస్తూ  ఈ దేశానికి చెందిన చారిత్రక వైభవం అంతర్జాతీయ ఆమోదనీయత సాధించడం నిజంగా గర్వకారణం. రోగనిరోధక శక్తి పెంచడంలోను, ఒత్తిడులను దూరం చేయడంలోను యోగా ప్రయోజనాలు ఏమిటన్నది చక్కగా లిఖితం అయి ఉంది. గత ఏడాది మహమ్మారి ప్రారంభం అయిన సమయంలో చాలా మంది ప్రజలు ఇంటి నుంచే పని చేస్తున్నారు, క్వారంటైన్ లో ఉన్న భావం ప్రభావం అందరి మీద ఉంది. కోవిడ్-19 విస్తరణ కారణంగా శారీరక వ్యాయామాన్ని పెంచుకునేందుకు ఉపయోగించే బహిరంగ స్థలాలు, పార్కులు, క్రీడలు, జిమ్ లు మూసి వేశారు. సరికొత్త వాస్తవాల కారణంగా పెరిగిన పనిభారం, పరిమిత పరిధిలోనే జీవితం గడపాల్సిన పరిస్థితుల కారణంగా ప్రజల్లో ఒత్తిడులు పెరిగిపోయినట్టు కూడా గుర్తించడం జరిగింది. ఇలాంటి పరిమితుల నేపథ్యంలో మానసిక శాంతిని పెంచడానికి యోగా ఒక పరిష్కారం చూపించింది” అని డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు.

ఆరోగ్యం అత్యంత ప్రధానం అనే విషయాన్ని అందరూ విస్తృతంగా గుర్తించారని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. యోగా ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ప్రపంచదేశాలన్నీ గుర్తించాయంటూ యోగా ప్రయోజనాలను ప్రచారం చేస్తున్న విభిన్న రంగాలకు చెందిన ప్రజలు, నిపుణులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆరోగ్యవంతమైన జీవనం ప్రాధాన్యతను సగటు ప్రజలకు తెలియచేసేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్న స్వామి డాక్టర్ భరత్ భూషణ్ కు, మోక్షాయతన్ సంస్థాన్ కు ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు. యోగా, భారతీయ సంస్కృతిని ప్రచారం చేయడంలో స్వామి డాక్టర్ భరత్ భూషణ్ కొన్ని దశాబ్దాలుగా అవిశ్రాంత కృషి చేస్తున్నారు.

యోగాచరణ వల్ల ఏర్పడే ప్రయోజనాల విషయంలో ప్రజలను  చైతన్యవంతులను చేయడానికి ఈ సదస్సు మరింతగా ఉపయోగపడుతుందన్న విశ్వాసం ప్రకటిస్తూ డాక్టర్ హర్షవర్ధన్ ప్రసంగం ముగించారు.


(Release ID: 1727472) Visitor Counter : 200