రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

సరకు రవాణాకు ప్రత్యేకించిన మార్గంలో ప్రయోగాత్మకంగా రైలును నడిపిన భారత సైన్యం

Posted On: 15 JUN 2021 2:02PM by PIB Hyderabad

రైల్వే శాఖ ఇటీవలే అభివృద్ధి చేసిన "సరకు రవాణా కోసం ప్రత్యేకించిన మార్గం" (డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌-డీఎఫ్‌ఎసీ) దేశవ్యాప్తంగా సరకు రవాణాను వేగవంతం చేస్తుంది. ఈ మార్గం సమర్థతను ఉపయోగించుకుని; వాహనాలు, సామగ్రితో కూడిన సైనిక రైలును భారత సైన్యం ప్రయోగాత్మకంగా నడిపింది. విజయవంతమైన ఈ ప్రయోగం న్యూ రేవరి-న్యూ ఫులేరా మధ్య సోమవారం జరిగింది. 'డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్' (డీఎఫ్‌సీసీఐఎల్), రైల్వే శాఖతో భారత సైన్యం కుదుర్చుకున్న ఈ సహకారం, సాయుధ దళాల తరలింపు సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. జాతీయ వనరులను గరిష్టంగా వినియోగించుకోవడానికి, వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య నిరంతరాయ సమన్వయాన్ని సాధించడం కోసం తలపెట్టిన “హోల్ ఆఫ్ ది నేషన్ అప్రోచ్”లో ఈ ప్రయత్నాలు భాగం.

    డీఎఫ్‌సీసీఐఎల్, రైల్వే శాఖ సహా వివిధ విభాగాలతో భారత సైన్యం జరిపిన చర్చలు డీఎఫ్‌సీ వృద్ధికి, సాయుధ దళాల తరలింపులో అనుబంధ మౌలిక సదుపాయల వృద్ధికి సాయపడతాయి. 'రోల్ ఆన్-రోల్ ఆఫ్' (ఆర్‌వో-ఆర్‌వో)కు సంబంధించి, రక్షణ శాఖకు చెందిన వాహనాల రవాణాను ధృవీకరించడానికి, ప్రయోగాత్మక కదలికలకు మద్దతుగా కొన్ని ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి జరుగుతోంది, పద్ధతులు రూపొందుతున్నాయి.

    సాయుధ దళాల కార్యాచరణ సన్నద్ధతను పెంచేందుకు బాటలు వేసే ప్రక్రియలోని మొదటి దశకు ఈ ప్రయత్నాలు సూచిక. జాతీయ మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళిక దశలోనే సైనిక అవసరాలనూ చేర్చి, నిర్ధరించుకోవడానికి ఈ ప్రయత్నం దోహదపడుతుంది.
 

****(Release ID: 1727313) Visitor Counter : 181