ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19 మరణ గణాంకాలపై అపోహలు–వాస్తవాలు


దేశంలో కోవిడ్‌-19 మరణాలపై ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల మేరకే

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు సముచితంగా నమోదు చేయాలి
జిల్లాలవారీ కేసులు... మరణాల నిత్యం సత్వర నివేదన యంత్రాంగంపై

నిరంతర పర్యవేక్షణ అవసరాన్ని నొక్కిచెప్పిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ

Posted On: 12 JUN 2021 3:10PM by PIB Hyderabad

   భారతదేశంలో కోవిడ్‌-19 మరణాలు అధికారికంగా ప్రకటించిన సంఖ్యకన్నా 5 నుంచి 7 రెట్లు ‘అధిక మరణాలు’ సంభవించి ఉంటాయని ఓ ప్రసిద్ధ అంతర్జాతీయ పత్రిక తన వార్తా కథనంలో అంచనా వేసింది. అయితే, ఇది నిరాధార ఊహాగానంతో కూడిన అపసవ్య సమాచారం ఇవ్వడమే అవుతుంది. ఆ మేరకు సాంక్రమిక వ్యాధుల అధ్యయనమేదీ లేకుండా కేవలం పైపై గణాంకాలపై ఆధారపడి అనారోగ్యకర విశ్లేషణతో అల్లినక కథనంగా ఈ వ్యాసాన్ని మనం పరిగణించాల్సి ఉంది.

   అదనపు మరణాలంటూ అంచనా వేయడంలో సదరు పత్రిక వాడినట్లు చెబుతున్న ఉపకరణాలకు ఏ దేశంలోగానీ లేక ప్రాంతంలోగానీ మరణాల సంఖ్యను నిర్ధారించగల ప్రామాణికత లేదు. సదరు పత్రిక ఉదాహరించిన ‘రుజువు’లకు మూలం బహుశా వర్జీనియా కామన్‌వెల్త్‌ యూనివర్సిటీకి చెందిన క్రిస్టఫర్‌ లాఫ్లర్‌ నిర్వహించిన అధ్యయనం కావచ్చు. మరోవైపు సదరు పత్రిక ఉటంకించిన పరిశోధనాత్మక అధ్యయనంపై ఇంటర్నెట్‌ ద్వారా ‘పబ్‌మెడ్‌’, రీసెర్చి గేట్‌’ వగైరా శాస్త్రీయ సమాచార భాండాగారంలో శోధించినప్పటికీ దాని వివరాలుగానీ, అందుకు ఉపయోగించిన విధానంగానీ ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రాంలో బీమా క్లెయిముల ఆధారంగా కూడా అధ్యయనం సాగినట్లు సదరు పత్రిక మరో ‘రుజువు’ కూడా చూపింది. కానీ, ఈ అధ్యయనానికి సంబంధించి కూడా ఎలాంటి సమకాలిక శాస్త్రీయ సమీక్ష ఎక్కడా కానరావడం లేదు.

   ఆ పత్రిక పేర్కొన్న మరో రెండు అధ్యయనాలను ఎన్నికల అంచనాలు రూపొందించే ‘ప్రశ్నం, సి-ఓటర్‌’ సంస్థలు నిర్వహించాయి. ఇవి రెండూ ఎన్నికల ఫలితాలపై ప్రజాభిప్రాయ సేకరణ, విశ్లేషణలో అత్యంత ప్రావీణ్యంగల సంస్థలన్నది అందరికీ తెలిసిందే. ఇవి ఏనాడూ ప్రజారోగ్యంతో ముడిపడిన పరిశోధనలను నిర్వహించిన దాఖలాలు లేవు. ఇక తమకు నైపుణ్యంగల ఎన్నికల ఫలితాల విశ్లేషణ, అందుకు ఉపయోగించే విధివిధానాలు అనేకసార్లు అంచనాలు తప్పాయి. అంతేకాకుండా “స్థానిక ప్రభుత్వ గణాంకాలు, కంపెనీల రికార్డులు”వంటి అతుకుల బొంత సమాచారంతోపాటు ‘సంస్మరణ ప్రకటనల’ విశ్లేషణ వంటివాటి ఆధారంగా వార్తా కథనం రూపొందించినట్లు సాక్షాత్తూ ఆ పత్రికే అంగీకరించింది.

   ఇప్పుడు వాస్తవాలేమిటో ఒకసారి పరిశీలిద్దాం... కోవిడ్‌ గణాంకాల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తి పారదర్శక విధానాన్ని అనుసరించింది. ఆ మేరకు దేశవ్యాప్తంగా మరణాల నివేదనపై అనిశ్చితి నివారణలో భాగంగా 2020 మే నాటికే భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) “భారత దేశంలో కోవిడ్‌-19 మరణాల సముచిత నమోదు మార్గదర్శకాలు” జారీచేసింది. ఇవి భారత్‌లో మరణాలను కచ్చితంగా నమోదు చేయడం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నిర్దేశించిన ‘ఐసీడీ-10 కోడ్‌’కు అనుగుణంగా జారీ చేయబడ్డాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు అధికారిక సమాచారం ద్వారా తెలియజేసింది. దాంతోపాటు మరణాలను కచ్చితంగా నమోదు చేసేవిధంగా చూడటం కోసం పలు వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించింది. కేంద్ర బృందాలను పంపి నిర్దేశిత మార్గదర్శకాలను పాటించేలా జాగ్రత్త వహించింది.

   దేశంలో జిల్లాలవారీగా కేసులు... మరణాల సత్వర నివేదన యంత్రాంగంపై నిరంతర పర్యవేక్షణ అవసరాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఎప్పటికప్పుడు నొక్కిచెబుతూనే వచ్చింది. అలాగే రోజువారీ వాస్తవ మరణాలను తక్కువగా నివేదించే రాష్ట్రాలను మరోసారి గణాంకాలను తనిఖీ చేసుకోవాల్సిందిగానూ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా తేదీల ప్రకారం జిల్లాలవారీ వివరాలను మరణాల సంఖ్యతో సమన్వయం చేస్తూ కేంద్ర ఆరోగ్యశాఖకు గణాంకాలు పంపాలని కేంద్ర ప్రభుత్వం బీహార్‌ రాష్ట్రానికి లేఖరాయడం ఇందుకు నిదర్శనం.

   దేశంలో కోవిడ్‌ మహమ్మారి వంటి సంక్లిష్ట, ప్రజారోగ్య సంక్షోభం దీర్ఘకాలం కొనసాగుతున్న సమయంలో నమోదయ్యే మరణాల సంఖ్యకు... సాధారణంగా విపత్తు సమాప్తి అనంతరం విశ్వసనీయ వనరులద్వారా మరణాలపై లభ్యమయ్యే సమాచారం ఆధారంగా అదనపు మరణాలపై నిర్వహించే లోతైన అధ్యయనంలో తేలే వాస్తవ మరణాల సంఖ్యకు తేడా ఉంటుంది. పైగా సదరు అధ్యయనాల నిర్వహణ విధివిధానాలు ప్రామాణికమైనవిగా, గణాంక వనరులు సమగ్రమైనవిగా ఉండి, మరణాలపై వాస్తవ అంచనాలకు ప్రాతిపదికగా నిలుస్తాయి.

 

***


(Release ID: 1726679) Visitor Counter : 260