రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

రహదారి భద్రత, రహదారి నిర్మాణాన్ని ప్రోత్సహించడానికి బిఆర్ఓ కి చెందిన రెండు శ్రేష్ఠత కేంద్రాలను ప్రారంభించిన రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్

సరిహద్దు మౌలిక సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా బిఆర్ఓ చేస్తున్న కృషిని ప్రశంసించిన రక్షణ మంత్రి

Posted On: 11 JUN 2021 1:19PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని సీమా సడక్ భవన్ వద్ద బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బిఆర్ఓ) స్థాపించిన రెండు శ్రేష్ఠత కేంద్రాలను (సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్) రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ 2021 జూన్ 11 న దేశానికి అంకితం చేశారు. రహదారి భద్రత వ్యవస్థను ఇంకా పటిష్టం చేయడానికి ఈ కేంద్రాలు స్థాపించారు. రోడ్లు, వంతెనలు, ఎయిర్ ఫీల్డ్స్, సొరంగాల నిర్మాణంలో ఈ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయి. రహదారి ప్రమాదాల విశ్లేషణ భాగస్వామ్యం, విలువైన ప్రాణాలను కాపాడటానికి పద్ధతులను సూచించడం ద్వారా రహదారి భద్రత గురించి అవగాహన కల్పించడం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ రోడ్ సేఫ్టీ & అవేర్‌నెస్ (కోయెర్సా) లక్ష్యం. రోడ్లు, వంతెనలు, ఎయిర్ ఫీల్డ్స్, సొరంగ నిర్మాణాల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (కోయర్‌బాట్) దేశంలోని తూర్పు, వాయువ్య ప్రాంతాలలోని దాదాపు 60,000 కిలోమీటర్ల రోడ్లు, 56,000 మీటర్ల వంతెనలు, 19 ఎయిర్‌ఫీల్డ్‌లు, నాలుగు సొరంగాల అభివృద్ధిలో సంవత్సరాలుగా సాధించిన అనుభవాన్ని, అవగాహనను సంస్థాగతీకరించడంపై దృష్టి పెడుతుంది.

ఈ సందర్భంగా శ్రీ రాజ్‌నాథ్ సింగ్, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను స్థాపించడంలో బిఆర్‌ఓ చేసిన కృషిని ప్రశంసించారు, విలువైన ప్రాణాలను రక్షించడంలో వారు కీలక పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. రహదారి ప్రమాదాలను నిశ్శబ్ద మహమ్మారిగా పేర్కొంటూ, అవి ప్రతి సంవత్సరం సుమారు లక్షన్నర మంది ప్రాణాలను తీస్తున్నాయని ఆయన అన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి జాతీయ రహదారి భద్రతా విధానం, మోటారు వాహన చట్టం 2020, జాతీయ రహదారులపై అతి ప్రమాదకరమైన ప్రదేశాలను గుర్తించడం, ఈ కేంద్రాల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని రక్షణ మంత్రి పేర్కొన్నారు.

మారుమూల ప్రాంతాల్లో రోడ్లు, సొరంగాలు మరియు ఇతర మౌలిక సదుపాయాలను నిర్మించడం ద్వారా దేశం పురోగతిలో బిఆర్ఓ పోషించిన కీలక పాత్రను రక్షణ మంత్రి ప్రశంసించారు. సరిహద్దు ప్రాంతాల్లో, ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి సమయంలో కనెక్టివిటీని పెంచడానికి కఠినమైన వాతావరణ పరిస్థితులలో బిఆర్ఓ అవిరామంగా పని చేసిందని ఆయన కొనియాడారు. కనెక్టివిటీని దేశం పురోగతికి అవసరమైన అంశంగా అభివర్ణించిన ఆయన, సాయుధ దళాల అవసరాలను తీర్చడంతో పాటు సరిహద్దు ప్రాంతాల సామాజిక-ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. 'అటల్ టన్నెల్, రోహ్తాంగ్', కైలాష్ మాన్సరోవర్ రోడ్ మరియు జోజిలా పాస్ అత్యాధునిక నిర్మాణంతో సహా ఇటీవల బిఆర్ఓ సాధించిన విజయాల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. వినూత్న నినాదాలు, సైన్ బోర్డుల ద్వారా రహదారి భద్రత గురించి అవగాహన పెంచుతున్న బిఆర్ఓ ను ఆయన ప్రశంసించారు.

బిఆర్ఓ అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని శ్రీ రాజనాధ్ సింగ్ తెలిపారు. ఈ సంస్థ బడ్జెట్ ను పెంచామని, అత్యున్నత ప్రదేశాల వాతావరణాన్ని సైతం తట్టుకునేలా తగిన దుస్తులను సమకూర్చమని, అలాగే సంస్థలో పని చేస్తున్న వారి నైతిక స్థైర్యాన్ని పెంచేలా సిబ్బంది పదోన్నతలు కూడా సమీక్షించామని కేంద్ర మంత్రి తెలిపారు. దేశం కోసం ప్రాణాలర్పించిన బిఆర్ఓ సిబ్బంది సేవలను ఈ సందర్బంగా ఆయన గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో, రక్షణ మంత్రి బిఆర్ఓ సిబ్బంది, వారి హెచ్ ఆర్ మేనేజ్మెంట్, రిక్రూట్మెంట్ మేనేజ్మెంట్, ఎన్‌రోల్‌మెంట్, వర్క్స్ మేనేజ్‌మెంట్ పని సామర్థ్యాన్ని అంచనా వేయడానికి అభివృద్ధి చేసిన నాలుగు సాఫ్ట్‌వేర్‌లను కూడా ప్రారంభించారు. సాఫ్ట్‌వేర్ అభివృద్ధిని 'స్వావలంబన భారతదేశం' మరియు 'డిజిటల్ ఇండియా' ప్రోత్సాహానికి గొప్ప ఉదాహరణగా శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. సాఫ్ట్‌వేర్ సంస్థ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది, దానిని ఆధునీకరిస్తుంది మరియు సమయాన్ని ఆదా చేస్తుంది అని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఉమ్లింగ్ లా పాస్, లడఖ్ చుట్టి వచ్చేలా కాంచన్ ఉగర్సాండి చేస్తున్న మొట్టమొదటి సోలో ఉమెన్ మోటార్ సైకిల్ యాత్రను ఈ సందర్భంగా ఆయన జెండా ఊపి ప్రారంభించారు. రక్షణ మంత్రి కాంచన్ ఉగర్సాండికి తన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె కొత్త ఉత్సాహంతో కొత్త రికార్డులు సృష్టించాలని విశ్వాసం వ్యక్తం చేసింది.

అంతకుముందు, బోర్డర్ రోడ్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చౌదరి శ్రీ రాజ్ నాథ్ సింగ్ కు ఇటీవలి సంవత్సరాలలో బిఆర్ఓ కార్యక్రమాలు, విజయాలు గురించి వివరించారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ దార్శనికత అయిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పై దృష్టి సారించి కొనసాగుతున్న, భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఆయన తెలియజేశారు. కోవిడ్-19, ఆజాది కా అమృత్ మహోత్సవ్‌లకు సంబంధించిన బిఆర్ఓ సుదూర ప్రాంతాల్లో చేపట్టిన అవగాహన కార్యక్రమాలపై ఆయన వివరించారు. దేశానికి సేవ చేయడానికి బిఆర్ఓ కట్టుబడి ఉందని, సంస్థ సామర్థ్యాన్ని పెంచడానికి అవసరమైన అన్ని మార్పులను తీసుకువస్తుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్ పాల్గొన్నారు.

 

***(Release ID: 1726398) Visitor Counter : 23