సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
'ఖాదీ ప్రకృతి పెయింట్' పేరిట మోసం
బ్రాండ్ లో 'ఖాదీ' అని చేర్చరాదని ఒక సంస్థని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు
Posted On:
11 JUN 2021 3:13PM by PIB Hyderabad
'ఖాదీ ప్రకృతి పెయింట్' పేరిట మోసపూరితంగా పెయింట్లను ఉత్పత్తి చేస్తూ విక్రయిస్తున్న ఘజియాబాద్ కు చెందిన ఒక వ్యక్తిని తక్షణం తన కార్యకలాపాలను నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఉమేష్ పాల్ అనే వ్యక్తి జెబిఎంఆర్ ఎంటర్ప్రైజెస్ ని నిర్వహిస్తూ చట్టవిరుద్ధంగా ' ఖాదీ' అనే పేరును ఉపయోగిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ 'ఖాదీ ప్రకృతి పెయింట్' పేరిట నకిలీ పెయింట్లను విక్రయిస్తున్నాడని హైకోర్టు గుర్తించింది. ఇటువంటి కార్యక్రమాల వల్ల ఖాదీ కి ఉన్న పేరుప్రతిష్టలను భంగం కలుగుతున్నదని హైకోర్టు పేర్కొంది.
'ఖాదీ ప్రకృతి పెయింట్'ను ఆవు పేడని ముడి పదార్థంగా ఉపయోగిస్తూ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమలకమిషన్ (కెవిఐసి) వినూత్నంగా అభివృద్ధి చేసి ఉత్పత్తి చేస్తోంది. సూక్ష్మ జీవులు, బాక్టీరియా వ్యాప్తి చెందకుండా ఎక్కువకాలం పనిచేసే ఈ పెయింట్ ను 2021 జనవరి 12వ తేదీన కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా శాఖల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ మార్కెట్లోకి విడుదల చేశారు. వినియోగదారుల నుంచి ఆదరణ లభించడంతో ఈ పెయింట్ కు దేశం అన్ని ప్రాంతాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి.
దీనిని ఒక అవకాశంగా తీసుకుని జెబిఎంఆర్ ఎంటర్ప్రైజెస్ ప్రజలను మోసం చేయడానికి నకిలీ పెయింట్లను ఉత్పత్తి చేస్తూ వీటిని 'ఖాదీ ప్రకృతి పెయింట్'పేరిట విక్రయించడం ప్రారంభించింది. దీనిని గుర్తించిన కెవిఐసి హైకోర్టులో కేసు దాఖలు చేసింది. నకిలీ వ్యాపారం చేస్తున్న జెబిఎంఆర్ ఎంటర్ప్రైజెస్ www.khadiprakritikpaint.com పేరిట ఒక వెబ్ సైట్ ను ప్రారంభించడమే కాకుండా ' ఖాదీ ప్రకృతి పెయింట్' పేరుతో పేస్ బుక్ ఖాతాను, khadiprakritikpaint[at]gmail[dot]com ఈ మెయిల్ ప్రారంభించిందని కెవిఐసి కోర్టు దృష్టికి తీసుకునివచ్చింది. వీటిని తక్షణం నిలిపివేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేయాలని కెవిఐసి కోరింది.
జెబిఎంఆర్ ఎంటర్ప్రైజెస్ తాను ఉత్పత్తి చేస్తున్న నకిలీ పెయింట్లను ఇండియా మార్ట్, ట్రేడ్ ఇండియా వెబ్ సైట్ల ద్వారా కూడా విక్రయిస్తున్నదని కెవిఐసి తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకునివచ్చారు. తాను ఒక ప్రభుత్వ సంస్థ అన్న గుర్తింపును పొందడానికి జెబిఎంఆర్ సంస్థ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా శాఖల లోగో ను కూడా తన వెబ్ సైట్ లో ఉపయోగిస్తున్నదని కెవిఐసి ఆరోపించింది.
'ఖాదీ ప్రకృతి పెయింట్' తయారీ విక్రహక్కులను ఎవరికి ఇవ్వలేదని కెవిఐసి చైర్మన్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా స్పష్టం చేశారు.
చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై తమ సంస్థ చట్టపరంగా చర్యలను తీసుకుంటున్నదని శ్రీ వినయ్ కుమార్ సక్సేనా తెలిపారు. ఖాదీ పేరును దుర్వినియోగం చేసిన దాదాపు 1000 సంస్థలపై చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. http://delhihighcourt.nic.in/dhcqrydisp_O.asp?pn=119319&yr=2021
***
(Release ID: 1726269)
Visitor Counter : 185