ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
60 లక్షల సంప్రదింపులు పూర్తిచేసుకున్న ఉచిత టెలీమెడిసిన్ సర్వీస్ ’ఈ-సంజీవని’
మారుమూలనుంచే ఆరోగ్య సేవల కోసం రోజుకు 40 వేలకు పైగా ఈ-సంజీవని సంప్రదింపులు
కోవిడ్ సంక్షోభ సమయంలో ఆరోగ్య సంరక్షణలో కీలకపాత్ర
Posted On:
10 JUN 2021 5:41PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వారి ఉచిత జాతీయ టెలీమెడిసిన్ సేవ ’ఈ-సంజీవని’ 60 లక్షల సంప్రదింపులు పూర్తిచేసుకొని మరో ముఖ్యమైన మైలురాయి దాటింది. 375 కు పైగా ఆన్ లైన్ ఔట్ పేషెంట్ డిపార్ట్ మెంట్స్ ద్వారా రోజుకు 40 వేలమందికి పైగా రోగులు ఈ వినూత్నమైన డిజిటల్ మాధ్యమాన్ని వాడుకుంటూ ఆరోగ్య సేవలు అందుకోవటానికి 1600 మంది డాక్టర్లను, ప్రత్యేక నిపుణులను సంప్రదిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం జాతీయ టెలీమెడిసిన్ సేవ 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో సేవలందిస్తోంది.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ 2019 నవంబర్ లో ఈ-సంజీవని ఆలోచనకు కార్యరూపమిచ్చింది. ఇది డాక్టర్ నుంచి డాక్టర్ కు టెలీమెడిసిన్ వేదికగా మొదలైంది. భారత ప్రభుత్వపు ఆయుష్మాన్ భారత్ పథకం కింద 1,55,000 హెల్త్ అండ్ వెల్ నెస్ కేంద్రాలలో అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.అయితే, 2020 మార్చి నాటికి కోవిడ్ మహమ్మారి విజృంభించటంతో దేశవ్యాప్తంగా ఔట్ పేషెంట్ విభాగాలు దాదాపుగా మూతపడ్డాయి. దీంతో ఆరోగ్య మంత్రిత్వశాఖ అత్యంత వేగంగా మొహాలి లోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్ సాయం తీసుకొని దీన్ని వేగంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. .
డాక్టర్ కూ డాక్టర్ కూ మధ్య వారధిగా పనిచేసే టెలీమెడిసిన్ వేదిక ఈ-సంజీవని దాదాపు 30 రాష్ట్రాలలో 20,000 హెల్త్ అండ్ వెల్ నెస్ కేంద్రాలలో అమలైంది. రక్షణ మంత్రిత్వశాఖ కూడా జాతీయ స్థాయి ఔట్ పేషెంట్ విభాగాన్ని ఇదే ఈ-సంజీవని తరహాలో ప్రారంభించింది. 100 మందికి పైగా పేరుమోసిన వైద్య నిపుణులను రక్షణ మంత్రిత్వశాఖ ఆహ్వానించింది. ఆ విధంగా దేశవ్యాప్తంగా రోగులకు సేవలందించింది.
అనేక రాష్టాల ప్రజలు ఈ-సంజీవని ప్రయోజనాలను సులభంగా గుర్తించగలిగారు. దీనివలన ఈ సేవలు మరింతగా విస్తరించటానికి అవసరమైన ప్రోత్సాహం లభించింది. డిజిటల్ పద్ధతిలో వైద్య సేవలకు అదరణ బాగా పెరిగింది. అందుకే ప్రత్యేక వైద్య సేవల అందుబాటును మరింత మెరుగ్గా తీర్చిదిద్దటానికి అవకాశం వచ్చింది. మరీ ముఖ్యంగా పట్టణ ప్రజలకు కోవిడ్ రెండో వేవ్ సమయంలో వైద్యసేవలమీద కోవిడ్ వత్తిడి పడటంతో వీటి అవసరం బాగా పెరిగింది.
అతి తక్కువ సమయంలోనే భారతప్రభుత్వం జాతీయ టెలీమెడిసిన్ సేవలను ఆచరణలో పెట్టి పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న డిజిటల్ అంతరాన్ని తొలగిస్తూ వైద్య సేవలను విస్తరించగలిగింది. అదే సమయంలో క్షేత్రస్థాయిలో నిపుణులైన డాక్టర్ల లేమి సమస్యను కూడా పరిష్కరించగలిగింది. దీనివలన ద్వితీయ శ్రేణి ఆస్పత్రులమీద భారం చెప్పుకోదగినంతగా తగ్గింది. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ కు అనుగుణంగా ఈ-సంజీవని దేశంలో డిజిటల్ ఆరోగ్యవాతావరణాన్ని పెంపొందిస్తోంది.
సంప్రదింపుల సంఖ్యాపరంగా ఈ-సంజీవనిని సమర్థంగా ఉపయోగించుకున్న 10 రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్ (1219689), తమిళనాడు (1161987), కర్నాటక (1056447), ఉత్తరప్రదేశ్ (952926), గుజరాత్ (267482), మధ్యప్రదేశ్ (264364), బీహార్ (192537), మహారాష్ట్ర (177629), కేరళ (173734) , ఉత్తరాఖండ్ (134214).
https://esanjeevaniopd.in/ మీదనే కాక యాండ్రాయిడ్ మీద కూడా ఈ-సంజీవని అందుబాటులో ఉంటుంది.
***
(Release ID: 1726101)
Visitor Counter : 316