పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
ఒకసారి వినియోగించి వదిలివేసే ప్లాస్టిక్ పై చైతన్య కార్యక్రమం ప్రారంభించిన పర్యావరణ మంత్రి
ప్లాస్టిక్ దానికది సమస్య కాదు, వదిలివేసిన ప్లాస్టిక్ తోనే సమస్య : శ్రీ ప్రకాశ్ జవదేకర్
ఒకసారి వినియోగించి వదిలివేసే ప్లాస్టిక్ కు సరికొత్త ప్రత్యామ్నాయాల అభివృద్ధికి ప్లాస్టిక్ ఇండియా హాకథాన్ ను ప్రకటించిన మంత్రి
Posted On:
08 JUN 2021 9:19PM by PIB Hyderabad
తక్కువ వినియోగ యోగ్యత, అధిక పర్యావరణ ప్రతికూల స్వభావం కలిగిన ఏక వినియోగ ప్లాస్టిక్ ను క్రమక్రమంగా వినియోగం నుంచి తొలగించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి శ్రీ ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ప్లాస్టిక్ 20వ శతాబ్దికి చెందిన ఉపయోగకరమైన ఇన్నోవేషన్ అయినప్పటికీ సేకరించకుండా వదిలివేసే ప్లాస్టిక్ పర్యావరణానికి తీవ్రమైన ముప్పుగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.
"వినియోగించకుండా వదిలివేసే ప్లాస్టిక్ భూగోళానికి, జలవనరులకు కలిగిస్తున్న ప్రతికూల ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 నాటికి ఏక వినియోగ ప్లాస్టిక్ ను పూర్తిగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం కూడా ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు సమర్థవంతమైన చర్యలు తీసుకుంది" అని శ్రీ జవదేకర్ అన్నారు.
ప్రభుత్వం ఇప్పటికే ప్లాస్టిక్ వ్యర్థాలను దేశంలోకి దిగుమతి చేసుకోవడాన్ని నిషేధించిందని పర్యావరణ మంత్రి చెప్పారు. అలాగే పర్యావరణానికి ఎలాంటి హాని కలగని విధంగా ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించేందుకు కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు-2016ను కూడా ప్రకటించిన విషయం ఆయన గుర్తు చేశారు.
"ఆ నిబంధనల కింద 50 మైక్రాన్ల కన్నా తక్కువ సాంద్రత గల ప్లాస్టిక్ కారీ బ్యాగ్ లను నిషేధించడం జరిగింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ఏక వినియోగ ప్లాస్టిక్ ను నిషేధించాయి. అలాగే ఉపయోగించి పడేసే ప్లాస్టిక్ కట్లరీ వస్తువులు సహా 12 ఏక వినియోగ ప్లాస్టిక్ లను నిషేధిస్తూ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు-2016ని సవరించాలని 2021 మార్చిలో మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది" అని శ్రీ జవదేకర్ అన్నారు.
ఏక వినియోగ ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని పర్యావరణ మంత్రి నొక్కి చెప్పారు. ప్రజల అలవాట్లలో మార్పు తేవాలంటే ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, ఏక వినియోగ ప్లాస్టిక్ తగ్గింపు వంటి అంశాలపై ప్రజాచైతన్య కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందని అన్నారు. ఈ లక్ష్యంతోనే మంత్రి ఏక వినియోగ ప్లాస్టిక్ నిర్మూలించాల్సిన అవసరాన్ని తెలియచేస్తూ రెండు నెలల పాటు జరిగే ప్రజా చైతన్య ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్లాస్టిక్ దానికదే సమస్య కాదు, కాని వినియోగించి వదిలివేసిన ప్లాస్టిక్ సేకరించకపోవడమే సమస్య. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, ఏక వినియోగ ప్లాస్టిక్ ఉపయోగించడాన్ని తగ్గించడంపై ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమం ఈ రోజు ప్రారంభించాము.
దీనికి తోడు ఏకవినియోగ ప్లాస్టిక్ కు నవ్యతతో కూడిన ప్రత్యామ్నాయాలపై ప్లాస్టిక్ ఇండియా హాకథాన్ కూడా ప్రారంభిస్తున్నాం.
pic.twitter.com/jY8EjIq0HU
— Prakash Javadekar (@PrakashJavdekar) June 8, 2021
గిజ్, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యుఎన్ఇపి), భారత వాణిజ్య, పారిశ్రామిక మండలుల సమాఖ్య (ఫిక్కి) ఆధ్వర్యంలో రెండు నెలల పాటు నిర్వహిస్తున్న ప్రచారోద్యమ కార్యక్రమం కింద ప్లాస్టిక్ కాలుష్య నివారణ సందేశాన్ని అధిక శాతం మంది ప్రజలకు అందించడం కోసం నాలుగు ఆన్ లైన్ ప్రాంతీయ కార్యక్రమాలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ కార్యక్రమాల్లో భాగంగా ఏకకాల వినియోగ ప్లాస్టిక్, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన విభిన్న థీమ్ ల ద్వారా స్థానిక సంస్థలు, కాలుష్య నివారణ బోర్డులు, పారిశ్రామిక సంస్థలు, పౌర సమాజం, పౌరులను విస్తృత భాగస్వాములను చేస్తూ చర్చా గోష్ఠులు నిర్వహించనున్నారు.
ప్లాస్టిక్ వ్యర్థాల కాలుష్య నివారణ, ఏక వినియోగ ప్లాస్టిక్ నిర్మూలన విభాగాల్లో నవకల్పనలు, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ప్రోత్సహించేందుకు "ఇండియా ప్లాస్టిక్ చాలెంజ్ - హాకథాన్ 2021"ని ప్రారంభిస్తున్నట్టు శ్రీ జవదేకర్ ప్రకటించారు. ప్లాస్టిక్ కాలుష్య నివారణ, ఏక వినియోగ ప్లాస్టిక్ కు చక్కని ప్రత్యామ్నాయాల విషయంలో వినూత్నమైన పరిష్కారాలు అన్వేషించడంలో భాగస్వాములు కావాలని స్టార్టప్ లు/ ఎంటర్ ప్రెన్యూర్లు, ఉన్నత విద్యాసంస్థల్లోని పిలుపు ఇస్తూ సాగే పోటీ కార్యక్రమమే "ఇండియా ప్లాస్టిక్ చాలెంజ్ - హాకథాన్ 2021".
పాఠశాల విద్యార్థులను కూడా భాగస్వాములను చేయడం, సమాజంలో చైతన్యం విస్తరింపచేయడం లక్ష్యంగా వదిలివేసిన ఏక వినియోగ ప్లాస్టిక్ దుష్ప్రభావాలు అనే అంశంపై పాఠశాల విద్యార్థుల కోసం జాతీయ స్థాయిలో వ్యాసరచన పోటీలను కూడా ప్రకటించారు.
ఈ వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఆర్.పి.గుప్తా; జర్మనీ ప్రభుత్వ ఫెడరల్ పర్యావరణ మంత్రిత్వ శాఖ స్టేట్ సెక్రటరీ జోశెన్ ఫ్లాస్ బర్త్; ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం ఆసియా, పసిఫిక్ విభాగం ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ డెచెన్ సెరింగ్; ఫిక్కి సెక్రటరీ జనరల్; యుఎన్ఇపి ఇండియా కంట్రీ ఆఫీస్ హెడ్; గిజ్ ఇండియా కంట్రీ హెడ్ పాల్గొన్నారు.
***
(Release ID: 1725549)
Visitor Counter : 1397