పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

దేశంలో త్వరలో 8 ఫ్లయింగ్ ట్రైనింగ్ అకాడమీల ఏర్పాటు

Posted On: 02 JUN 2021 6:29PM by PIB Hyderabad

దేశంలో త్వరలో 8 ఫ్లయింగ్ ట్రైనింగ్ అకాడమీలు  ఏర్పాటు కానున్నాయి. ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్(ఎఫ్టీఓ)లను ఏర్పాటు చేయడానికి  భారత విమానాశ్రయాల సంస్థ( ఏఏఐ) అమలుచేస్తున్న విధానాలను సరళీకృతం చేయడంతో నూతన ఫ్లయింగ్ ట్రైనింగ్ అకాడమీలు ఏర్పాటుకానున్నాయి.  ఈ అకాడమీలు బెలగావి, జల్గావ్, కలబురగి, ఖాజురాహో మరియు లీలబరిలలో ఏర్పాటు అవుతాయి. విమానాలను నడపడంలో శిక్షణ ఇచ్చే రంగంలో ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టి ,శిక్షణ కోసం భారత క్యాడెట్లు విదేశాలకు వెళ్లకుండా చూడడానికి ఈ  ఫ్లయింగ్ ట్రైనింగ్ అకాడమీలు దోహదపడతాయి. పొరుగు దేశాలకు చెందిన   క్యాడెట్లకు కూడా వీటిలో శిక్షణ ఇస్తారు. 

కోవిడ్-19 రెండవ దశ రూపంలో ఎదురైన సమస్యలను అధిగమించి ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ల ఏర్పాటుకు సంబంధించిన బిడ్డింగ్ ప్రక్రియను  భారత విమానాశ్రయాల సంస్థ( ఏఏఐ) పూర్తి చేసి అయిదు విమానాశ్రయాలను ఎంపిక చేసింది. ఈ ఐదు విమానాశ్రయాలలో  వాతావరణ, సివిల్ / మిలిటరీ ఎయిర్ ట్రాఫిక్ పరంగా అంతరాయాలు తక్కువగా ఉంటాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ట్రైనింగ్ అకాడమీల ఏర్పాటుకు వీటిని ఎంపిక చేశారు. ఆత్మ నిర్భర్ భారత్ సాధనలో భాగంగా విమానాలను నడపడంలో శిక్షణ ఇచ్చే రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధించడానికి ఈ నిర్ణయం తోడ్పడుతుంది. 

ట్రైనింగ్ అకాడమీల ఏర్పాటుకు భారత విమానాశ్రయాల సంస్థ( ఏఏఐ) 2020 నవంబర్ లో దరఖాస్తులను ఆహ్వానించింది. వీటిలో ఎంపిక చేసిన ఆసియా-పసిఫిక్, జెట్‌సర్వ్, రెడ్‌బర్డ్, సామ్‌వర్ధనే మరియు స్కైనెక్స్ లకు అనుమతులు మంజూరు చేస్తూ 2021 మేలో ఉత్తర్వులు వెలువడ్డాయి. విమానయాన భద్రతా అంశాలు, నియంత్రణ వ్యవస్థలు,  విమానంలో పైలట్లకు శిక్షణ ఇచ్చే రంగంలో అనుభవం, పరికరాల లభ్యత, శిక్షకులు మొదలైన అంశాల ఆధారంగా ఈ సంస్థలను ఎంపిక చేయడం జరిగింది. శిక్షణా రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో వార్షిక అద్దెను 15 లక్షలకు తగ్గించడమే కాకుండా విమానాశ్రయాలకు చెలించవలసి ఉన్న రాయల్టీని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. 

***


(Release ID: 1723994) Visitor Counter : 206