మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కరోనా కారణంగా తల్లిందండ్రులిద్దరినీ లేదా ఒకరిని కోల్పోయిన చిన్నారుల వివరాలను ఆన్‌లైన్‌ ట్రాకింగ్‌ పోర్టల్‌ "బాల్‌ స్వరాజ్‌ (కొవిడ్‌ సంరక్షణ)"లో అప్‌లోడ్‌ చేయాలని రాష్ట్రాలు, యూటీలను కోరిన ఎన్‌సీపీసీఆర్‌

Posted On: 29 MAY 2021 3:49PM by PIB Hyderabad

దేశంలో కొవిడ్‌ ప్రభావంతో చిన్నారులకు సంబంధించిన సమస్యలు పెరుగుతున్న దృష్ట్యా; సంరక్షణ, భద్రత అవసరమైన పిల్లల కోసం "బాల్‌ స్వరాజ్‌ (కొవిడ్‌ సంరక్షణ లింక్‌)" పేరిట ఒక ఆన్‌లైన్ ట్రాకింగ్ పోర్టల్‌ను జాతీయ బాలల హక్కుల సంరక్షణ సంఘం (ఎన్‌సీపీసీఆర్‌) తీసుకొచ్చింది. బాలల న్యాయ చట్టం-2015లోని సెక్షన్‌ 109 ప్రకారం సంక్రమించిన బాలల హక్కుల పర్యవేక్షణ యంత్రాంగ విధుల్లో భాగంగా ఈ పోర్టల్‌కు రూపకల్పన చేసింది. సంరక్షణ, భద్రత అవసరమైన పిల్లల ఆన్‌లైన్ ట్రాకింగ్, డిజిటల్ రియల్ టైమ్ పర్యవేక్షణ కోసం ఈ పోర్టల్‌ను కమిషన్ తీసుకొచ్చింది. కరోనా కారణంగా తల్లిదండ్రులిద్దరినీ లేదా ఒకరిని కోల్పోయిన చిన్నారుల వివరాలను సేకరించడానికి కూడా ఈ పోర్టల్‌ పరిధిని విస్తరించి, "కొవిడ్‌ సంరక్షణ" పేరిట ఒక లింకును ఇచ్చింది. సంబంధిత అధికారులు లేదా విభాగాలు ఆ తరహా చిన్నారుల వివరాలను ఈ లింకు ద్వారా పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయవచ్చు.

    కుటుంబ మద్దతు లేని, జీవనాధారానికి ఎలాంటి స్పష్టమైన మార్గాలు లేని చిన్నారులను సంరక్షణ, భద్రత అవసరమైనవారిగా బాలల న్యాయ చట్టం-2015లోని సెక్షన్‌ 2(‍14)‌ ప్రకారం గుర్తించాలి. అలాంటి చిన్నారుల శ్రేయస్సు, భద్రత కోసం చట్టంలో సూచించిన అన్ని విధానాలను పాటించాలి.

    కొవిడ్‌ ప్రభావిత చిన్నారులను బాలల సంరక్షణ సంఘం (సీడబ్ల్యూసీ) ముందు హాజరుపరచడం దగ్గర నుంచి, వారి తల్లిదండ్రులు/ సంరక్షకులు/ బంధువులకు అప్పగించడం, తర్వాత కూడా వారిని పర్యవేక్షించడం "బాల్ స్వరాజ్-కొవిడ్ కేర్" పోర్టల్ లక్ష్యం. జిల్లా, రాష్ట్ర అధికారులు పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసిన ప్రతి చిన్నారి సమాచారం ప్రకారం, అతడు/ఆమె తన అర్హతల ప్రకారం ఆర్థిక, ఇతర ప్రయోజనాలను
పొందగలరా, లేరా అనే అంశాన్ని కమిషన్ నిర్ధరించుకుంటుంది. సీడబ్ల్యూసీ ఎదుట బాలుడు/బాలికను ప్రవేశపెట్టారా, వారి కోసం ఆదేశాలు జారీ అవుతున్నాయా, లేదా అన్నది కూడా తెలుసుకుంటుంది. బాలల పథకాల అమలుకు రాష్ట్రాలకు మరిన్ని నిధులు అవసరమైతే కమిషన్‌ ఆ విషయాన్ని కూడా గుర్తిస్తుంది.

    ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు ఉన్న అనాథ చిన్నారుల వివరాలను కొవిడ్‌ కేర్‌ లింక్‌ ద్వారా బాల్‌ స్వరాజ్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా అధికారులందరినీ ఈ నెల 28వ తేదీన అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మహిళా, శిశు అభివృద్ధి/ సామాజిక సంక్షేమ శాఖల కార్యదర్శులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శలకు లేఖల ద్వారా ఎన్‌సీపీసీఆర్‌ తెలియజేసింది. ప్రతి యూజర్/ బాలల జిల్లా సంరక్షణాధికారి, రాష్ట్ర ప్రభుత్వాల యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌లను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అందించింది.

    ఎన్‌సీపీసీఆర్‌ ఒక చట్టబద్ధ సంస్థ. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది.
 

*****


(Release ID: 1722822) Visitor Counter : 295