ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 రోగులకు ఆక్సిజన్ థెరపీ

Posted On: 29 MAY 2021 11:30AM by PIB Hyderabad

    కోవిడ్-19 వైరస్ సెకండ్ వేవ్ నేపథ్యంలో కరోనా రోగులకు ఆక్సిజన్ అందించాల్సిన ఆవశ్యత బాగా పెరిగింది. కోవిడ్ కేసుల్లో ఆక్సిజన్ అవసరాన్ని గురించి బెంగళూరులోని నేషనల్ ట్యూబెర్క్యులోసిస్ ఇన్.స్టిట్యూట్ ముఖ్య వైద్యాధికారి డాక్టర్ రవిచంద్ర వివరించారు.: “80 శాతం కోవిడ్ కేసులు స్వల్పలక్షణాలతో మాత్రమే కనిపిస్తున్నాయి. కేవలం 15శాతం కోవిడ్ రోగులకు ఒక మోస్తరు స్థాయిలో లక్షణాలు ఉంటున్నాయి. దీనితో వారి ఆక్సిజన్ స్థాయి 94శాతం కంటే దిగువకు పడిపోయే అవకాశం ఉంది. మిగతా 5శాతం రోగుల్లో మాత్రమే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. శ్వాసతీసుకునే పర్యాయాలు నిమిషానికి 30కంటే ఎక్కువగా ఉండవచ్చు. అలాంటి వారిలో ఆక్సిజన్ స్థాయ 90శాతం కంటే దిగువకు పడిపోతుంది.” అని ఆయన అన్నారు.

  ఈ నేపథ్యంలో శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పునరుద్ధరించుకునేందుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. కోవిడ్ కారణంగా అదనంగా ఆక్సిజన్ అవసరమయ్యే అతికొద్ది శాతం మందికి ఈ అంశాలు ఉపయుక్తంగా ఉండవచ్చు.

 ఆక్సిజన్ స్థాయి తగ్గినపుడు, అలాంటి సూచనలపట్ల అప్రమత్తంగా ఉండాలి.

  శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అయోమయం, కాస్త ఎత్తు ప్రాంతానికి అడుగేయడానికి కష్టంగా అనిపించడం, పెదవులు నీలిరంగుకు మారడం వంటివి ఆక్సిజన్ స్థాయి పతనానికి హెచ్చరికగా కనిపించే సూచనలు. పెద్దల్లో అయితే ఛాతీ నొప్పి వదలకుండా వస్తూ ఉంటుంది. చిన్నపిల్లల్లో  పీల్చినపుడు ముక్కులో మంటగా ఉండటం, గురగురమని శబ్ధం రావడం, ఏదైనా తాగడానికి తినడానికి బాగా ఇబ్బంది పడటం జరుగుతూ ఉంటుంది.

 

మనం ఎందుకు జాగ్రత్తపడాలి?

  రక్తంలో ఆక్సిజన్ శాతం తక్కువకావడం లేదా హైపోక్సీమియా అనే లక్షణం కనిపించినపుడు వెంటనే తగిన జాగ్రత్తతో, చికిత్స అందించకపోతే, చివరకు ప్రాణాపాయం తప్పకపోవచ్చని  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఒ.) పేర్కొంటోంది. కోవిడ్-19 వైరస్ సోకడమో, మరే ఇతర అస్వస్థతతోనో ఆక్సిజన్ స్థాయిలు పడిపోయినపుడు శరీరంలోని కణాలకు,. సాధారణ కార్యకలాపాలకు అవసరమైన ఆక్సిజన్ లభించదు. ఎక్కువ సేపు తగిన చికిత్స అందక, ఆక్సిజన్ స్థాయి అలాగే తక్కువ స్థాయిలో కొనసాగిన పక్షంలో శరీరంలోని అవయవాలు కూడా సరిగా పనిచేయవు. ఇలాంటి పరిస్థితి తీవ్రతరమైతే చివరకు మరణానికి దారి తీసే అవకాశం ఉంది.

 

ఆక్సిజ్ స్థాయి ఎలా ఉందో తెలుసుకునేదెలా?

ఆక్సిజన్ స్థాయిని తెలుసుకునేందుకు రెండు సులభమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

  పల్స్ ఆక్సీమీటరు: పల్స్ ఆక్సీమీటరును ఉపయోగించి మీరు రోగి శరీరంలోని ఆక్సిజన్ స్థాయిని తెలుసుకోవచ్చు. రోగి చేతి వేలు, కాలి వేలు లేదా చెవి తమ్మెను ఆక్సీ మీటరులో ఉంచి మీటరు రీడింగ్ ద్వారా ఆక్సిజన్ స్థాయిని తెలుసుకోవచ్చు. ఎలాంటి నొప్పీ లేకుండా కేవలం రెండు నిమిషాల్లోగానే ఈ పరీక్ష పూర్తి చేసుకోవచ్చు. 

  రోగి రక్తంలోని ఆక్సిజన్ స్థాయిని, లేదా ఆక్సిజన్ శాతాన్ని పల్స్ ఆక్సీ మీటరు లెక్కిస్తుంది. రక్తంలో ఆక్సిజన్ స్థాయి 93శాతం లేదా అంతకంటే తక్కువగా ఉంటే, అలాంటి రోగికి సత్వరం వైద్యచికిత్స అందించాల్సి ఉంటుందని, ఆక్సిజన్ స్థాయి 90శాతం కంటే దిగువకు పడిపోతే రోగిని అత్యవసరంగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాల్సి ఉంటుందని ఆక్సీమీటరుపై  ప్రపంచ ఆరోగ్య సంస్థ వెలువరించిన శిక్షణా నిబంధనలు తెలియస్తున్నాయి.

  శ్వాసక్రియ వేగం రేటు: ఒక వ్యక్తి నిమిషానికి ఎన్ని సార్లు శ్వాస తీసుకుంటున్నారన్న అంశాన్ని బట్టి శ్వాస క్రియ రేటును నిర్ధారిస్తారు. ఈ శ్వాసక్రియ రేటును ఎలాంటి పరికరం లేకుండానే లెక్కించే పద్ధతిని గురించి బెంగళూరులోని నేషనల్ ట్యూబెర్క్యులోసిస్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన డాక్టర్ సోమశేఖర్ వివరించారు. మీరు మీ అరచేతిని ఛాతీపై ఆనించి, ఒక నిమిషం వ్యవధిలో మీ శ్వాస తీరును లెక్కించండి. శ్వాసక్రియ రేటు నిమిషానికి 24సార్లకంటే తక్కువ ఉంటే మీ ఆక్సిజన్ స్థాయి సురక్షితంగా ఉన్నట్టేనని, ఎవరైనా 30కంటే ఎక్కువ సార్లు శ్వాస తీసుకుంటూ ఉంటే ఆలాంటి వారికి శరీరంలో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉన్నట్టేనని ఆయన వివరించారు.

ఆక్సిజన్ స్థాయి పడిపోయిన పరిస్థితి ఎదురైతే ఏం చేయాలి?

ప్రోనింగ్..

  ఇంటివద్దనే చికిత్స అందుకుంటున్న రోగులు తమకు ఆక్సిజన్ స్థాయి తగ్గినట్టుగా అనిపిస్తే, ఆలాంటి సూచనలు కనిపిస్తే వెంటనే పొట్టను కిందకు ఆనించి బోర్లా పడుకోవాలి. ప్రోనింగ్ అనే ఈ ప్రక్రియతో శ్వాసక్రియ తీరు మెరుగుపడి, ఆక్సిజన్ స్థాయి కూడా పెరుగుతుంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు కావాలంటే, “స్వీయ రక్షణకోసంప్రోనింగ్” పేరిట కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ వెలువరించిన సూచనలను అనుసరించవచ్చు. వాటిని ఈ దిగువన ఇస్తున్నాం. 

.

    పెద్దలకు అందించాల్సిన కోవిడ్-19 చికిత్సకు సంబంధించి, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2021, మే నెల 24న వెలువరించిన నిబంధనల ప్రకారం అదనంగా ఆక్సిజన్ థెరపీ చికిత్స అవసరమైన వారంతా ప్రోనింగ్ పద్ధతిలో పొట్టను దిండుకు ఆనించి బోర్లా పడుకునే పద్ధతిని ప్రోత్సహించాల్సి ఉంటుంది.

 

  ఇక సొంతంగా శ్వాస తీసుకోలేని స్థితిలో ఉన్న వారి విషయంలో కూడా ప్రోనింగ్ ప్రక్రియకు చాలా ప్రాధాన్యత ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన సూచనలల్లో తెలియజేసింది. 

• ఎవరైనా కోవిడ్-19 రోగి, ఆసుపత్రిలో చేర్చాల్సినంత తీవ్ర స్థాయిలో శ్వాసపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్న పక్షంలో అలాంటి వారికి కూడా ముందస్తుగా  రొటేషన్ పద్ధతిలో వారంతటవారే ప్రోనింగ్ చేసుకునే అంశాన్ని సూచించవచ్చు.

• ప్రోనింగ్ లో రొటేషన్ సందర్భంగా ఆక్సిజన్ అందే ప్రక్రియకు  మధ్యలో ఎలాంటి ఆటంకం కాకుండా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

• నిబంధనల ప్రకారం 30నుంచి 120 నిమిషాలసేపు ప్రోనింగ్ చేయవచ్చు. కుడివైపు తిరిగి పొట్టపై ప్రోనింగ్ 30నుంచి 120 నిమిషాల సేపు, అలాగే ఎడమవైపు తిరిగి పొట్టపై ప్రోనింగ్ 30నుంచి 120 నిమిషాలసేపు చేయవచ్చు.  నేరుగా కూర్చున్న స్థితిలో నుంచి కూడా ప్రోనింగ్ చేయవచ్చు.

 

ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను వినియోగించడం

  ఆరోగ్య రక్షణ సదుపాయాన్ని అందించేవారి సమక్షంలో మాత్రమే రోగులకు ఆక్సిజన్ థెరపీ చికిత్సను అందించాలని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే,..అత్యవసర పరిస్థితిలో మాత్రం ఆక్సిజన్ థెరపీని ఆశ్రయించక తప్పదని అంటున్నారు. వైద్య చికిత్సాపరంగా దృష్టిని కేంద్రీకరించాల్సినపుడు, రోగిని తరలించేందుకు అంబులెన్స్ కోసం వేచి చూస్తున్నపుడు ఇలా చేయాల్సి ఉంటుందని వారంటున్నారు.

  పుణెలోని బి.జె. వైద్య కళాశాల అనస్థీషియా విభాగం అధిపతి అయిన ప్రొఫెసర్ సన్యోగిత నాయక్ చెబుతున్న దాని ప్రకారం: “కోవిడ్-19 వైరస్ సోకిన ఒక మోస్తరు లక్షణాలున్న రోగుల విషయంలో మాత్రమే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వినియోగించవచ్చు. రోగి ఆక్సిజన్ స్థాయి పడిపోయినపుడు, రోగికి నిమిషానికి ఐదు లీటర్ల చొప్పున ఆక్సిజన్ అవసరమైనపుడు మాత్రమే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వాడవచ్చు.”

  కోవిడ్ సోకి అస్వస్థతనుంచి కోలుకున్నా, మళ్లీ శ్వాసపరంగా సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే వారికి కూడా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు బాగా ప్రయోజనకరంగా ఉంటాయని డాక్టర్ సన్యోగితా నాయక్ చెప్పారు. ఆలంటపుడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అవసరమవుతాయన్నారు. 

  పైన వివరించిన రెండు సందర్భాల్లోనూ, ఆక్సిజన్ థెరపీ లక్ష్యం 94శాతం ఆక్సిజన్ స్థాయిని సాధించడమే. ; రోగి ఆక్సిజన్ స్థాయి 93-94 శాతాల మధ్య ఉన్నాసరే ఆక్సిజన్ థెరపీని నిలిపివేయవచ్చు. మరీ అతిగా ఆక్సిజన్ అందించడం వల్ల అది కార్బన్ డయాక్సయిడ్ స్థాయి పెరగడానికి దారి తీస్తుంది. దీనితో చివరికి ఆరోగ్యపరంగా మరో సంక్లిష్టపరిస్థితి ఎదురవుతుంది.

 

****



(Release ID: 1722684) Visitor Counter : 427