సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
బుద్ధ పూర్ణిమనాడు వర్చువల్ ప్రపంచ వైశాఖీ ఉత్సవాలలో ప్రధానమంత్రి కీలకోపన్యాసం
వర్చువల్ ప్రార్థన కార్యక్రమంలో ప్రపంచవ్యాప్త
బౌద్ధ సంఘాల అధిపతుల భాగస్వామ్యం
మన దేశాన్ని... ప్రపంచాన్ని కోవిడ్ పట్టిపీడిస్తున్న నేపథ్యంలో
బుద్ధ భగవానుని సందేశం సందర్భోచితం: శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్
పవిత్ర వైశాఖీ బుద్ధపూర్ణిమ నాడు 8 అంచెల మార్గాచరణ ద్వారా
దైనందిన జీవితాలను గడుపుదామని ప్రతినబూనుదాం: శ్రీ కిరణ్ రిజిజు
Posted On:
26 MAY 2021 5:01PM by PIB Hyderabad
బుద్ధ పూర్ణిమ నేపథ్యంలో ‘‘ప్రపంచ వైశాఖీ వేడుకల’’ను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా కీలకోపన్యాసం చేశారు. అత్యంత పూజనీయులైన ‘మహాసంఘ’ సభ్యులతోపాటు నేపాల్, శ్రీలంక దేశాల ప్రధాన మంత్రులు, కేంద్ర మంత్రిమండలి సభ్యులు శ్రీ ప్రహ్లాద్ సింగ్, శ్రీ కిరణ్ రెజిజు, అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య ప్రధాన కార్యదర్శి-గౌరవనీయ డాక్టర్ ధమ్మపియా తదితరులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- ఇది బుద్ధభగవానుని జీవితం, ఆయన ప్రబోధించిన ఉన్నతాదర్శాలు, ప్రపంచోద్ధరణ కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటూ వేడుకలు నిర్వహించే రోజని పేర్కొన్నారు. కోవిడ్-19పై మానవాళి పోరులో ముందువరుసన నిలిచిన యోధులకు నిరుటి వైశాఖీ పూర్ణిమ కార్యక్రమాలను తాను అంకితం చేసినట్లు ఆయన గుర్తుచేశారు. నేడు ఏడాది గడచిన తర్వాత కూడా కోవిడ్-19 మహమ్మారి మనను విడిచిపెట్టలేదని, భారత్ సహా ప్రపంచంలోని అనేక దేశాలను రెండోదశ పట్టి పీడిస్తున్నదని పేర్కొన్నారు. జీవితకాలంలో ఒకసారి దాపురించే ఇలాంటి మహమ్మారి అనేకమంది ముంగిళ్లను కష్టాలు-కన్నీళ్లతో విషాదంలో ముంచెత్తిందని, ప్రతి దేశంలోనూ లెక్కకు మిక్కిలిగా ప్రజలపై ఈ దుష్ప్రభావం పడిందని ఆయన వ్యాఖ్యానించారు. మహమ్మారి సృష్టించిన ఆర్థిక దుష్ప్రభావం భారీస్థాయిలో ఉన్నందున కోవిడ్-19 తర్వాత భూగోళం మునుపటిలా ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. అయితే, గడచిన ఏడాది కాలంలో గమనించదగిన అనేక ఆశావహ అంశాలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆ మేరకు మహమ్మారిపై అవగాహన మెరుగుపడి, దానిపై పోరు వ్యూహం బలోపేతమైందని చెప్పారు. దీంతోపాటు మన చేతిలోగల ప్రధాన ఆయుధమైన టీకాలు నేడు ప్రజలకు ప్రాణరక్షణతోపాటు మహమ్మారిని తరిమికొట్టడంలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ఏడాది వ్యవధిలో కోవిడ్-19కు టీకాల తయారీలో మన శాస్త్రవేత్తలు చేసిన కృషి ప్రశంసనీయమని, మానవాళి దీక్షాదక్షతల శక్తికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.
బుద్ధ భగవానుని జీవితం మనకు ‘శాంతి-సామరస్యం-సహజీవన’ సూత్రాలను ప్రధానంగా బోధిస్తున్నదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. కానీ, నేడు ‘ద్వేషం, ఉగ్రవాదం, విచక్షణరహిత హింస’పై ఆధారపడిన శక్తులు నేటికీ మనుగడ సాగిస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. అటువంటి శక్తులకు ఉదార ప్రజాస్వామ్య సూత్రాలపై విశ్వాసం ఉండదని స్పష్టం చేశారు. కాబట్టి మానవత్వాన్ని విశ్వసించేవారంతా ‘ఉగ్రవాదం... తీవ్రవాద భావజాలం‘పై యుద్ధానికి ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు బుద్ధదేవుని బోధనలు, సామాజిక న్యాయానికి ఇస్తున్న ప్రాధాన్యం అంతర్జాతీయ శక్తిని సంఘటితం చేయగల ఉపకరణాలు కాగలవన్నారు.
ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వైశాఖీ-2565వ బుద్ధపూర్ణిమ దినోత్సవాన్ని ఉద్దేశించి కేంద్ర సాంస్కృతిక-పర్యాటక శాఖ (ఇన్చార్జి) సహాయమంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ కూడా ప్రసంగిస్తూ- ఈ పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. బుద్ధపూర్ణిమ వేడుకలను ఏటా జాతీయ స్థాయిలో నిర్వహించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2015లో నిర్ణయం తీసుకోవడంపై ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అటుపైన ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారని గుర్తుచేశారు. తదనుగుణంగా అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య (ఐబీసీ), కేంద్ర సాంస్కృతిక-పర్యాటక శాఖ ప్రతి సంవత్సరం ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాయని శ్రీ పటేల్ పేర్కొన్నారు. అంతేకాకుండా బుద్ధ భగవానుని బోధనలు, సిద్ధాంత వ్యాప్తికి సంయుక్తంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. మన దేశాన్ని... ప్రపంచాన్ని కోవిడ్-19 మహమ్మారి పట్టిపీడిస్తున్న నేపథ్యంలో బుద్ధ భగవానుని బోధనలు నేటి పరిస్థితులకు సందర్భోచితాలని మంత్రి పేర్కొన్నారు.
ఈ ప్రసంగంలో భాగంగా బుద్ధదేవుని జీవితానికి సంబంధించిన రెండు చిన్న కథలను మంత్రి ఉటంకించారు. ఈ రెండింటి నుంచి మనం ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవాల్సి ఉందన్నారు. మానసిక ప్రశాంతత కొనసాగింపు, సంక్షోభ సమయాల్లో ప్రతికూలతలను ఎదుర్కోవడంలో బుద్ధ భగవానుని జీవితానికి సంబంధించిన ఈ రెండు కథలు... మనకు స్ఫూర్తినిస్తాయని చెప్పారు. ప్రస్తుత పరీక్షా సమయంలో బుద్ధదేవుని సందేశం సందర్భోచితమని శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ పునరుద్ఘాటించారు. ఆ మేరకు ఎంత పెద్ద సవాళ్లనైనా అధిగమించడంలో మానసిక ప్రశాంతత, ఓర్పు మనకెంతో తోడ్పడతాయని చెప్పారు. బుద్ధుని ఆలోచనలను సాదృశం చేసుకుని, మన జీవితాలకు అన్వయించుకునేందుకు ఇది అనువైన రోజని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయమంత్రి/యువజన-క్రీడా-ఆయుష్ శాఖల (ఇన్చార్జి) మంత్రి శ్రీ కిరణ్ రిజిజు ఈ వర్చువల్ వైశాఖీ-బుద్ధపూర్ణిమ వేడుకలలో ప్రసంగిస్తూ- బుద్ధ భగవానుని ‘‘జన్మదినం, జ్ఞానోదయం, మహా పరినిర్వాణం’’ మూడింటినీ ఒకేసారి నిర్వహించే విశిష్ట త్రిగుణీకృత పర్వదినం ప్రపంచ చరిత్రలో ఇదేనని పేర్కొన్నారు. ‘‘భారత్, నేపాల్ సహా ప్రపంచంలోని ఇతర దేశాల్లో కోవిడ్-19 రెండో దశలో మరణించిన వారికోసం ప్రార్థించడంతోపాటు ఈ మహమ్మారి నుంచి విముక్తి కోరుతూ ఈ ఏడాది వైశాఖీ-బుద్ధపూర్ణిమ వేడుకలను వారికి అంకితం చేస్తున్నాం’’ అని మంత్రి తెలిపారు. అలాగే ‘‘మహమ్మారిపై దేశం చేస్తున్న యుద్ధంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న కరోనా యోధులకు సామూహికంగా శిరసాభివందనం చేద్దామని మిమ్మల్ని కోరుతున్నాను’’ అని శ్రీ రిజిజు అన్నారు. ప్రస్తుత కోవిడ్ మహమ్మారి రెండోదశలో భారత్, నేపాల్ దేశాలకు చేయూతనిస్తున్న వివిధ దేశాల్లో పనిచేసే ‘ఐబీసీ’ సభ్యులు, భాగస్వామ్య సంస్థలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
మహమ్మారి అనూహ్య సంక్షోభంతో ప్రపంచం స్తంభించిన వేళ మనమంతా వ్యష్టిగా, సమష్టిగా వ్యవహరించాల్సిన తీరుగురించి ఆలోచించే అవకాశాన్ని ఈ పవిత్ర దినం మనకు కల్పించిందని ఆయన చెప్పారు. ప్రత్యేకించి పరస్పరాధారిత స్వభావంగల ప్రస్తుత సందర్భంలో భావోద్వేగ జీవుల సంక్షేమంతోపాటు సహానుభూతి, ప్రకృతి-భూమాతపై గౌరవంతో కూడిన చైతన్యం మనలో వెల్లివిరియాలన్నారు. ఈ పవిత్ర వైశాఖీ-బుద్ధ పూర్ణిమ పర్వదినంనాడు ఎనిమిదంచెల మార్గాచరణను సంపూర్ణార్థంలో అనుసరిస్తూ దైనందిన జీవితాలను గడుపుదామని మనమంతా ప్రతినబూనుదామని ఆయన పిలుపునిచ్చారు.
బౌద్ధ తత్త్వశాస్త్రంలో విశేష పాండిత్యం సముపార్జించిన, మానవాళికి అవిరళ సేవలందించిన, మతాంతర అవగాహన, శాంతి-సామరస్యాల కోసం కృషిచేసిన ‘ధమ్మ గురువుల’కు 2019, 2020, 2021 సంవత్సరాలకుగాను ‘‘వైశాఖీ సమ్మాన్ ప్రశస్తిపాత్ర’’ పురస్కారాన్ని శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ప్రదానం చేశారు. ఈ పురస్కారాన్ని 2015లో ఏర్పాటు చేయగా, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ, అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య దీన్ని ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తున్నాయి. బౌద్ధ అధ్యయనాలు, పరిశోధన, రచనలు, బుద్ధుని బోధనల వ్యాప్తి, బౌద్ధ సంస్కృతీ వారసత్వ పరిరక్షణ తదితరాల్లో విశేష కృషిచేసిన జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులకు ఈ పురస్కార ప్రదానం చేస్తారు.
పురస్కార గ్రహీతల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ ఉత్సవాల్లో భాగంగా డిజిటలీకృత అరుదైన మంగోలియన్ కంగ్యూర్ (త్రి-పిటకాలు) రచనల 50 సంపూటాలను భారత ప్రజల తరఫున వాస్తవిక సాదృశ పద్థతిలో మంగోలియా ప్రజలకు సంకేతప్రాయంగా బహూకరించారు. ఇక ఈ ఏడాది బుద్ధపూర్ణిమను కోవిడ్ -19 మహమ్మారి నుంచి ప్రపంచానికి శాంతి-ఊరట కల్పన కోసం అంకితమిచ్చారు. ప్రపంచంలోని బౌద్ధ సంస్థల కూటమి అయిన అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య (ఐబీసీ) సహకారంతో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఈ వేడుకలను నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగాగల బౌద్ధ సంఘాల అత్యున్నత అధిపతులంతా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి ప్రభావం కారణంగా బుద్ధపూర్ణిమ వేడుకలను వాస్తవిక సాదృశ మార్గంలో నిర్వహించారు. కోవిడ్-19 మహమ్మారి నుంచి ప్రపంచానికి శాంతి-ఊరట కలగాలని ఆకాంక్షిస్తూ ఈ ఏడాది బుద్ధపూర్ణిమ వేడుకలను అంకితం చేశారు.
ఈ వేడుకలను ఇవాళ వివిధ దేశాల్లోని బౌద్ధ ప్రాముఖ్యంగల ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ మేరకు బుద్ధగయ-భారత్, లుంబిని-నేపాల్, క్యాండీ-శ్రీలంక సహా భూటాన్, కంబోడియా, ఇండోనేషియా, మలేషియా, మంగోలియా, రష్యా, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ తదితర దేశాల్లో వేడుకలు, ప్రార్థనలను ఏకకాలంలో నిర్వహించారు. ప్రపంచమంతా నేడు సంక్లిష్ట దశలో ఉన్న తరుణంలో భారతదేశానికి సంఘీభావం తెలుపుతూ ఇలా ఒకే సమయంలో కార్యక్రమాలు చేపట్టారు.
వైశాఖీ బుద్ధపూర్ణిమను తథాగత గౌతమబుద్ధుని ‘‘జయంతి, జ్ఞానోదయం, మహాపరినిర్వాణం’’తో కూడిన త్రిగుణ విశిష్ట దినంగా పరిగణిస్తారు.
***
(Release ID: 1722049)
Visitor Counter : 202