వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

2020-21లో రికార్డు స్థాయిలో 81.74 బిలియన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించిన భారత్‌, గతేడాది కంటే 10 శాతం అధికం

Posted On: 24 MAY 2021 3:56PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విధానాల్లో సంస్కరణలు, పెట్టుబడులకు సహకారం, సులభతర వ్యాపారం వంటి అంశాలతో దేశంలోకి ఎఫ్‌డీఐలు పెరిగాయి. భారత్‌ అందుకున్న ఎఫ్‌డీఐల్లో చోటు చేసుకున్న ఈ క్రింది మార్పులు, అంతర్జాతీయ పెట్టుబడిదారుల ప్రాధాన్యత గమ్యస్థానంగా మన దేశం మారిందనడానికి నిదర్శనం:
 
* 2020-21లో రికార్డు స్థాయిలో 81.74 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారత్‌కు తరలివచ్చాయి. 2019-20లో వచ్చిన 74.39 బిలియన్‌ డాలర్ల కంటే ఇది 10శాతం అధికం.

* 2019-20లో ఎఫ్‌డీఐల ఈక్విటీతో (49.98 బిలియన్ డాలర్లు) పోలిస్తే, 2020-21లో (59.64 బిలియన్ డాలర్లు) 19 శాతం పెరిగింది.

* 2020-21లో భారత ఎఫ్‌డీఐల్లో సింగపూర్ 29 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, అమెరికా 23 శాతం, మారిషస్ 9 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

* 2020-21లో వచ్చిన మొత్తం ఎఫ్‌డీఐల్లో కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ రంగం అత్యధికంగా 44 శాతాన్ని దక్కించుకోగా, మౌలిక సదుపాయాల నిర్మాణ కార్యక్రమాలు 13 శాతం, సేవారంగం 8 శాతాన్ని అందుకున్నాయి.

* కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌లో ఎఫ్‌డీఐల విషయానికి వస్తే, గుజరాత్‌ అత్యధికంగా 78 శాతాన్ని, కర్ణాటక 9 శాతాన్ని, దిల్లీ 5 శాతాన్ని పొందాయి.

* ఎఫ్‌డీఐ ఈక్విటీల్లో 37 శాతం దక్కించుకుని గుజరాత్‌ అగ్రస్థానంలో ఉండగా, మహారాష్ట్ర 27 శాతంతో, కర్ణాటక 13 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 

* గుజరాత్‌కు వచ్చిన ఎఫ్‌డీఐ ఈక్విటీలో 94 శాతం కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ రంగానికే దక్కింది. మౌలిక సదుపాయాల నిర్మాణ కార్యక్రమాలు 2 శాతాన్ని అందుకున్నాయి.

* 2019-20తో పోలిస్తే, 2020-21లో మౌలిక సదుపాయాల నిర్మాణ కార్యక్రమాలు, కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌, రబ్బరు వస్తువులు, చిల్లర వ్యాపారం, ఔషధాలు, ఎలక్ట్రికల్‌ ఉపకరణాల్లో ఎఫ్‌డీఐల ఈక్విటీ 100 శాతానికి మించి పెరిగింది.

* ఎఫ్‌డీఐల శాతంలో మార్పును పరిగణనలోకి తీసుకుంటే, తొలి 10 దేశాల్లో సౌదీ అరేబియా అగ్రస్థానంలో ఉంది. 2019-20లో పెట్టిన 89.93 మిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐని, 2020-21లో 2816.08 మిలియన్‌ డాలర్లకు ఆ దేశం పెంచింది. 

* 2019-20 కంటే 2020-21లో ఎఫ్‌డీఐలను అమెరికా 227 శాతం, బ్రిటన్‌ 44 శాతం పెంచాయి.

 

***


(Release ID: 1721328) Visitor Counter : 340