ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కరోనా యుద్ధవీరులకోసం 'చల్లని' పి.పి.ఇ. కిట్లు!


ముంబై విద్యార్థి సృజనాత్మక కృషి ఫలితం

“కోవ్-టెక్ వెంటిలేషన్ వ్యవస్థ అమరికతో కూడిన పి.పి.ఇ. సూట్లు ఎంతో సౌకర్యవంతం, ఫ్యాన్ కింద కూర్చున్నట్టే ఉంటుంది.”

Posted On: 23 MAY 2021 11:00AM by PIB Hyderabad

   అవసరమే ఆవిష్కరణకు దారి తీస్తుంది. అవసరం ఏర్పడినందునే ముంబైకి చెందిన నిహాల్ సింగ్ ఆదర్శ్ అనే విద్యార్థి ఏకంగా ఒక ఆవిష్కర్తగా మారారు. వైద్యురాలైన తన తల్లికి ఏర్పడిన అవసరమే అతని ఆవిష్కరణకు గట్టి స్ఫూర్తిని రగిలించింది. కోవ్-టెక్ పేరిట వ్యక్తిగత రక్షణ సూట్లకు (పి.పి.ఇ.)  సృజనాత్మకమైన రీతిలో వెంటిలేషన్ వ్యవస్థను నిహాల్ రూపొందించారు. ఈ చల్లని పి.పి.ఇ. సూట్ల ధారణతో ఫ్రంట్ లైన్ కోవిడ్ యుద్థవీరులుగా పరిగణించే, ఆరోగ్య రక్షణ కార్యకర్తలకు ఎంతో ఉపశమనం లభించినట్టయింది.

కోవ్-టెక్: పూర్తిగా విభిన్నం,.. ‘చల్లని’ పి.పి.ఇ. అనుభవం

కోవ్-టెక్ పేరిట చల్లని పి.పి.ఇ. కిట్ కు రూపకల్పన చేసిన నిహాల్ సింగ్ ఎంతో మానసిక సంతృప్తితో  పి.ఐ.బి.తో మాట్లాడారు. కె.జె. సోమయ్యా ఇంజినీరింగ్ కాలేజీలో రెండవ సంవత్సరం ఇంజినీరింగ్ చదివే నిహాల్ సింగ్, తన ఆవిష్కరణపై పి.ఐ.బి.తో పలు విషయాలు చెప్పారు. కరోనా యుద్ధవీరులుగా మనం గౌరవించే ఆరోగ్య రక్షణ కార్యకర్తలు,. కోవ్-టెక్ సదుపాయంతో కూడిన పి.పి.ఇ. కిట్.ను ధరించినపుడు వారికి అది అందించే సౌలభ్యాన్ని గురించి వివరించారు.: “కోవ్-టెక్ వెంటిలేషన్ వ్యవస్థ పి.పి.ఇ. సూట్ ను పూర్తి విభిన్నంగా మార్చుతుంది. మీరు పి.పి.ఇ. సూట్ ధరించినా ఎంతో సౌకర్యంగా, సౌలభ్యంగా, ఫ్యాన్ కింద కూర్చుకున్నట్టుగా హాయిగా ఉంటుంది. మామూలుగా అయితే, పి.పి.ఇ. సూట్లో ఉన్నపుడు ఎవరికైనా ఉక్కపోత, చెమటతో కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ; ఎంతో ఇబ్బందిగా ఉండే ఈ పరిస్థితినుంచి గట్టెక్కేందుకు మేం ఈ రూపంలో పరిష్కారం చూపించాం. పి.పి.ఇ. సూట్లో ఉన్నవారికి కూడా క్రమబద్ధంగా గాలి ఆడేలా చేస్తూ ఈ సౌలభ్యం తీసుకువచ్చాం." అని నిహాల్ సింగ్ అన్నారు. పి.పి.ఇ. కిట్ సౌకర్యవంతంగా ఉండేలా ఈ వెంటిలేషన్ వ్యవస్థ నమూనాను రూపొందించామని,. సూట్ వేసుకున్న కేవలం వంద సెకన్లలోనే సూట్ ధరించిన వారికి తాజాగా చల్లని గాలి సోకేలా ఈ వ్యవస్థను అమర్చామని చెప్పారు.

కోవిడ్ చికిత్సలో అమ్మ పడుతున్న ఇబ్బందిని చూడలేకనే...

  పి.పి.ఇ.సూట్లకు ఈ కోవ్-టెక్ వెంటిలేషన్ వ్యవస్థ ఎలా ఊపిరిపోసుకుంది? అంటే,.. 

నిహల్ సింగ్ తల్లి అయిన డాక్టర్ పూనం కౌర్ ఆదర్శ్, పూణెలోని ఆదర్శ్ క్లినిక్.లో కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తూ ఉంటారు. ఆ ఆసుపత్రిని ఆమే సొంతంగా నడుపుతున్నారు. పి.పి.ఇ.సూట్లు ధరించినపుడు ఉక్కపోత, చెమటతో తడిసిపోతూ తానేకాక, తనతోపాటు పనిచేసే వారు కూడా పడే బాధలను ఆమె ఇంటికి రాగానే తన కొడుక్కి వివరించేవారు. ఈ దశలో తన తల్లికి, ఆమెలాంటి ఇతర సిబ్బందికి తాను ఎలాగైనా సహాయపడగలనా.,..అంటూ నిహల్ ఆలోచించారు.

 

ఇదే అతని నూతన ఆవిష్కరణకు నాంది పలికింది. కోవిడ్ సంబంధిత పరికరాలకు రూపకల్పన చేయాలన్న సవాలును ఎదుర్కొనేలా స్ఫూర్తిని రగిలించింది. రీసెర్చ్ ఇన్నొవేషన్ ఇంకుబేషన్ డిజైన్ లాబొరేటరీ నిర్వహించిన పోటీలో పాల్గొనేలా తనను పురికొల్పింది.

 

వాడకానికి అనువైన నమూనా కోసం వెదుకులాట:

తొలి నమూనా దశనుంచి ఉత్పాదన తుదిదశ వరకు...

  ఆ సవాలును స్వీకరించిన నిహాల్ సింగ్ తొలుత ఇందుకు సంబంధించిన ప్రొటోటైప్ నమూనాకు రూపకల్పన చేశారు. పూణెలోని నేషనల్ కెమికల్ లేబరేటరీకి చెందిన డాక్టర్ ఉల్హాస్ ఖారుల్ నుంచి లభించిన మార్గదర్శకత్వంతో నిహాల్ సింగ్ కేవలం 20 రోజుల్లోనే తొలి మోడల్ ను తీసుకురాగలిగారు. డాక్టర్ ఉల్హాస్ ఖారుల్ కూడా ఒక స్టార్టప్ కంపెనీ ద్వారా ముఖ్యమైన పరిశోధన నిర్వహిస్తూ ఉంటారు. కోవిడ్ వైరస్ ను నిరోధించే లక్ష్యంతో గాలిని వడగట్టగలిగే సన్నని పొరపై ఆయన పరిశోధన సాగిస్తూ వస్తున్నారు. కోవ్-టెక్ సాంకేతిక పరిజ్ఞానం అనుసరించడానికి నిహల్ సింగ్ కు సరిగ్గా ఇక్కడే తగిన ఆలోచన స్ఫురించింది. వడగట్టే సామర్థ్యం, వీచే గాలి నాణ్యత వంటి అంశాలపై సమతౌల్యాన్ని సాధించేందుకు ఎలాంటి ఫిల్టర్ ను వినయోగించాలన్న విషయమై నిహాల్ కు ఇక్కడే ఆలోచన తట్టింది. ఇదే తరుణంలో సోమయ్య విద్యా విహార్ విశ్వవిద్యాలయం, రీసెర్చ్ ఇన్నొవేషన్ ఇంకుబేషన్ డిజైన్ లేబరేటరీ (ఆర్.ఐ.ఐ.డి.ఎల్.) నుంచి నిహాల్ కు తగిన మద్దతు లభించింది. కేంద్ర విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖ (డి.ఎస్.టి.) ఆధ్వర్యంలోని నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంటర్.ప్రెన్యూర్ షిప్ డెవలప్మెంట్ బోర్డు కూడా నిహాల్ కు అండగా నిలిచింది.

  దాదాపు ఆరు నెలలపాటు తీవ్రంగా శ్రమించిన అనంతరం తొలి నమూనాను నిహాల్ సాధించగలిగారు. అయితే, అది మెడ పైభాగంలో అమర్చే పరికరం. యు ఆకృతిలోని ఎయిర్ ఇన్లెట్ల ద్వారా గాలిని పీల్చుకునే ఏర్పాటు చేశారు. పైగా దిండులాంటి పరికరాన్ని మెడచుట్టా ధరించాల్సి వచ్చింది.

  ఈ ప్రొటోటైప్ నమూనాను పరీక్షకోసం పూణెకు చెందిన డాక్టర్ వినాయక్ మానెకి నిహాల్ సింగ్ ఇచ్చారు. “ఈ ప్రొటోటైప్ నమూనాను నిష్పాక్షికంగా వ్యవహించే కొందరు డాక్టర్లచేత పరీక్షింపజేయాలని మేం కోరుకున్నాం. అందుకే డాక్టర్ వినాయక్ మానె దగ్గరకు వెళ్లాం. “గాలిని అందించే దిండులాంటి పరికరాన్ని మెడచుట్టూ ధరించడం డాక్టర్లకు, ఆరోగ్యరక్షణ కార్యకర్తలకు కొంత ఆసౌకర్యంగానే ఉంటుందని, సదరు పరికరం నిర్విరామంగా చేసే శబ్ధం, కంపనాలు కూడా వారికి ఇబ్బంది కలిగించవచ్చని ఆయన చెప్పారు. అందుకే ఆ ప్రొటోటైప్ నమూనాను వదిలేసి మరో నమూనా కోసం పనిచేయడం ప్రారంభించాం.” అని నిహాల్ సింగ్ పి.ఐ.బి.కి తెలిపారు. ఆ తర్వాత కొత్త, కొత్త నమూనాల రూపకల్పనకోసం తాము ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని, డాక్టర్లు, ఆరోగ్యరక్షణ కార్యకర్తల పనికి ఏ మాత్రం ఆటంకం కలిగించని నమూనా కోసం పనిచేస్తూనే వచ్చామని నిహాల్ అన్నారు.

  పరిపూర్ణత్వం కోసం ఆశిస్తూ ముందుకు సాగడం వల్ల తాము దాదాపు 20వరకూ ప్రొటోటైప్ నమూనాలను, 11 ఎర్గొనమిక్ ప్రొటోటైప్ నమూనాలను తయారు చేసిన తర్వాతనే చివరి ఉత్పాదన ఆకృతిని సాధించగలిగామని నిహాల్ అన్నారు. ఇందుకోసం నిహాల్ కు పుణెలోని ఆర్.ఐ.ఐ.డి.ఎల్. కు చెందిన చీఫ్ ఇన్నొవేష్ క్యాటలిస్ట్ గౌరంగ్ షెట్టినుంచి మద్దతు లభించింది. దీనితో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రొటోటైప్ నమూనాలను నిహాల్ సునాయాసంగా రూపొందించడానికి అవకాశం ఏర్పడింది.

 

చివరి ప్రొటోటైప్ నమూనా: బెల్టులాగా సాధారణమైన ఆకృతి.

  ఖరారైన తుది నమూనా ప్రకారం తయారైన ఉత్పాదనను, నడుం చుట్టూ ఓ బెల్టులాగా  ధరించవచ్చు. మామూలు పి.పి.ఇ. కిట్లతో కూడా దీన్ని ధరించవచ్చు. ఈ నమూనాతో రెండు ప్రయోజనాలు లభిస్తాయి.:

  1. ఆరోగ్య కార్యకర్తలకు అసౌకర్యం తొలగిపోతుంది. వెంటిలేషన్ బాగుంటుంది.
  2. వివిధ రకాల ఫంగస్ ఇన్ఫెక్షన్ల నుంచి వారికి రక్షణ ఉంటుంది.

  వెంటిలేషన్ వ్యవస్థను శరీరానికి దగ్గరగా ధరిస్తారు కాబట్టి రక్షణకోసం ఈ నమూనాలో అత్యున్నత స్థాయి నాణ్యతా ప్రమాణాలతో కూడిన విడిభాగాలను ఉపయోగించామని, భద్రతా పరమైన చర్యలు  జాగ్రత్తగా తీసుకున్నామని నిహాల్ చెప్పారు. “ఈ ఉత్పాదనకు సంబంధించి పేటెంట్ కోసం దరఖాస్తు చేయబోతున్నానని చెప్పగానే మా అమ్మకు చెప్పగానే ఆమె ఎంతగానో సంతోషించారు. జనరల్ పిజీషియన్ అయిన మా అమ్మ తాను విధినిర్వహణకు వెళ్లినపుడల్లా ఈ ఉత్పాదనను క్రమం తప్పకుండా వాడుతున్నారు.” అని చెప్పారు. ఈ పరికరంలో వెంటలేషన్ వ్యవస్థలో లీథియం-అయాన్ బ్యాటరీ అమర్చి ఉంటుంది. ఈ బ్యాటరీ ఆరునుంచి 8గంటలు పనిచేస్తుంది.  

నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలపింగ్ అండ్ హార్నెసింగ్ ఇన్నొవేషన్స్ (నిధి) ప్రోత్సాహం

   మొత్తానికి కోవ్-టెక్ వెంటిలేషన్ వ్యవస్థ వాస్తవ రూపం దాల్చింది. ప్రొటోటైప్ నమూనా రూపకల్పన, ఉత్పాదన తయారీ కోసం నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలప్మెంట్ అండ్ హార్నెసింగ్ ఇన్నొవేషన్స్ (నిధి) సంస్థనుంచి రూ. 10,00,000 నిహాల్ కు అందడంతో ఇది పూర్తిగా సాధ్యమైంది. కేంద్ర విజ్ఞాన, సాంకేతిక పరిజ్ఞాన శాఖ (డి.ఎస్.టి.) ఆధ్వర్యంలో, ఔత్సాహిక సాంకేతిక పరిజ్ఞాన నిపుణులకు తగిన ప్రోత్సాహం అందించే ప్రయాస్ పథకం ద్వారా ఈ మొత్తం అందించారు.  కోవ్-టెక్ వెంటిలేషన్ వ్యవస్థకోసం ఈ ఔత్సాహిక సాంకేతిక నిపుణుడు,.. వాట్ టెక్నొవేషన్స్ అనే  స్టార్టప్ కంపెనీని స్థాపించాడు. ఈ కంపెనీ ద్వారా ఈ  వినూత్న వెంటిలేషన్ వ్యవస్థను రూపొందించారు. ప్రయాస్ పథకం కింద ఆర్థిక సహాయంతోపాటుగా, ఆర్.ఐ.ఐ.డి.ఎల్., కె.జె. సోమయ్య మేనేజిమెంట్ ఇన్.స్టిట్యూట్ సంయుక్త కార్యక్రమం కింద రూ. 5,00,00 కూడా ఈ స్టార్టప్ కంపెనీకి లభించింది.

చాలా పొదుపైన మార్గం, ధరకు తగిన ప్రత్యామ్నాయం

  కోవ్-టెక్ వెంటిలేషన్ వ్యవస్థ రూపకల్పన ప్రాజెక్టులో రెండవ సంవత్సరం డిజైన్ ఇంజినీరింగ్ విద్యార్థి రిత్విక్ మరాఠే, అతని బ్యాచికే చెందిన సాయ్లీ భావసార్ కూడా తమ సహాయ సహకారాలను నిహాల్ సింగ్ కు  అందించారు. అంతేకాక, https://www.watttechnovations.com పేరిట వారి వెబ్.సైట్ రూపకల్పనలో, స్టార్టప్ కంపెనీ డిజిటల్ పరిజ్ఞానాన్ని పొందుపరచడంలో సాయ్లీ భావసార్ కీలకపాత్ర పోషించారు.

 

 

కాగా, ..ప్రస్తుతానికి మాత్రం తన తల్లి ఇబ్బందులను తొలగించే అంశానికి మించి తన ఆశలేవీ  ముందుకు సాగడం లేదని నిహాల్ సింగ్ పి.ఐ.బి.కి తెలిపారు. “వ్యాపారాత్మక దృక్పథంతో సాగాలని మొదట నేను ఏ మాత్రం ఆలోచించలేదు. కేవలం తక్కువ స్థాయిలో మాత్రమే ఉత్పాదనలు తీసుకువచ్చి, వాటిని నాకు వ్యక్తిగతంగా తెలిసిన డాక్టర్లకు అందించాలని తొలుత అనుకున్నాను. అయితే,..  మా ఉత్పాదన కార్యరంగంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి అర్థమైంది. సమస్య చాలా విస్తృతమైనదని తెలుస్తోంది. ఇది మన ఆరోగ్య రక్షణ కార్యకర్తలంతా ప్రతి రోజూ ఎదుర్కొంటున్న సమస్య అని అర్థం చేసుకున్నాను. ఈ ఉత్పాదనను అవసరమైనవారందరికీ లభించేలా వాణిజ్యపరంగా అందుబాటులోకి తేవాలన్న ప్రణాళికపై మేం అప్పుడు మాత్రమే ఆలోచించాం.” అని నిహాల్ సింగ్ అన్నారు.

  నిహాల్ సింగ్ ఆవిష్కరణతో అందుబాటులోకి వచ్చిన కోవ్-టెక్ వెంటిలేషన్ వ్యవస్థ తుది ఉత్పాదనను  పుణెలోని సాయి స్నేహ్ ఆసుపత్రిలోను, లోటస్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలోను వినియోగిస్తున్నారు. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో వీటి ఉత్పాదనను బాగా పెంచాలని కంపెనీ సంకల్పించింది. దీని ధర రూ.5,499.గా నిర్ణయించారు. దీనికి పోటీగా వచ్చిన ప్రత్యామ్నాయ ఉత్పాదన ధర (లక్ష రూపాయలు)తో పోల్చినపుడు ఇది చాలా చవుకగా ఉంది. పైగా ధరను తగ్గించడానికి ప్రయత్నాలు కూడా  జరుగుతున్నాయి.

 

  ఈ ఉత్పాదన తొలి విడత ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. దాదాపు 30-40 యూనిట్లను ప్రయోగాత్మకంగా దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లకు, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలకు అందిస్తారు. వంద యూనిట్లతో కూడిన మలి విడత ఉత్పాదన ప్రస్తుతం తయారీ దశలో ఉంది. యోగిస్తున్న దృశ్యం

***


(Release ID: 1721065) Visitor Counter : 257