ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 కు ప్రజారోగ్య ప్రతిస్పందనతో పాటు టీకాలు వేసే కార్యక్రమ పురోగతిని 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సమీక్షించిన - డాక్టర్ హర్షవర్ధన్


గత 8 రోజులుగా కొత్త క్రియాశీల కేసుల సంఖ్య కంటే ఎక్కువగా నమోదవుతున్న - రికవరీ కేసుల సంఖ్య

రాబోయే నెలల్లో టీకాల లభ్యత గణనీయంగా పెరగనుంది : డాక్టర్ హర్ష్ వర్ధన్

"టీకాలు పెంచడం అవసరం; రెండవ మోతాదుకు ప్రాధాన్యత ఉండాలి ”

కోవిడ్-19 కు వ్యతిరేకంగా పోరాటంలో పరీక్షించడం, గుర్తించడం, చికిత్స చేయడం, టీకాలు వేయడం గురించి నొక్కి చెప్పిన - కేంద్ర ఆరోగ్య మంత్రి

Posted On: 21 MAY 2021 6:40PM by PIB Hyderabad

కోవిడ్ -19 కు ప్రజారోగ్య స్పందన తో పాటు 9 రాష్ట్రాలు /  కేంద్రపాలిత ప్రాంతాల్లో టీకాలు వేసే కార్యక్రమ పురోగతిని కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈ రోజు సమీక్షించారు.  ఛత్తీస్‌ గఢ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన ఆరోగ్య శాఖ మంత్రులు; అండమాన్-నికోబార్ దీవులు, చండీగఢ్, దాద్రా నగర్-హవేలి, డామన్-డియూ, లడఖ్, లక్షద్వీప్ లకు చెందిన లెఫ్టనెంట్ గవర్నర్ / పరిపాలనాధికారులతో కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే సమక్షంలో ఆయన సంభాషించారు. 

ఈ సమావేశంలో -  ఛత్తీస్‌ గఢ్, ఆరోగ్య శాఖ మంత్రి, శ్రీ.టి.ఎస్.సింగ్ డియో;  హిమాచల్ ప్రదేశ్, ఆరోగ్య శాఖ మంత్రి, శ్రీ. రాజీవ్ సైజల్;  గోవా, ఆరోగ్య మంత్రి, శ్రీ విశ్వజిత్ ప్రతాప్ సింగ్ రాణే;  అండమాన్ఎ-నికోబార్ దీవులు, లెఫ్టినెంట్ గవర్నర్, అడ్మిరల్ డి. కె. జోషి;  చండీగఢ్, ప్రధాన కార్యదర్శి, శ్రీ అరుణ్ గుప్తా; తో పాటు ఆయా రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఇతర కీలక అధికారులు దృశ్య మాధ్యమం ద్వారా పాల్గొన్నారు.

దేశంలో కోవిడ్ పరిస్థితి గురించి, డాక్టర్ హర్షవర్ధన్ వివరిస్తూ,  ప్రస్తుతం దేశంలో 30,27,925 క్రియాశీల కేసులు ఉన్నాయని, చెప్పారు.  గత 24 గంటల్లో, 3,57,295 రోగులు కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 87.25 శాతంగా నమోదయ్యింది.  గత 8 రోజులుగా రోజువారీ కోలుకున్న రోగుల సంఖ్య, రోజువారీ కొత్త కోవిడ్ కేసుల సంఖ్య కంటే ఎక్కువగా ఉండడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. గత 5 రోజుల నుండి భారతదేశంలో నమోదౌతున్న కొత్త కేసుల సంఖ్య  3 లక్షల కన్నా తక్కువగా ఉన్నట్లు గమనించడమయ్యింది.  గత 24 గంటల్లో, భారతదేశంలో అత్యధికంగా 20,61,683 పరీక్షలు నిర్వహించగా, దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 3,30,00,000 కు పైగా చేరిందని ఆయన తెలియజేశారు. 

టీకాలు వేసే కార్యక్రమం కీలక ప్రాముఖ్యత గురించి, మంత్రి తెలియజేస్తూ, భారతదేశం తన పౌరులకు మొత్తం 19,18,89,503 టీకా మోతాదులను అందించిందని, పేర్కొన్నారు.  దేశంలో టీకా మోతాదుల లభ్యతను పెంచడానికి టీకాల తయారీకి మద్దతు ఇచ్చే పనిలో ప్రభుత్వం ఉందని ఆయన పేర్కొన్నారు.  రానున్న నెలల్లో దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తిలో విపరీతమైన పెరుగుదల ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  2021 ఆగస్టు నుండి డిసెంబర్ మధ్య, భారతదేశం 216 కోట్ల టీకా మోతాదులను కొనుగోలు చేయగా, ఈ ఏడాది, జూలై నాటికి 51 కోట్ల మోతాదులను కొనుగోలు చేయనున్నట్లు,  ఆయన అన్నారు.  ఈ ఏడాది చివరి నాటికి దేశం కనీసం వయోజన జనాభాకు పూర్తిగా టీకాలు వేసే స్థితిలో ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రి చెప్పారు.

బ్లాక్ ఫంగస్ (ముకోర్మైకోసిస్) సమస్య గురించి, డాక్టర్ హర్షవర్ధన్ వివరిస్తూ, అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలూ దీనిని ఒక అంటువ్యాధిగా తెలియజేయాలనీ, బ్లాక్ ఫంగస్ కేసులనన్నింటినీ సక్రమంగా నివేదించాలని కోరినట్లు తెలియజేశారు.  మధుమేహం నియంత్రణ గురించి, "స్టెరాయిడ్ల" వాడకాన్ని పరిమితం చేయడానికి అవసరమైన అన్ని సమాచారం గురించీ, మార్గదర్శకాలను రాష్ట్రాలకు అందించామని ఆయన స్పష్టం చేశారు.   భవిష్యత్తులో వైరస్ పరివర్తన చెందుతుందనీ, అప్పుడు, అది, పిల్లలకు అపాయం కలిగించవచ్చననీ, ప్రచారంలో ఉన్న ఊహాగానాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు.   అటువంటి, ఏ అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కోవటానికి వీలుగా ఆరోగ్య సౌకర్యాలను మెరుగు పరుస్తున్నట్లు,  ఆయన తెలిపారు.

డాక్టర్ హర్షవర్ధన్ అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లోని కోవిడ్ పూర్వాపరాలను సంక్షిప్తంగా వివరించారు.  ఛత్తీస్‌గఢ్గ లో, 2021 మార్చి నుండి తీవ్రస్థాయిలో వ్యాప్తిని గమనించడం జరిగింది.  మే ప్రారంభంలో రాష్ట్రంలో 30 శాతం రేటు తో పాజిటివ్ కేసులను గుర్తించడం జరిగింది.  హిమాచల్ ప్రదేశ్ లో  35,000 కంటే ఎక్కువ క్రియాశీల కేసులు ఉన్నాయి, అయితే మరణాల రేటు (1.44 శాతం) జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా నమోదయ్యింది.  హిమాచల్ ప్రదేశ్ లో కేసులు పెరగడానికి,అసంతృప్తి, వివాహాలు, వంటి వ్యాధిని వ్యాపింపజేసే, అనేక సంఘటనలు ప్రధాన కారణమని, డాక్టర్ హర్ష్ వర్ధన్ నొక్కిచెప్పారు.  22,000 క్రియాశీల కేసులతో గోవా పెరుగుతున్న ధోరణిలో ఉందని ఆయన తెలియజేశారు.  డామన్-డియులలో 366 క్రియాశీల కేసులు ఉన్నాయి. అయితే అక్కడ తగ్గుతున్న ధోరణిని గమనించవచ్చు.  అదేవిధంగా, ప్రస్తుతం 1,500 క్రియాశీల కేసుల తో లడఖ్ కూడా తగ్గుతున్న ధోరణిలో కొనసాగుతోంది.

దేశంలో కొత్తగా అభివృద్ధి చెందుతున్న ధోరణి గురించి, డాక్టర్ హర్షవర్ధన్, హెచ్చరించారు.  ఇప్పుడు చిన్న రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి పెరుగుతున్న ధోరణి కనబడుతోందనీ, అందువల్ల, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని,  ఆయన నొక్కి చెప్పారు.  మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడటానికి పరీక్ష, ట్రాకింగ్, ట్రేసింగ్, చికిత్స తో పాటు ఇప్పుడు టీకాలు వేయడం వంటి కోవిడ్ నియమ నిబంధనలను తప్పకుండా అనుసరించాలని ఆయన రాష్ట్రాలను కోరారు.  టీకాలు వేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.  కేంద్ర ప్రభుత్వం అందించిన 70 శాతం టీకాలను రెండవ మోతాదుకు పరిమితం చేయవలసిన అవసరాన్ని ఆయన పునరుద్ఘాటించారు.  టీకా వృధా కాకుండా రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని ఆయన అభ్యర్థించారు.

ఎమ్.ఓ.ఎస్. (హెచ్.ఎఫ్.డబ్ల్యూ), శ్రీ అశ్విని కుమార్ చౌబే, ఈ సమావేశంలో మాట్లాడుతూ, పరీక్షలు మరియు టీకాలు వేసే కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించాలని, పునరుద్ఘాటించారు.  ముకోర్మైకోసిస్‌కు మందుల పరంగా, రాష్ట్రాలకు కేంద్రం పూర్తి సహాయం అందిస్తోందనీ, అదేవిధంగా, ఆసుపత్రిలో చేరిన రోగులకు ఆక్సిజన్ కూడా సరఫరా చేస్తుందని, ఆయన చెప్పారు.  కోవిడ్ కి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.

తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో క్రియాశీల కేసుల ధోరణి, పాజిటివిటీ రేటు, మరణాల రేటు వంటి అంశాల గురించి, వివరణాత్మక మరియు సమగ్ర ప్రదర్శన ద్వారా, ఎన్‌.సి.డి.సి. డైరెక్టర్ శ్రీ సుజీత్ కుమార్ సింగ్, తెలియజేశారు.  చిన్న రాష్ట్రాల్లో ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌లో పెరుగుతున్న కేసులపై ఆయన హెచ్చరించారు.  నిఘా, పరీక్షలతో పాటు, హాట్‌- స్పాట్‌ లు గా మారే అవకాశమున్న ప్రాంతాలపై దృష్టి పెట్టవలసిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.

ఈ 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో టీకాల పురోగతి గురించి, ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి వందన గుర్నాని తెలియజేశారు.  45 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి టీకాలు వేయడంలో, చండీగఢ్ (29 శాతం), పుదుచ్చేరి (25 శాతం), దాద్రా, నగర్ హవేలీ (24 శాతం) రాష్ట్రాలు జాతీయ సగటు (35 శాతం) కంటే వెనుకబడి ఉన్నాయి.  కాగా, చండీగఢ్, లక్షద్వీప్, జమ్మూ-కశ్మీర్, అండమాన్-నికోబార్ వంటి కేంద్రపాలిత ప్రాంతాలు వారి ఆరోగ్య సంరక్షణ మరియు ఫ్రంట్-లైన్ కార్మికులకు టీకాలు వేయడంలో చాలా వెనుకబడి ఉన్నాయి.

కోవిడ్-19 ను అరికట్టడానికి అవసరమైన సంసిద్ధతను పెంచడానికి అవసరమైన సలహాల గురించి రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు ప్రస్తావిస్తూ,  కేంద్ర ప్రభుత్వం నుండి తమకు లభిస్తున్న సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు.  టీకాలు వేసే కార్యక్రమాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా మద్దతు ఇస్తుందని, డాక్టర్ హర్ష్ వర్ధన్ రాష్ట్రాలకు  హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో ఎన్‌.హెచ్‌.ఎం. అదనపు కార్యదర్శి మరియు మిషన్ డైరెక్టర్, శ్రీమతి వందనా గుర్నానీ; ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి శ్రీ లవ్ అగర్వాల్; ఎన్‌.సి.డి.సి. డైరెక్టర్, డాక్టర్ సుజీత్ కె. సింగ్ తో పాటు, ఆరోగ్య శాఖ కు చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

*****



(Release ID: 1720832) Visitor Counter : 179