ఆర్థిక మంత్రిత్వ శాఖ
కొత్త ఇ-ఫైలింగ్ పోర్టల్ ప్రారంభించనున్న ఆదాయపు పన్ను శాఖ
01.06.2021 నుంచి 06.06.2021 వరకు ఇ-ఫైలింగ్ సేవలు లభ్యంకావు
Posted On:
20 MAY 2021 6:18PM by PIB Hyderabad
ఆదాయపు పన్ను శాఖ 2021 జూన్ 7న కొత్త ‘ఇ-ఫైలింగ్’ పోర్టల్ www.incometax.gov.in ప్రారంభించనుంది. పన్ను చెల్లింపుదారులకు అత్యాధునిక, నిరంతరాయ, సంపూర్ణ సౌకర్యం కల్పించడమే ఈ కొత్త ‘ఇ-ఫైలింగ్’ పోర్టల్ లక్ష్యం:
- పన్ను చెల్లింపుదారులకు ‘సత్వర వాపసు’ లక్ష్యంగా ఆదాయపు పన్ను రిటర్ను (ఐటీఆర్)ల తక్షణ పరిశీలన ప్రక్రియతో ఈ కొత్త పన్ను చెల్లింపుదారు అనుకూల పోర్టల్ అనుసంధానం చేయబడింది;
- పన్ను చెల్లింపుదారుల తదుపరి చర్యలకు అనుగుణంగా అన్ని లావాదేవీలు, అప్‌లోడ్స్ లేదా పెండింగులోగల చర్యలు- సమస్తం ఒకే డ్యాష్ బోర్డులో ప్రదర్శించబడతాయి;
- ఐటీఆర్ తయారీ కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో ఉచితంగా సాఫ్ట్‌వేర్ లభ్యం... ఐటీఆర్ నింపేందుకు పన్ను చెల్లింపుదారులకు సాయం కోసం సంభాషణపూర్వక ప్రశ్నలు కూడా ఉంటాయి. ఫారంలో కొన్ని వివరాలు ముందే నింపి ఉన్నందువల్ల ఏమాత్రం పన్ను పరిజ్ఞానం లేనివారు కూడా అత్యంత సులువుగా సమాచారం నింపవచ్చు;
- పన్ను చెల్లింపుదారులకు సహాయం, తక్షణ జవాబు లభించేలా ‘‘తరచూ అడిగే ప్రశ్నలు (ఎఫ్ఏక్యూ), ట్యుటోరియల్స్, వీడియోలు, చాట్‌బాట్/ప్రత్యక్ష సహాయక ఏజెంట్’’ వంటి సదుపాయాలతో సరికొత్త కాల్ సెంటర్ ఏర్పాటు;
- పోర్టల్ ద్వారా డెస్క్ టాప్ కంప్యూటర్ మీద లభించే కీలక సదుపాయాలన్నీ మొబైల్ అనువర్తనంలోనూ లభ్యమవుతాయి. మొబైల్ నెట్ వర్క్ పై వీటిని ఏ సమయంలోనైనా పొందే సదుపాయం తర్వాత కల్పించబడుతుంది;
- కొత్త పోర్టల్ ద్వారా ప్రారంభమయ్యాక కొంతకాలానికి ఆన్‌లైన్ ద్వారా పన్ను చెల్లించే కొత్త వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఇందులో నెట్ బ్యాంకింగ్, యూపీఐ, క్రెడిట్ కార్డ్, ఆర్టీజీఎస్/నెఫ్ట్ వంటి పలు మార్గాల్లో పన్ను చెల్లింపుదారులకు ఖాతాగల ఏ బ్యాంకు నుంచయినా పన్నులు సులభంగా చెల్లించవచ్చు.
కొత్త పోర్టల్‌కు మారే దిశగా సన్నాహాలు సాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఆదాయపు పన్ను శాఖ పోర్టల్ www.incometaxindiaefiling.gov.in 6 రోజుల స్వల్ప కాలం అంటే- 2021 జూన్ 1 నుంచి 2021 జూన్ 6వ తేదీదాకా పన్ను చెల్లింపుదారులతోపాటు ఇతర భాగస్వాములకూ అందుబాటులో ఉండదు. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడటం కోసం సదరు ఆరు రోజుల వ్యవధిలో ఆదాయపు పన్నుశాఖ ఏ అంశంపైనా గడువులేవీ నిర్ణయించదు. ఏవైనా కేసులు, చట్ట నిబంధనల అమలుకు సంబంధించి విచారణను 2021 జూన్ 10 నుంచి ప్రారంభించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయబడ్డాయి. దీనివల్ల పన్ను చెల్లింపుదారులు కొత్త వ్యవస్థ ద్వారా స్పందించేందుకు తగినంత సమయం లభిస్తుంది. అలాగే ఈ వ్యవధి నడుమ కేసుల వాదనలు, చట్ట నిబంధనలకు సంబంధించిన ఏదైనా ఆన్‌లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటే వాటిని ముందుకు జరపడం లేదా వాయిదా వేయడంతోపాటు ఈ వ్యవధి తర్వాతి సమయంలో స్వీకరించేలా కార్యకలాపాల సవరణ చేయబడుతుంది.
ఆదాయపు పన్ను శాఖద్వారా ‘పాన్‘కార్డు తనిఖీ వగైరా సేవలు పొందే బ్యాంకులు, ఎంసీఏ, జీఎస్టీఎన్, డీపీఐఐటీ, సీబీఐసీ, జీఇఎం, డీజీఎఫ్టీ వంటి బయటి భాగస్వామ్య సంస్థలన్నిటికీ సేవల్లో అంతరాయం గురించి సమాచారం ఇవ్వబడింది. అదే సమయంలో అసౌకర్యం నివారణలో భాగంగా వారి ఖాతాదారులు/భాగస్వాములకు సమాచారం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదాయపు పన్నుశాఖ అభ్యర్థించింది. దీనివల్ల సేవలు అందని వ్యవధిలో కాకుండా ముందుగా లేదా తర్వాత వారు తమ కార్యకలాపాలను నిర్వహించుకునే వీలుంటుంది. ఏవైనా సమర్పణలు, అప్‌లోడ్/డౌన్‌లోడ్ వంటి అత్యవసర పనులేవైనా ఉంటే 2021 జూన్ 1కి ముందే పూర్తిచేసుకునేలా పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహిస్తుంది. తద్వారా సేవలు నిలిపివేసే కాలంలో ఇబ్బందులు తప్పుతాయని పేర్కొంది.
కొత్త ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు మారే సమయంలోనే కాకుండా కొత్త వ్యవస్థకు అలవాటుపడేదాకా పన్ను చెల్లింపుదారులు, భాగస్వాములు సహనం పాటించాల్సిందిగా ఆదాయపు పన్నుశాఖ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పన్ను చెల్లింపుదారులకు, ఇతర భాగస్వాములకు చట్ట నిబంధనలు పాటింపును సులభతరం చేయడం కోసం ‘సీబీడీటీ’ మరొక వినూత్న చర్య చేపట్టింది.
***
(Release ID: 1720566)
Visitor Counter : 268