మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

వర్చువల్ మోసగాళ్లను గుర్తించే ‘ఫేక్‌బస్టర్’

Posted On: 19 MAY 2021 10:14AM by PIB Hyderabad

రహస్యంగా లేదా మారురూపంలో వర్చువల్ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యే మోసగాళ్ళను గుర్తించడానికి ‘ఫేక్‌బస్టర్’ అనే ప్రత్యేకమైన డిటెక్టర్‌ను పంజాబ్లోని రోపర్ ఐఐటీ, ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు అభివృద్ధి చేశారు.  ఎవరినైనా అపఖ్యాతిపాలు చేయడానికి లేదా ఎగతాళి చేయడానికి సోషల్ మీడియాలో నకిలీ ముఖాలతో పోస్టులు పెట్టినా కూడా కనుగొనవచ్చు. ప్రస్తుతం మహమ్మారి కారణంగా, అధికారిక సమావేశాలు , పనులు చాలావరకు ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. వీడియో కాన్ఫరెన్సింగ్ సమయంలో ఒకరిస్థానంలో వేరే వాళ్లు పాల్గొన్నా లేదా అక్రమంగా ఉపయోగించుకున్నా సమావేశ నిర్వాహకుడికి ఈ డిటెక్టర్ సాయంతో తెలిసిపోతుంది. ఉదాహరణకు మోసగాడు మీ సహోద్యోగులలో ఒకరి తరపున వెబ్‌నార్ లేదా వర్చువల్ సమావేశానికి హాజరైతే ఈ టూల్ ద్వారా అతణ్ని గుర్తించవచ్చు. "అధునాతన కృత్రిమ మేధస్సు పద్ధతుల వల్ల సోషల్ మీడియాలో ఎన్నో అక్రమాలు, మోసాలు జరుగుతున్నాయి. ఇటువంటివి అభివృద్ధి చెందుతూనే ఉంటాయి.  మరింత వాస్తవికంగా మారతాయి. ఇట్లాంటి మోసాలను గుర్తించకపోతే కష్టమే! మోసగాళ్ల వల్ల భద్రతాపరమైన సమస్యలు ఎదురవుతాయి ”అని ఫేక్‌బస్టర్ ను అభివృద్ధి చేసిన నలుగురు వ్యక్తుల  బృందంలో ఒకరైన డాక్టర్ అభినవ్ ధాల్ అన్నారు. "తాము రూపొందించిన పరికరం 90 శాతానికి పైగా కచ్చితత్వాన్ని సాధించింది" అని చెప్పారు. మిగతా ముగ్గురు సభ్యులలో అసోసియేట్ ప్రొఫెసర్ రామనాథన్ సుబ్రమణియన్ , ఇద్దరు విద్యార్థులు వినీత్ మెహతా , పారుల్ గుప్తా ఉన్నారు.

డాక్టర్ అభినవ్ ధల్  బైట్

ఒక కాగితంపై ఈ టెక్నిక్‌–- ఫేక్‌బస్టర్: వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం డీప్‌ఫేక్స్ డిటెక్షన్ టూల్ను - గత నెలలో అమెరికాలో ‘‘ఇంటెలిజెంట్ యూజర్ ఇంటర్‌ఫేస్‌”పేరుతో జరిగిన 26 వ అంతర్జాతీయ సదస్సులో ప్రదర్శించారు. నకిలీ వార్తలు, అశ్లీలత , ఇతర ఆన్‌లైన్ విషయాలను వ్యాప్తి చేయడానికి తారుమారు చేసిన మీడియా కంటెంట్‌ను పెద్ద పరిణామాల్లో విస్తృతంగా వాడినట్టు గుర్తించామని డాక్టర్ ధాల్ చెప్పారు. ఇలాంటి చర్యల వల్ల తీవ్రమైన పర్యవసానాలు ఉంటాయని అన్నారు. ముఖ కవళికలను మార్చగల  స్పూఫింగ్ టూల్స్ ద్వారా  మోసగాళ్లు ద్వారా వీడియో-కాలింగ్ సమావేశాల్లోకి చొరబడ్డారని ఆయన అన్నారు. ఈ నకిలీ ముఖ కవళికలను గుర్తించడం కష్టమేనని, ఆ వ్యక్తి నిజమైన వాడే అనుకుంటామని పేర్కొన్నారు.  ఫలితంగా తీవ్రమైన సమస్యలు ఏర్పడుతాయన్నారు. ‘డీప్‌ఫేక్స్’ అని పిలిచే రియల్టైం మిమిక్డ్ వీడియోలను  ఆన్‌లైన్ పరీక్షల్లో , ఉద్యోగ ఇంటర్వ్యూలలో కూడా ఉపయోగించవచ్చు.

ఈ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్ వీడియో కాన్ఫరెన్సింగ్ సొల్యూషన్స్కు సురక్షితమైనది. జూమ్ , స్కైప్ యాప్స్పై పరీక్షించారు. డీప్‌ఫేక్ డిటెక్షన్ సాధనం-‘ఫేక్‌బస్టర్’ ఆన్‌లైన్ , ఆఫ్‌లైన్ మోడ్‌లలో పనిచేస్తుంది. పరికరాన్ని ప్రస్తుతం ల్యాప్‌టాప్‌లు , డెస్క్‌టాప్‌లతో మాత్రమే ఉపయోగించవచ్చు.“మొబైల్ ఫోన్‌లు / ఇతర పరికరాల్లో కూడా ఈ టూల్ను వాడుకోవడానికి వీలుగా నెట్‌వర్క్‌ను చిన్నగా , తేలికగా మార్చాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము” అని అసోసియేట్ ప్రొఫెసర్ సుబ్రమణియన్ చెప్పారు. నకిలీ ఆడియోలను కూడా గుర్తించడానికి కూడా ఈ పరికరాన్ని ఉపయోగించుకునేలా బృందం కృషి చేస్తోందని ఆయన అన్నారు. డీప్‌ఫేక్ డిటెక్షన్ టెక్నాలజీని ఉపయోగించి లైవ్ వీడియో కాన్ఫరెన్సింగ్ సమయంలో మోసగాళ్లను గుర్తించే మొట్టమొదట తయారుచేసిన సాధనాల్లో ‘ఫేక్‌బస్టర్’ ఒకటి అని బృందం పేర్కొంది. పరికరానికి అన్ని పరీక్షలూ పూర్తయ్యయి. త్వరలోనే మార్కెట్లోకి వస్తుంది

 

***


(Release ID: 1719911) Visitor Counter : 259