ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్ పై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీఓఎం) 26 వ సమావేశానికి కేంద్రమంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ అధ్యక్షత వహించారు


కరోనాతో పోరాడటానికి కొత్త ఔషధాన్ని తీసుకొచ్చినందుకు ప్రధాన మంత్రితోపాటు రక్షణ మంత్రి నాయకత్వాన్ని ప్రశంసించారు

కొవిడ్ వేరియెంట్లను పర్యవేక్షించడానికి ఇన్సాకాగ్ నెట్‌వర్క్‌కు మరిన్ని ల్యాబ్‌లను చేర్చుతారు

ప్రభుత్వ జోక్యం తరువాత రెమ్‌డెసివిర్ ఉత్పత్తి మూడు రెట్లు పెరిగింది

కొవిడ్ ఫంగల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి యాంఫోటెరిసిన్-బి తయారీని పెంచారు .

కో-విన్ పోర్టల్ త్వరలో హిందీతోపాటు ప్రాంతీయ భాషలలో అందుబాటులోకి వస్తుంది.

Posted On: 17 MAY 2021 5:04PM by PIB Hyderabad

కొవిడ్--–19 పై ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి మంత్రుల బృందం (జీఓఎం)  26 వ సమావేశానికి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ అధ్యక్షత వహించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్, పౌర విమానయాన శాఖ మంత్రి  హర్దీప్ ఎస్. పూరి, ఓడరేవులు, షిప్పింగ్ జలమార్గాల (ఐ / సి), & రసాయన ఎరువుల శాఖ మంత్రి  మన్సుఖ్ మాండవియా,  కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి  అశ్విని కుమార్ చౌబే ఈ మీటింగులో పాల్గొన్నారు. నీతి ఆయోగ్ (ఆరోగ్యం) సభ్యుడు డాక్టర్ వినోద్ కె పాల్ వర్చువల్గా హాజరయ్యారు.

  డాక్టర్ హర్ష్ వర్ధన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మహమ్మారి సమయంలో తమ విధులను సమర్థంగా, ధైర్యంగా నిర్వర్తించిన కొవిడ్ యోధులందరినీ అభినందించారు. గత 12 నెలలుగా కరోనాతో పోరాడుతున్నా  అలసట లేకుండా సేవలు అందించినందుకు ప్రశంసించారు. దేశం సాధించిన విజయాలకు కరోనా యోధులు ఎంతో సహకరించారని మంత్రి అన్నారు. "భారత్లో  కొవిడ్ కొత్త కేసులు గత 26 రోజుల తరువాత మొదటిసారిగా 3 లక్షలకు తగ్గాయి. అలాగే, గత 24 గంటల్లో యాక్టివ్ కేసుల లోడ్ నికరంగా 1,01,461 కేసులకు తగ్గింది”అని ఆయన వివరించారు.

భారతదేశపు మొట్టమొదటి దేశీయ కరోనా మందు 2-డియోక్సీ-డి–-గ్లూకోజ్ లేదా 2-డిజి (ఇన్మాస్ తోపాటు హైదరాబాద్ ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సహకారంతో డీఆర్డీఓ అభివృద్ధి చేసింది)ని తయారు చేసిన రక్షణశాఖ శాస్త్రవేత్తలను, రక్షణ మంత్రి  రాజనాథ్ సింగ్, ప్రధాన మంత్రి  నరేంద్ర మోడీ నాయకత్వాన్ని డాక్టర్ హర్షవర్ధన్ ప్రశంసించారు. ఈ ఔషధం పరిశోధన ప్రయత్నాలు ఏప్రిల్ 2020 లో ప్రారంభమయ్యాయి. ఇటీవల డీజీసీఐ 2డీజికి అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చింది. కొవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఈ మందు కీలకంగా మారుతుందని మంత్రి సభ్యులకు తెలియజేశారు. ఎందుకంటే ఇది ఆక్సిజన్పై రోగుల ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. కొవిడ్ సోకిన కణాలను సమర్థంగా ఎదుర్కొంటుంది. వాటిలో శక్తి ఉత్పత్తిని నిరోధిస్తుంది.

కరోనా మహమ్మారిని పోగొట్టడానికి కేంద్రం ‘మొత్తం ప్రభుత్వం’ విధానంలో రాష్ట్రాలకు సహాయం చేస్తూనే ఉందని హర్షవర్ధన్ పేర్కొన్నారు. రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు 422.79 లక్షల ఎన్‌95 మాస్క్‌లు, 176.91 లక్షల పిపిఇ కిట్లు, 52.64 లక్షల రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు, 45,066 వెంటిలేటర్లను పంపిణీ చేశామన్నారు. పరీక్షల నమూనాల సంఖ్యను పెంచడానికి, మరింత ప్రాదేశిక విశ్లేషణ కోసం 17 కొత్త ల్యాబ్‌లను ఇన్సాకాగ్ నెట్‌వర్క్‌కు చేర్చబోతున్నట్లు డాక్టర్ హర్ష్ వర్ధన్ ప్రకటించారు. ఈ నెట్‌వర్క్ ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లోని 10 ల్యాబ్‌ల ద్వారా సేవలు అందిస్తోంది.

భారతదేశంలోని సార్స్కో వీ2, వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ (వీఓసీఎస్)  మ్యుటేషన్లపై డైరెక్టర్ (ఎన్‌సిడిసి) డాక్టర్ సుజీత్ కె సింగ్ ఈ సందర్భంగా సమగ్ర నివేదికను సమర్పించారు. భారతదేశం అంతటా బి.1.1.7, బి.1.617 వంటి వీఓసీఎస్  ఉనికికి సంబంధించిన గణాంకాలను ఆయన చూపించారు. ఫిబ్రవరి మార్చి, 2021 మధ్య పంజాబ్ రాజధాని చండీగఢ్ నుంచి సేకరించిన నమూనాలలో బి.1.1.7 లీనియేజ్ (యుకె వేరియంట్) కనిపించిందని వెల్లడించారు. పరీక్షల సంఖ్యను మరింతగా పెంచడానికి చేసిన వినూత్నమైన మార్పులను కార్యదర్శి (హెల్త్ రీసెర్చ్) & ఐసిఎంఆర్ డీజీ డాక్టర్ బాలరాం భార్గవ వివరించారు. దీనివల్ల  ఆరోగ్య మౌలిక సదుపాయాలు బలహీనంగా ఉన్న పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో టెస్టులను పెంచవచ్చని విశదీకరించారు . మొబైల్ ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ వ్యాన్ల సంఖ్యను, ఆర్ఏటీ పరీక్షలనూ పెంచిన విషయాన్ని వివరించారు. మనదేశంలో కరోనా టెస్టుల ప్రస్తుత సామర్థ్యం సుమారు 25 లక్షలు (ఆర్టీపీసీఆర్ -13 లక్షలు, రాట్ -12 లక్షలు) ఉండగా, కొత్త పరీక్షా నియమావళి ప్రకారం ఇది 45 లక్షలకు (ఆర్టీపీసీఆర్ -18 లక్షలు, రాట్ -27 లక్షలు)  పెరుగుతుందని అంచనా. హోమ్ ఐసోలేషన్ మార్గదర్శకాల గురించి కూడా భార్గవ తెలియజేశారు. ఈ విషయాలను హిందీ, ఇతర ప్రాంతీయ భాషల్లో విస్తృతంగా ప్రచారం చేస్తారు. ఆసుపత్రిలో ఎప్పుడు చేరాలి, ఐసియులో ఎప్పుడు ఉంచాలి ?..రెమ్‌డెసివిర్ టోసిలిజుమాబ్  వాడకం తదితర విషయాలపై హెచ్చరికలను కూడా ఐసీఎంఆర్ జారీ చేసింది.  కొవిడ్-19 చికిత్సకు కావాల్సిన ఔషధాల ఉత్పత్తి కేటాయింపులను సమన్వయం చేయడానికి ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటయిందని ఫార్మాశాఖ కార్యదర్శి ఎస్. అపర్ణ తెలిపారు. ఉత్పత్తి, ఔషధాలను తయారీని పెంచాలని కంపెనీలకు సూచించారు. కరోనాను ఎదుర్కోవడానికి చేపట్టిన మూడంచెల వ్యూహం గురించి కూడా ఆమె మంత్రులకు తెలియజేశారు.

--–కొత్త సరఫరాదారుల గుర్తించడమేగాక వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తారు. డిమాండ్‌ను తీర్చడానికి సాధ్యమయ్యే అన్ని మార్గాలను అన్వేషిస్తారు.

–ఔషధాలు ఉత్పత్తి అయ్యే రాష్ట్రాల్లో అక్రమ నిల్వలను (హోర్డింగ్‌ను) నివారించడానికి / సరఫరా గొలుసును నిరంతరం పర్యవేక్షిస్తారు. రాష్ట్రాలు, సరఫరాదారుల మధ్య సమస్యలను త్వరగా పరిష్కరిస్తారు.

–హోర్డింగ్, బ్లాక్-మార్కెటింగ్‌కు వ్యతిరేకంగా డీజీసీఐ, ఎస్డీసీలు చర్యలు తీసుకుంటాయి.

 రెమ్‌డెసివిర్, టోసిలిజుమాబ్ యాంఫోటెరిసిన్-బి  తయారీ కోసం కేటాయింపుల కోసం మరింత ప్రాధాన్యం ఇస్తున్నారు. కొవిడ్ వైద్య మార్గదర్శకాలలో ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లను సిఫారసు చేయనప్పటికీ, వీటికి డిమాండ్ చాలా పెరిగిందని ఆమె తెలియజేశారు. ఈ ఔషధాలను సక్రమంగా ఉపయోగించుకునేలా ఐఇసి ప్రచారం చేయాలని సూచించారు. ప్రభుత్వం చొరవ వల్ల  దేశంలో రెమ్‌డెసివిర్ ఉత్పత్తి నెలలో సుమారు 39 లక్షల నుండి 118 లక్షల వయల్స్కు పెరిగిందని అపర్ణ పేర్కొన్నారు. మ్యూకోర్ మైకోసిస్ చికిత్సకు ఉపయోగించే యాంఫోటెరిసిన్-బి మందుకు కూడా డిమాండ్ పెరిగింది. ఈ మందు సప్లై కోసం ఐదుగురు సరఫరాదారులను గుర్తించారు. దీని కేటాయింపు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2021 మే 1 నుండి 14 వరకు రాష్ట్రాలకు లక్ష యాంఫోటెరిసిన్-బి వయల్స్ ఇవ్వగా, దిగుమతి కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు.  ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో మందులను సమానంగా పంపిణీని చేయాలని, సామాన్య ప్రజలకు వీటిని అమ్మే దుకాణాల వివరాలను ఇవ్వాలని ఆమె కోరారు. అక్రమ నిల్వలను నివారించడంలో సహాయపడాలని కోరారు. తయారీదారులకు సకాలంలో చెల్లింపులు ఉండేలా చూడాలని స్పష్టం చేశారు.

వచ్చే వారం నాటికి కోవిన్ ప్లాట్‌ఫాంను హిందీ, 14 ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తెస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సమావేశంలో వివరించారు. నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్, కార్యదర్శి (ఆరోగ్యం)  రాజేష్ భూషణ్,  కార్యదర్శి (సివిల్ ఏవియేషన్) ప్రదీప్ సింగ్ ఖరోలా,  ఎస్. అపర్ణ, కార్యదర్శి (ఫార్మా),  వందన గుర్నాని, ఎన్హెచ్ఎం అదనపు కార్యదర్శి, (కేంద్ర ఆరోగ్య వైద్యమంత్రిత్వశాఖ) అదనపు కార్యదర్శి  ఆర్తి అహుజా, ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ మనోహర్ అగ్నానీ,  కేంద్ర ఆరోగ్య వైద్యమంత్రిత్వశాఖ డీజీహెచ్ఎస్ డాక్టర్ సునీల్ కుమార్, అమిత్ యాదవ్, డిజి, విదేశీ వాణిజ్యం (డిజిఎఫ్టి), డాక్టర్ సుజీత్ కె సింగ్, డైరెక్టర్ (ఎన్సిడిసి),  సంజీవ కుమార్, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ( ఎన్డీఎంఏ) ఇతర సీనియర్ ప్రభుత్వ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. సాయుధ దళాల, ఐటిబిపి ప్రతినిధులు కూడా హాజరయ్యారు.

 

***



(Release ID: 1719554) Visitor Counter : 148