విద్యుత్తు మంత్రిత్వ శాఖ

కోవిడ్ పై పోరాటంలో పవర్ గ్రిడ్ చొరవ!


కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద
రూ. 1,14,30,000 విలువైన ఐ.సి.యు. వెంటిలేటర్ల అప్పగింత

పలు వ్యాక్సినేషన్ శిబిరాల నిర్వహణ,..
బాధితులకోసం ఐసొలేషన్ కేంద్రాల ఏర్పాటు

Posted On: 15 MAY 2021 5:12PM by PIB Hyderabad

భారత్ ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలో ‘మహారత్న’ హోదా కలిగిన కంపెనీ, భారతీయ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (పవర్ గ్రిడ్). కోవిడ్ వైరస్ పై పోరాటంలో భాగంగా ఈ సంస్థ అనేక చర్యలు తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉండే పవర్ గ్రిడ్ కార్యాయాల్లోని తన ఉద్యోగుల కోసం సకాలంలో తగిన సహాయం అందించేందుకు తన వంతుగా అనేక చర్యలు చేపట్టింది.

  కోవిడ్ వైరస్ మహమ్మారిపై పోరాటం జరపాలన్నా, వైరస్ వ్యాప్తిని ముందస్తుగానే అరికట్టాలన్నా, వ్యాక్సినేషన్ మాత్రమే కీలక ఆయుధం. ఈ నేపథ్యంలో, పవర్ గ్రిడ్ కంపెనీ తన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకోసం వ్యాక్సినేషన్ శిబిరాలను నిర్వహిస్తోంది. గురుగ్రామ్ లోని తన కార్పొరేట్ కేంద్ర కార్యాలయంతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాల్లోనూ ఈ శిబిరాలను  నిర్వహిస్తోంది. దేశం మారుమూలలో ఉన్న ప్రాంతీయ ప్రధాన కేంద్రాలు, విద్యుత్ ఉపకేంద్రాలతో సహా అన్ని కార్యాలయాల్లోనూ ఈ శిబిరాలను చేపట్టారు. తన సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు వ్యాక్సీన్ అందించేందుకయ్యే ఖర్చును పవర్ గ్రిడ్ కంపెనీయే భరిస్తోంది. 18నుంచి 45ఏళ్ల వయస్సు వారికి, 45ఏళ్ల వయస్సు దాటిన వారికి కూడా క్రమం తప్పకుండా  వ్యాక్సీన్ రెండు డోసులను అందించేందుకు వ్యాక్సినేషన్ శిబిరాలను నిర్వహిస్తూ వస్తున్నారు. పదవీ విరమణ పొందిన కంపెనీ ఉద్యోగులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు, వారి కుటుంబాలకు కూడా ఈ వ్యాక్సీన్ సదుపాయాన్ని అందిస్తున్నారు. దీనికి తోడుగా, విద్యుత్ మంత్రిత్వ శాఖ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థల ఉద్యోగులకు వ్యాక్సినేషన్ కల్పిస్తున్నారు. కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వ్యాక్సినేషన్ శిబిరాలకు అనూహ్య స్పందన వెల్లువెత్తుతోంది.

 కోవిడ్ బాధితులైన ఉద్యోగులకు వారి కుటుంబసభ్యులకు భోజన సదుపాయాన్ని కూడా పవర్ గ్రిడ్ కంపెనీ కల్పిస్తోంది. కంపెనీ ప్రాంతీయ ప్రధాన కేంద్ర కార్యాయాలు, కంపెనీకి సంబంధించిన ఇతర కార్యాలయాలకు కూడా ఇదే పద్ధతిని అమలు చేస్తున్నారు.

  వైరస్ మహమ్మారి సంక్షోభం తొలిసారి తలెత్తినపుడు గురుగ్రామ్ లోని 46వ సెక్టార్ లో 2020వ సంవత్సరంలో కంపెనీ ప్రారంభించిన కోవిడ్ బాధితుల ఐసొలేషన్ కేంద్రం సామర్థ్యాన్ని  మరింతగా పెంచారు. మనేసర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కొత్త ఐసొలేషన్ కేంద్రం,. రిటైరైన కంపెనీ ఉద్యోగులకు, వారి కుటుంబాలకు సేలవందిస్తోంది. మనేసర్ ఐసొలేషన్ కేంద్రంలో 50పడకలు అందాబాటులో ఉన్నాయి. అంతేకాక, క్వారంటైన్ సదుపాయం కోరుకునే వారికి కూడా విడిగా పడకలను ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఐసొలేషన్ కేంద్రంలో రెసిడెంట్ డాక్టర్లను, నర్సులను, ప్యారామెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. సీనియర్ డాక్టర్లను ఆన్ లైన్ ద్వారా సంప్రదించే సదుపాయం కూడా ఉంది. కోవిడ్ బాధితుల చికిత్సకోసం ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, సిలిండర్లు, మందులు ఏర్పాటు చేశారు. బాధితులకు చికిత్సలో ఎలాంటి జాప్యం తలెత్తకుండా నివారించేందుకు ప్యాథలాజికల్ సేవలను, స్కానింగ్ సదుపాయాలను కూడా కంపెనీ అందుబాటులో ఉంచింది. ఇందుకోసం సదరు సంబంధిత సంస్థలతో అనుసంధానాన్ని ఏర్పాటు చేసుకుంది. అస్వస్థులైన కోవిడ్ బాధితులను అవసరమైతే ఆసుపత్రికి తరలించేందుకు వీలుగా అంబులెన్స్ సేవలను సిద్ధంగా ఉంచారు. ఐసొలేషన్ కేంద్రాల్లో పూర్తి వసతులు కల్పించారు. రోగులకోసం భోజనాన్ని ఉచితంగా అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పవర్ గ్రిడ్ కార్యాలయాల్లో కూడా ఇలాంటి సదుపాయాలనే ఏర్పాటు చేశారు.

  ఇక కార్పొరేట్ సామాజిక బాధ్యత (సి.ఎస్.ఆర్.) కింద, పవర్ గ్రిడ్ కంపెనీ, రూ. 1,14,30,000 విలువైన తొమ్మిది ఐ.సి.యు. వెంటిలేటర్లను చంద్రాపూర్ లోని ప్రభుత్వ వైద్య కళాశాల డీన్ కు అందించింది. తీవ్రంగా అస్వస్థులైన కోవిడ్ రోగులకు అధునాతన చికిత్స అందించేందుకు ఈ ఐ.సి.యు. వెంటిలేటర్లు ఉపయోగపడుతున్నాయి. దీనికి తోడు, వివిధ రాష్ట్రాల్లో పరిపాలనా యంత్రాగాంలకు మాస్కులను, శానిటైజర్లను కూడా కంపెనీ తరఫున పంపిణీ చేశారు. కోవిడ్ వైరస్ నియంత్రణలో భాగంగా ఒరిస్సాలోని ఆంగుల్ జిల్లా అదనపు మెజిస్ట్రేట్ కు 5వేల మాస్కులు, 500 బాటిళ్ల హ్యాండ్ శానిటైజర్లు అందించారు. గుజరాత్ లోని వడోదరా నగర పాలక సంస్థలో కోవిడ్ బాధిత రోగుల సేవలకోసం ఒక అంబులెన్సును పవర్ గ్రిడ్ కంపెనీ అందజేసింది. వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అంబులెన్సు సేవలకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా కంపెనీ ఈ చర్య తీసుకుంది.

  దేశంలోని వివిధ ప్రాంతాల్లో దురదృష్ట వశాత్తూ వైరస్ బారిన పడిన కంపెనీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు సేవలందించేందుకు ప్రత్యేక బృందాలను కంపెనీ మానవ వనరుల విభాగం ఏర్పాటు చేసింది. కంపెనీ సిబ్బందిని, వారి కుటుంబ సభ్యులను ఆసుపత్రిలో చేర్చేందుకు,  ఆక్సిజన్ అందించి, మందులు ఏర్పాటు చేసేందుకు ఈ బృందాలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. ఈ సేవలకు సంబంధించిన సమాచారాన్ని కేంద్రీకృత హెల్ప్ లైన్ నంబర్ల ద్వారా  ఉద్యోగులకు అందిస్తున్నారు. హెల్ప్ లైన్ కు సంబంధించిన సమాచారాన్ని అన్ని ప్రాంతీయ ప్రధాన కేంద్ర కార్యాలయాల్లోను,  ఇంటర్నెట్ వెబ్ సైట్లలోను అందుబాటులో ఉంచారు.

 ఇక, కోవిడ్-19 సంబంధిత నియమ నిబంధనలను గురించి సామాన్య ప్రజలకు అవగాహన, చైతన్యం కల్పించేందుకు కంపెనీ కార్పొరేట్ కమ్యూనికేషన్ల శాఖ తనవంతు కృషి చేస్తోంది. కోవిడ్ నియంత్రణకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గురించి సృజనాత్మకమైన వీడియోలు, టెంప్లేట్లు తదితర మార్గాల ద్వారా అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఈ చర్యలు ఎంతో దోహదపడుతున్నాయి.

 

****


(Release ID: 1718922) Visitor Counter : 190