రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
రాయితీ ధరలకే రైతులకు ఎరువులు లభించేలా తీసుకున్న చర్యలు
Posted On:
15 MAY 2021 5:09PM by PIB Hyderabad
డి-అమ్మోనియం ఫాస్ఫేట్ (డీఏపీ), మురియేట్ ఆఫ్ పొటాష్ (ఎంఓపీ), సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ (ఎస్‌ఎస్‌పీ) సహా యూరియా, 22 గ్రేడ్ల ఫాస్ఫాటిక్&పొటాసిక్ (పీ&కే) ఎరువులను, వాటి తయారీదారులు లేదా దిగుమతిదారుల ద్వారా రాయితీ ధరలకే రైతులకు అందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పీ&కే ఎరువులపై రాయితీని గత నెల 1వ తేదీ నుంచి ఎన్‌బీఎస్ పథకం ద్వారా పర్యవేక్షిస్తోంది.
రైతు మిత్ర విధానానికి అనుగుణంగా, రైతులు ఖర్చు చేయగలిగిన ధరలకే పీ&కే ఎరువులను అందించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ రాయితీని ఆయా సంస్థలకు 'పోషక ఆధారిత రాయితీ ధరల' ప్రకారం కేంద్రం విడుదల చేస్తుంది. దీనివల్ల ఆయా సంస్థలు ఎరువులను రాయితీ ధరలకే రైతులకు అందుబాటులో ఉంచుతాయి.
డీఏపీ, ఇతర పీ&కే ఎరువుల తయారీకి అవసమైన ముడి పదార్థాల అంతర్జాతీయ ధరలు గత కొన్ని నెలల్లో భారీగా పెరిగాయి. తయారైన డీఏపీ వంటివాటి ధరలు కూడా అంతర్జాతీయ మార్కెట్లో ఆ ప్రకారమే పెరిగాయి. ముడి పదార్థాల్లో భారీ పెరుగుదల ఉన్నప్పటికీ, భారతదేశంలో డీఏపీ ధరలను ఆయా సంస్థలు గత నెల వరకు పెంచలేదు. అయితే, ప్రస్తుతం కొన్ని కంపెనీలు డీఏపీ ధరలు పెంచాయి.
ఈ మొత్తం పరిస్థితి గురించి కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. దీనిని ఉన్నత స్థాయిలో పరిశీలిస్తోంది. ధరల పెరుగుదలతో ఏర్పడిన రైతుల ఆందోళనల పట్ల ప్రభుత్వం కనికరంతో వ్యవహరిస్తోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి చర్యలు తీసుకుంటోంది. తద్వారా, డీఏపీ సహా పీ&కే ఎరువుల ధరల పెరుగుదల ప్రభావాల నుంచి రైతు సమాజాన్ని కాపాడుతోంది.
మొదటి అడుగుగా, మార్కెట్లో ఈ ఎరువుల లభ్యత తగినంత ఉండేలా అన్ని ఎరువుల సంస్థలను కేంద్రం ఆదేశించింది. దేశంలో ఎరువుల లభ్యతను నిత్యం పర్యవేక్షిస్తోంది.
పాత సరుకును పాత ధరలకే అమ్మాలని ఇప్పటికే అన్ని ఎరువుల సంస్థలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీనికి అదనంగా, రైతులకు మద్దతుగా నిలిచి, వారిపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు; పీ&కే ఎరువులు, డీఏపీ ముడి పదార్థాల అంతర్జాతీయ ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించడానికి రాయితీ ధరలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ప్రస్తుత కొవిడ్ కష్టకాలంలోనూ, రైతుల ప్రయోజనాల రక్షణకు అవసరమైన అన్ని చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటోంది.
***
(Release ID: 1718898)
Visitor Counter : 272