కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

బ్రిక్స్‌ దేశాల మధ్య "బ్రిక్స్‌ ఎంప్లాయిమెంట్‌ వర్కింగ్‌ గ్రూప్‌" (ఈడబ్ల్యూజీ) మొదటి సమావేశం

Posted On: 13 MAY 2021 12:44PM by PIB Hyderabad

ఈ నెల 11,12 తేదీల్లో జరిగిన "బ్రిక్స్‌ ఎంప్లాయిమెంట్‌ వర్కింగ్‌ గ్రూప్‌" (ఈడబ్ల్యూజీ) మొదటి సమావేశానికి "కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ" కార్యదర్శి అపూర్వ చంద్ర అధ్యక్షత వహించారు. వర్చువల్‌ పద్ధతిలో, దిల్లీలోని సుష్మస్వరాజ్‌ భవన్‌ కేంద్రంగా ఈ సమావేశం జరిగింది. ఈ ఏడాది బ్రిక్స్‌ సమావేశాలకు భారత్‌ నాయకత్వం వహిస్తుంది. "బ్రిక్స్‌ దేశాల మధ్య సామాజిక భద్రత ఒప్పందాల ప్రోత్సాహం; అధికారిక కార్మిక మార్కెట్లు; శ్రామిక శక్తి, గిగ్‌, ప్లాట్‌ఫాం కార్మికుల్లో మహిళల భాగస్వామ్యం - కార్మిక మార్కెట్లో వారి పాత్ర" ప్రధానాంశాలుగా ఈ సమావేశాల్లో చర్చలు జరిగాయి.
 
    సభ్య దేశాలైన బ్రెజిల్, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికాతోపాటు, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో), అంతర్జాతీయ సామాజిక భద్రత సంస్థ (ఐఎస్‌ఎస్‌ఏ) కూడా విలువైన సూచనలు చేశాయి. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ ప్రత్యేక కార్యదర్శి అనురాధ ప్రసాద్‌, సంయుక్త కార్యదర్శి ఆర్‌.కె.గుప్తా, జేఎస్‌ & డీజీఎల్‌డబ్ల్యూ అజయ్‌ తివారీ, సంయుక్త కార్యదర్శి కల్పన రాజ్‌సింగ్‌, డైరెక్టర్‌ రూపేష్‌ కుమార్‌ ఠాకూర్‌ భారత్‌ తరపున చర్చల్లో పాల్గొన్నారు. 

    సామాజిక భద్రత ఒప్పందం (ఎస్‌ఎస్‌ఏ) అంశంపై సభ్య దేశాలు పరస్పరం చర్చలు జరపాలని, ఒప్పందాలపై సంతకాలు జరిగేలా ముందడుగు వేయాలని తీర్మానించాయి. ఒప్పందాలకు అనుగుణంగా సాంకేతిక సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి సుముఖత వ్యక్తం చేశాయి. ఐఎస్‌ఎస్‌ఏ, ఐఎల్‌వో ఇందుకు తోడ్పడతాయి. బహుముఖ విధానాలను రూపొందించేందుకు సమావేశం కావాలని కూడా సభ్య దేశాలు నిర్ణయించాయి. అంతర్జాతీయ కార్మికులు తాము సంపాదించిన డబ్బును స్వదేశాలకు పంపడానికి సామాజిక భద్రత ఒప్పందం  సాయపడుతుంది. కష్టార్జితాన్ని వారు కోల్పోకుండా ఇది భరోసా కల్పిస్తుంది. స్వదేశంలో, విదేశంలో తన డబ్బును కోల్పోకుండా వీరికి మినహాయింపు లభిస్తుంది.
 
    అధికారిక కార్మిక మార్కెట్ల అంశంపై; ఉద్యోగాలను అధికారికం చేయడానికి తాము చేపట్టిన చర్యలు, కొవిడ్‌ తీసుకొచ్చిన అనర్ధంపై సభ్య దేశాలు చర్చించాయి

    శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం అంశంపై; పారితోషికాలు, ఉత్పాదక, చక్కటి పనితనంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి, అనధికారిక రంగంలో పనిచేస్తున్న మహిళలకు కూడా సామాజిక భద్రత రక్షణను విస్తరించడానికి సభ్య దేశాలు సంకల్పించాయి. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యంపై కొవిడ్ ప్రభావం గురించి కూడా చర్చించాయి.
 
    గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ కార్మికులు, శ్రామిక మార్కెట్‌లో వారి పాత్ర అంశంపై; శ్రామిక ప్రపంచంలోని కార్మిక ప్రక్రియలను "డిజిటల్ లేబర్ ప్లాట్‌ఫామ్‌"ల విస్తరణ ఎలా ప్రభావితం చేస్తుందన్న అంశంపై సభ్య దేశాలు చర్చించాయి. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, సామాజిక రక్షణ విస్తరణ సహా తాము తీసుకుంటున్న వివిధ చర్యలపైనా చర్చించాయి.
 
    చర్చలు సూటిగా, సానుకూల వాతావరణంలో జరిగాయి. కార్మిక సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు, ఉత్తమ పద్ధతులను మాత్రమేగాక, తమ ఆందోళనలు, సవాళ్లను కూడా సభ్య దేశాలు పంచుకున్నాయి.

***



(Release ID: 1718267) Visitor Counter : 195