గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
గిరిజన అభ్యున్నతి పథకాలపై సమీక్షకు ట్రైఫెడ్ రాష్ట్రస్థాయి వెబినార్లు!
ఈ నెల 10న మొదలైన సదస్సులు,.. 28 వరకూ కొనసాగింపు
రాష్ట్రాలు, జిల్లాల ఏజెన్సీల సమన్వయంతో నిర్వహణ..
చిన్నతరహా అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర పథకం,
వన్ ధన్ వికాస్ యోజన పథకం పటిష్టతే ప్రధాన లక్ష్యం
మణిపూర్ కోసం 200 వన్ ధన్ ప్రగతి క్లస్టర్లు.,
నాగాలాండ్ కోసం 206 క్లస్టర్ల అమలు
Posted On:
12 MAY 2021 12:49PM by PIB Hyderabad
గిరిజనులు, ఆదివాసుల అభ్యున్నతి లక్ష్యంగా చేపట్టిన రెండు పథకాల ప్రగతి రాష్ట్రాలవారీగా ఎలా ఉందో సమీక్షించేందుకు, పథకాల అమలుకోసం ఆయా రాష్ట్రాల సంస్థలు తీసుకున్న చర్యలను తెలుసుకునేందుకు భారతీయ గిరిజన సహకార మార్కెటింగ్ సమాఖ్య (ట్రైఫెడ్) రాష్ట్రాల స్థాయిలో ఆన్ లైన్ ద్వారా పలు వెబినార్ సదస్సులను ప్రారంభించింది. వన్ ధన్ యోజన పథకం, చిన్నతరహా అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర పథకం అమలును సమీక్షించేందుకు ఈ వెబినార్లు చేపట్టారు. దేశంలోని 23 రాష్ట్రాలకు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలకు మంజూరైన 37,107 వన్ ధన్ వికాస కేంద్రాలు (వి.డి.వి.కె.), 2,224 వన్ ధన్ వికాస కేంద్రాల సమూహాలను (క్లస్టర్లను) క్రియాశీలం చేసేందుకు ఆయా రాష్ట్రాల సంస్థలు తీసుకున్నచర్యలను కూడా ఈ వెబినార్ల ద్వారా సమీక్షించనున్నారు. రాష్టాల స్థాయిలోని నోడల్ ఏజెన్సీలు, వన్ ధన్ వికాస్ కేంద్రాల, వాటి క్లస్టర్ల బృంద నేతలు, ఔత్సాహిక వ్యాపార, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం (ఇ.డి.ఎస్.పి.) భాగస్వాములతో కలసి, రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి అమలు యంత్రాగాల సమన్వయంతో ఈ సదస్సులు ప్రారంభించారు. ఈ నెల 10న మొదలైన ఈ వెబినార్లను 28వ తేదీవరకూ నిర్వహించనున్నారు.
వెబినార్ల పరంపరలో తొలి సదస్సు ఈ నెల 10వ తేదీన మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాలతో కలసి నిర్వహించారు. మొత్తం 70మందికి పైగా ప్రతినిధులు ఈ వెబినార్ సదస్సుకు హాజరయ్యారు. పథకాలను అమలు చేసే రాష్ట్రాల తరఫు ఏజెన్సీలు, మార్గదర్శకులు, వన్ ధన్ వికాస్ కేంద్రాలు, వన్ ధన్ వికాస్ కేంద్రాల క్లస్టర్ల బృంద నేతలు, ఇ.డి.ఎస్.పి. భాగస్వాములు ఈ సదస్సుకు హాజరయ్యారు. గిరిజనుల అభ్యున్నతికోసం మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల్లో అమలు చేసే రెండు పథకాలకు సంబంధించిన వివిధ అంశాలు, భద్రతా నిబంధనలను పాటిస్తూనే ఈ పథకాల అమలులో తీసుకోవలసిన తదుపరి చర్యలపై ఈ సదస్సులో చర్చించారు. కోవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తీసుకోవలసిన భద్రతా చర్యలపై వన్ ధన్ వికాస్ కేంద్రాల సభ్యులకు మార్గదర్శకత్వం వహించేందుకు ఈ వెబినార్ లో యునిసెఫ్ ప్రతినిధులు కూడా పాలుపంచుకున్నారు.
రెండు పథకాల అమలులో నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాలు సాధించిన ప్రగతి దృష్ట్యా,..ఇపుడు, రెండు రాష్ట్రాల్లోనూ 3,500 వన్ ధన్ వికాస్ కేంద్రాలను ప్రగతి కేంద్రాలుగా తీర్చిదిద్దడంపై దృష్టిని కేంద్రీకరించనున్నారు. వన్ ధన్ వికాస్ కేంద్రాలతో కూడిన ప్రతి క్లస్టరును అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఈ కింద సూచించిన విధంగా ఐదు అంచెల కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.
మొదటి అంచెలో భాగంగా, ప్రతి వన్ ధన్ వికాస్ కేంద్రం పరిధిలో సేకరించవలసిన చిన్నతరహా అటవీ ఉత్పత్తులను గుర్తిస్తారు. ప్రణాళిక బద్ధంగా మౌలిక సదుపాయాలను ఈ దశలోనే అభివృద్ధి చేస్తారు. ఇందులో భాగంగా ఉత్పత్తుల సేకరణకోసం షెడ్లను, గోదాములను ఏర్పాటు చేస్తారు.
రెండవ అంచెలో,.స్థానిక ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలను (ఎన్.జి.ఒ.లను), లేదా జాతీయ జీవనోపాధి పథకం (ఎన్.ఆర్.ఎల్.ఎం.) అధికారులను మార్గదర్శకులుగా నియమిస్తారు. సంబంధిత మార్గదర్శక సూత్రాలు, ప్రతి క్లస్టరుకు విడుదలయ్యే డబ్బు ప్రాతిపదికగా ఈ నియామకం జరుగుతుంది. ఇందుకోసం ప్రతి క్లస్టరుకు రూ. 10లక్షలను ఆయా క్లస్టరు ఖాతాకు బదిలీ చేస్తారు.
ఇక 3వ దశలో, ప్రతి క్లస్టరుకు సంబంధించిన వాణిజ్య ప్రణాళికను రూపొందిస్తారు. ఉత్పత్తులకు విలువలను జోడించడం, బ్యాంకు ఖాతాను ప్రారంభించడం, వన్ ధన్ వికాస్ కేంద్రాల క్లస్టరును, వికాస కేంద్రాలను గుర్తించేలా గుర్తింపు బోర్డులు ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకుంటారు.
నాలుగవ దశలో ప్రతి క్లస్టరును వాణిజ్య ప్రణాళికకు అనుగుణంగా తీర్చి దిద్దుతారు. ఈ ప్రణాళికకు అనుగుణంగా ఎంపిక చేసిన ఉత్పాదనల ఉత్పత్తి, బ్రాండింగ్, ప్యాకేజింగ్, అమ్మకం వంటి ప్రక్రియలను చేపడతారు.
ఐదవ దశలో ఇ.డి.ఎస్.పి., సంప్రదాయ పరిశ్రమల పునరుద్ధరణ నిధి, ట్రైఫుడ్ పథకాలను ఆయా సంబంధిత క్లస్టర్లతో విలీనం చేస్తారు. పథకం పరిధిని క్రమ క్రమంగా విస్తరింపజేసేందుకు అవసరమైన చర్యలను కూడా తీసుకుంటారు.
మణిపూర్ రాష్ట్రంలో మొత్తం 3,000 వన్ ధన్ వికాస్ కేంద్రాలు,.. 200 వన్ ధన్ వికాస్ కేంద్రాల క్లస్టర్లుగా రూపొందాయి. తద్వారా దాదాపు 60,000మంది గిరిజన ఔత్సాహిక వ్యాపారులకు ప్రయోజనం చేకూరింది. ఇక నాగాలాండ్ లో 3,090 వన్ ధన్ వికాస్ కేంద్రాలు 206 వన్ ధన్ వికాస్ కేంద్రాల క్లస్టర్లుగా రూపొందడంతో 61,000మందికి పైగా గిరిజన ఔత్సాహికులు ప్రయోజనం పొందగలిగారు. ఇక, చిన్నతరహా అటవీ ఉత్పాదనలకు కనీస మద్దతు ధరల పథకం కింద మణిపూర్ రాష్ట్రంలో ఒక చిన్న తరహా అటవీ ఉత్పాదనను సేకరిస్తున్నారు. ఇప్పటివరకూ 6 మౌలిక సదుపాయాల యూనిట్లను ఏర్పాటు చేశారు. నాగాలాండ్ లో మాత్రం 3 చిన్నతరహా అటవీ ఉత్పత్తులను సేకరిస్తున్నారు. 20 మౌలిక సదుపాయాల యూనిట్లను, 18 సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వెబినార్ సందర్భంగా, రెండు పథకాల అమలుకు సంబంధించి తీసుకోవలసిన తదుపరి చర్యలపై మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధి బృందాలు చర్చించాయి. సంబంధింత అంశాలపై సదస్సులో వివరణ ఇచ్చాయి.
ఇలాంటి వెబినార్ సదస్సులు మొత్తం 25 వరకూ నిర్వహించాలని సంకల్పించారు. దేశంలోని ప్రతి భాగస్వామ్య రాష్ట్రంనుంచి ఉన్నత స్థాయి అధికారులతో ఈ సదస్సులను చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన జనాభా జీవనోపాధిని మెరుగుపరిచేందుకు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ట్రైఫెడ్ సంస్థ పలు చర్యలు చేపట్టింది. కోవిడ్ వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న గిరిజనుల అండగా నిలిచేందుకు ఈ చర్యల్లో చాలా వాటిని వేగవంతంగా అమలు చేస్తున్నారు.
వన్ ధన్ గిరిజన స్టార్టప్ కంపెనీలు, చిన్న తరహా అటవీ ఉత్పత్తులకోసం మార్కెటింగ్ యంత్రాంగం ఏర్పాటు వంటివి ట్రైఫెడ్ చేపట్టింది. చిన్నతరహా అటవీ ఉత్పత్తులకోసం , కనీస మద్ధతు ధర పథకం, విలువల జోడింపు వ్యవస్థను అభివృద్ధి చేయడం వంటి చర్యలు తీసుకుంది. అటవీ ఉత్పత్తులను సేకరించే వారికి కనీస మద్ధతు ధర కల్పించడం, గిరిజన గ్రూపులు, క్లస్టర్ల ద్వారా ఆయా ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు ఈ చర్యలు దోహదపడతాయి. 2005వ సంవత్సరపు అటవీ హక్కుల చట్టం అందించిన బలంతో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ప్రధాన పథకాన్ని చేపట్టింది. అటవీ ఉత్పత్తులను సేకరించే గిరిజనులకు, ఆదివాసులకు గిట్టుబాటు ధరలను అందించేందుకు ఈ పథకం తోడ్పడుతుంది. మధ్యదళారుల ద్వారా వారికి తమ ఉత్పాదనలకు లభించే ధరకు మూడు రెట్ల ధరను అందించేందుకు, వారి ఆదాయాన్ని మూడు రెట్లు పెంచుకునేందుకు ఈ పథకం దోహదపడుతుంది.
వన్ ధన్ స్టార్టప్ కంపనీలను, వన్ ధన్ యోజన పథకంలో భాగంగా అమలు చేస్తున్నారు. వన్ ధన్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి అయ్యే, చిన్న తరహా అటవీ ఉత్పాదనలకు విలువల జోడింపు, బ్రాండింగ్, మార్కెటింగ్ కల్పించేందుకు ఈ స్టార్టప్ ల కార్యక్రమం ఉపకరిస్తుంది. అటవీ ప్రాంతాల్లోని గిరిజనులకు సుస్థిర జీవనోపాధి కల్పనే లక్ష్యంగా వన్ ధన్ వికాస్ యోజన పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద ఏర్పాటయ్యే 15 వన్ ధన్ వికాస్ కేంద్రాలు ఒక వన్ ధన్ వికాస్ క్లస్టరుగా రూపొందుతాయి. వన్ ధన్ వికాస్ కేంద్రాల ఆర్థిక ప్రగతికి, గిరిజనుల జీవనోపాధికి, అటవీ ఉత్పత్తులకు మార్కెట్ అనుసంధానానికి, గిరిజనుల వ్యాపార అవకాశాలకు ఈ క్లస్టర్లు ఎంతో దోహదపడతాయి.
మొత్తంగా చూస్తే, గిరిజనులు తమ ఆదాయాన్ని, ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకొనేందుకు ఈ రెండు పథకాలు మంచి అవకాశాలను అందిస్తున్నాయి. ఈ పథకాల అమలులో ప్రగతిని మరింత ముందుకు తీసుకుపోయేందుకు ట్రైఫెడ్ గత ఏడాది మరిన్ని చర్యలు తీసుకుంది. వన్ ధన్ యోజన పథకాన్ని చిన్న తరహా అటవీ ఉత్పత్తుల కనీస మద్దతుధర పథకంతో విలీనం చేయడం గిరిజనుల అభ్యున్నతిలో గణనీయమైన మార్పుగా పరిగణిస్తున్నారు.
ఈ నెలలో జరుగుతున్న వెబినార్ సదస్సులు ఆయా రాష్ట్రాల్లోని పథకాల అమలు యంత్రాంగాలకు, ఇతర భాగస్వామ్య వర్గాలకు మంచి అవకాశాన్ని కల్పిస్తాయి. పథకాల అమలుతీరుపై సమీక్షకు, పథకాల అమలులో తాము అనుసరించే మార్గాన్ని సవరించుకునేందుకు ఇవి వీలు కలిగిస్తాయి. తద్వారా పథకాలను సమర్థంగా అమలుచేసి, గిరిజనులకు గరిష్టస్థాయిలో ప్రయోజనాలను అందించేందుకు వీలుంటుంది.
ఈ పథకాలన్నింటినీ సమర్థంగా అమలు చేయడంలో విజయం సాధించిన ట్రైఫెడ్ సంస్థ, గిరిజన వ్యవస్థలో సంపూర్ణ పరివర్తన సాధించగలమన్న ఆశాభావంతో ముందుకు సాగుతోంది. వన్ ధన్ వికాస్ యోజన పథకం కింద చిన్న తరహా అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర, విలువల జోడింపు ద్వారా దేశ గిరిజన అభ్యున్నతిలో విప్లవం సాధించగలమన్న ధీమాను కూడా ట్రైఫెడ్ వ్యక్తం చేస్తోంది.
***
(Release ID: 1718072)
Visitor Counter : 145