మంత్రిమండలి

ఏరియల్ ప్యాసింజర్ రోప్‌వే వ్యవస్థ అభివృద్ధి కోసం ఐటిబిపికి చెందిన స్థలాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి బదిలీ చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది

Posted On: 12 MAY 2021 6:40PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం ముస్సూరీలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులకు (ఐటిబిపి) చెందిన 1500 చదరపు మీటర్ల స్థలాన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టు కోసం ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి ఆమోదం తెలిపింది. వీటిలో డెహ్రాడూన్ మరియు ముస్సూరీ మధ్య  'ఏరియల్ ప్యాసింజర్ రోప్‌వే సిస్టమ్'ను ఏర్పాటు చేస్తారు.

ప్రతిపాదిత రోప్‌వే 5550 మీటర్ల పొడవు గల మోనో-కేబుల్ రోప్‌వే. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పిపిపి) మోడ్‌లో పుర్కుల్ గావ్, డెహ్రాడూన్ (లోయర్ టెర్మినల్ స్టేషన్) మరియు లైబ్రరీ, ముస్సూరీ (ఎగువ టెర్మినల్ స్టేషన్) మధ్య రూ .285 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. ప్రతి వైపునుండి  గంటకు 1000 మంది ప్రయాణించే సామర్థ్యంతో ఇది ఏర్పాటవుతుంది. ఇది డెహ్రాడూన్ నుండి ముస్సూరీ వరకు రహదారి మార్గంలో ట్రాఫిక్‌ను గణనీయంగా తగ్గిస్తుంది.

దాంతో పాటు ఈ ప్రాజెక్టు అదనంగా 350 మందికి ప్రత్యక్ష ఉపాధిని మరియు 1500 మందికి పైగా పరోక్ష ఉపాధిని కల్పిస్తుంది.రోప్‌వే పూర్తయిన తర్వాత పర్యాటకులకు భారీ ఆకర్షణగా నిలుస్తుంది. ఇది రాష్ట్రంలోని పర్యాటక రంగానికి ఊపునిస్తుంది మరియు పర్యాటక రంగంలో అదనపు ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది.

***


(Release ID: 1718069) Visitor Counter : 242