రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ద్రవరూపంలోని మెడికల్ ఆక్సిజన్‌ను రవాణా చేస్తున్న ట్యాంకర్లకు టోల్ ఫీజు నుంచి మినహాయింపును ఇచ్చిన ఎన్‌హెచ్ఎఐ
Posted On:
08 MAY 2021 6:41PM by PIB Hyderabad
ద్రవ రూపంలోని మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంఒ)ను రవాణా చేస్తున్న ట్యాంకర్లకు, కంటైనర్లకు జాతీయ రహదారుల వ్యాప్తంగా నిరాటంకమైన మార్గాన్ని కల్పించేందుకు, అటువంటి వాహనాలకు టోల్ ప్లాజాల వద్ద యూజర్ ఫీజు చెల్లింపుకు మినహాయింపునిచ్చారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా ముందెన్నడూ లేనివిధంగా మెడికల్ ఆక్సిజన్‌కు పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, రెండు నెలల కాలం లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ద్రవరూపంలో మెడికల్ ఆక్సిజన్‌ను తీసుకువెడుతున్న వాహనాలను అంబులెన్సుల వంటి ఇతర అత్యవసర వాహనాల లా వ్యవహరిస్తారు.
ఫాస్టాగ్ అమలు తర్వాత టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండాల్సిన సమయం ఎక్కువ ఉండకపోయినప్పటికీ, ఇప్పటికే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మెడికల్ ఆక్సిజన్ త్వరితగతంగా, నిరాటంకంగా రవాణా అయ్యేందుకు అటువంటి వాహనాలకు ప్రాధాన్యతను ఇస్తోంది. మహమ్మారిపై ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు చేస్తున్న పోరాటంలో సానుకూలంగా తోడ్పాటును అందించవలసిందిగా అధికారులకు, ఇతర భాగస్వాములకు ఎన్‌హెచ్ఎఐ ఉత్తర్వులను జారీ చేసింది.
కోవిడ్-19 మహమ్మారి దేశవ్యాప్తంగా ద్రవరూపంలోని మెడికల్ ఆక్సిజన్‌కు భారీ డిమాండ్ ను సృష్టించింది. ప్రస్తుత సంక్షోభంలో, కోవిడ్-19తో తీవ్రంగా ప్రభావితమైన రోగుల ప్రాణాలను కాపాడేందుకు ఆసుపత్రులకు, వైద్య కేంద్రాలకు ద్రవరూపంలోని లిక్విడ్ ఆక్సిజన్‌ను సమయానికి చేరవేయడం అత్యంత ముఖ్యం. టోల్ ప్లాజాల వద్ద యూజర్ ఫీజు చెల్లించడాన్ని మినహాయించడం అన్నది జాతీయ రహదారులపై మెడికల్ ఆక్సిజన్ వేగంగా కదిలేందుకు ఆస్కారం ఇస్తుంది.
***
(Release ID: 1717281)