ఉప రాష్ట్రపతి సచివాలయం
మహిళల ఆరోగ్య అవసరాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి: ఉపరాష్ట్రపతి
• ఆరోగ్యవంతమైన సమాజంలో మహిళల పాత్ర కీలకం, అందుకే వారి అవసరాలను గౌరవించాలి
• ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు ప్రసూతి మరణాల రేటును తగ్గించడాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలి
• తెలంగాణ ప్రభుత్వాసుపత్రుల్లో సిజేరియన్ కేసులు తగ్గడం అభినందనీయమన్న ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు
• ఈ దిశగా ప్రైవేటు ఆసుపత్రులు తమవంతు పాత్ర పోషించాలని పిలుపు
• 29వ యుధ్‌వీర్ స్మారక అవార్డును అంతర్జాల వేదిక ద్వారా డాక్టర్ ఎవిటా ఫెర్నాండేజ్‌కు ప్రదానం చేసిన ఉపరాష్ట్రపతి
Posted On:
30 APR 2021 12:37PM by PIB Hyderabad
దేశ జనాభాలో 50 శాతం ఉన్న మహిళల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేకమైన దృష్టిసారించాల్సిన అవసరం ఉందని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
శుక్రవారం ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ ప్రాంగణం నుంచి అంతర్జాల వేదిక ద్వారా, హైదరాబాద్‌కు చెందిన స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ ఎవిటా ఫెర్నాండేజ్‌కు యుధ్‌వీర్ స్మారక అవార్డును ఉపరాష్ట్రపతి ప్రదానం చేశారు. మహిళల ఆరోగ్య సంరక్షణ రంగంలో చేసిన విశిష్ట సేవకు గానూ డాక్టర్ ఫెర్నాండేజ్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, మహిళల ఆరోగ్యాన్ని విస్మరించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఆరోగ్యకర సమాజంలో కీలకంగా ఉన్న మహిళల ఆరోగ్య అవసరాలను తీర్చేవిధంగా వివిధ వైద్య సంరక్షణ కార్యక్రమాలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించారు.
ప్రసూతి మరణాల రేటును తగ్గించే విషయంలో భారతదేశం గణనీయమైన ప్రగతిని సాధించిన విషయాన్ని గుర్తు చేసిన ఉపరాష్ట్రపతి, ఈ రేటును మరింత తగ్గించడం ద్వారా ఐక్యరాజ్యసమితి నిర్దేశించినట్లుగా 2030 నాటికి ప్రతి లక్ష ప్రసూతి కేసుల్లో మాతృ మరణాలను 70 కంటే తక్కువకు తీసుకురావడం ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే దిశగా కృషిజరగాల్సిన అవసరం ఉందన్నారు.
భారతదేశంలోని మహిళల్లో ఉన్న పౌష్టికాహారలోపం సమస్యను పరిష్కరించడంపైనా ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
మహిళల ఆరోగ్య సంరక్షణ, పునరుత్పత్తి తదితర అంశాల్లో డాక్టర్ ఎవిటా ఫెర్నాండేజ్, (యుధ్‌వీర్ అవార్డు గ్రహీత) చేసిన సేవలను ఉపరాష్ట్రపతి అభినందించారు. మహిళల సాధికారత, సాధారణ ప్రసూతి తదితర అంశాల్లో డాక్టర్ ఫెర్నాండేజ్ తీవ్రంగా కృషిచేశారన్నారు. ‘సిజేరియన్ కేసులను తగ్గిస్తూ సాధారణ ప్రసూతి కేసులను ప్రోత్సహించడం ద్వారా మహిళల్లో ధైర్యాన్ని నింపేందుకు డాక్టర్ ఎవిటా ఫెర్నాండేజ్ చేసిన కృషి ప్రశంసనీయం. వారి కృషిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ ప్రసూతి కేసులను పెంచే లక్ష్యంతో యూనిసెఫ్‌తో కలిసి తెలంగాణ ప్రభుత్వం, ఫెర్నాండేజ్ ఆసుపత్రి చేసిన కృషిని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. ఈ ప్రయత్నాన్ని మన:పూర్వకంగా అభినందిస్తున్నట్లు ఆయన తెలిపారు. సిజేరియన్లను తగ్గించే ఈ మహత్కార్యంలో ప్రైవేటు ఆసుపత్రులు కూడా కలిసి రావాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు.
గర్భిణుల ఆరోగ్య సంరక్షణ కూడా అత్యంత కీలకమన్న ఉపరాష్ట్రపతి, ఈ దిశగా ప్రసూతికి సహకరించే వైద్యసిబ్బంది కోసం ఓ నేషనల్ కేడర్ ఏర్పాటు విషయంలో డాక్టర్ ఫెర్నాండేజ్ తీసుకున్న చొరవను ప్రశంసించారు. తెలంగాణలోని ప్రభుత్వాసుపత్రుల్లో దాదాపు 1500 మంది నర్సులకు ప్రసూతి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో శిక్షణ ఇచ్చేందుకు ఫెర్నాండేజ్ ఫౌండేషన్ ముందుకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా దివంగత శ్రీ యుధ్‌వీర్ గారి స్మృతికి ఉపరాష్ట్రపతి నివాళులు అర్పించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శ్రీ యుధ్‌వీర్ గారు, స్వాతంత్ర్య సమరయోధుడిగా, సామాజికవేత్తగా, పాత్రికేయుడిగా తన పాత్రను సమర్థవంతంగా నిర్వహించారన్నారు. సత్యం, నిజాయితీలకు పెద్దపీట వేస్తూ నైతికత కలిగిన పాత్రికేయుడిగా నిలిచారన్నారు. వారు మొదట ఉర్దూ మిలాప్ పత్రికను స్థాపించారని, తదనంతరం 1950లో ఈ సంస్థ ఆధ్వర్యంలో హిందీ మిలాప్ పత్రికను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. నైతికతకు విలువలకు పట్టం గట్టిన జర్నలిజాన్ని హిందీ మిలాప్ కొనసాగిస్తోందని ప్రశంసించారు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో హిందీ మాట్లాడే ప్రజలతో ఈ పత్రిక మమేకమైందన్నారు.
ఈ కార్యక్రమంలో యుధ్‌వీర్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ మురళీధర్ గుప్తా, అవార్డు గ్రహీత డాక్టర్ ఎవిటా ఫెర్నాండేజ్‌తో పాటు ఫౌండేషన్ సభ్యులు ఇతర ప్రముఖులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.
***
(Release ID: 1715014)
Visitor Counter : 197