ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల తాజా సమాచారం


సాంకేతిక సమస్యలేవీ రాని కోవిన్ తాజా టీకా రిజిస్ట్రేషన్లు

స్వయంగా 80 లక్షల మందికి పైగా రిజిస్ట్రేషన్

రిజిస్ట్రేషన్ మొదలైన మొదటి మూడు గంటల్లోనే 38.3 కోట్ల హిట్లు

Posted On: 28 APR 2021 9:15PM by PIB Hyderabad

 

భారత ప్రభుత్వం కోవిడ్ మీద జరుపుతున్న పోరాటంలో అత్యంత కీలకమైన అంశం టీకాల కార్యక్రమం. మరింత సరళీకృతం చేసిన మోడో దశ టీకా కార్యక్రమం 2021 మే 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అర్హులైన జనాభా రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం సాయంత్రం 4 గంటలకు మొదలైంది. కొత్తగా అర్హులైన వారందరూ కోవిన్ పోర్టల్ (cowin.gov.in) లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారాగాని రిజిస్టర్ చేసుకోవచ్చునని ప్రభుత్వం ప్రకటించటం తెలిసిందే.

అత్యాధునికమైన, పటిష్టమైన కోవిన్ సాఫ్ట్ వేర్ అన్నివిధాలుగా ఆధారపడదగినది. ఎప్పుడైనా, ఎక్కడైనా కోవిడ్ టీకా కోసం రిజిస్టర్ చేసుకోవటానికి అది అవకాశం కలిగిస్తుంది. కనీవినీ ఎరుగని భారీ స్థాయిలో టీకాల కార్యక్రమానికి రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం ఉండటంతో సర్వర్ల సామర్థ్యం, ఇతర అంశాలు అన్నీ పెంచింది. దీనివలన టీకా సంబంధ పౌర సేవలన్నీ సజావుగా సాగేటట్టు చూసింది. ఈ విశిష్టమైన డిజిటల్ వేదిక వేగంగాను, ఎక్కువ సంఖ్యకు తగినట్టుగాను స్పందించేలా రూపకల్పన చేశారు. అన్నిచోట్లా పనిచేసేట్టు కూడా అందుబాటులో ఉంచారు.

కోవిన్ వేదిక సరిగా స్పందించటం లేదని, సర్వర్ సామర్థ్యం సరిపోక డౌన్ అవుతున్నదని, భారీ రిజిస్ట్రేషన్లకు తట్టుకోవటం లేదని ఈరోజు మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. అయితే, సర్వర్ క్రాష్ అయినట్టు, ఆగిపోయినట్టు వచ్చిన వార్తలు అవాస్తవం, నిరాధారం. అసలు కోవిన్ కు అండగా ఉన్న సర్వర్ సాఫీగా పనిచేస్తూ అత్యంత సామర్థ్యం ప్రదర్శిస్తూ ఉంది. ఇప్పుడు రిజిస్టర్ చేసుకుంటున్నవారిలో అత్యధికంగా 18-44 ఏళ్ళ మధ్యవారే ఎక్కువగా ఉండగా సాయంత్రం 4.00-7.00 మధ్య మూడు గంటల వ్యవధిలో 80 లక్షలమందికి పైగా రిజిస్టర్ చేసుకున్నారు.

మొదటి 3 గంటల్లో ( 4.00-7.00 మధ్య) జరిగిన రిజిస్ట్రేషన్లలో కొన్ని గణాంకాలు:

- 38.3 కోట్ల ఎపిఐ హిట్స్, మొదట్లో నిమిషానికి అత్యధికంగా 27 లక్షల హిట్లు

- దాదాపు 1.45 కోట్ల ఎస్ ఎం ఎస్ ల పంపిణీ

సర్వర్ క్రాష్ కావటమో, నిదానించటమో జరగలేదనటానికి ఈ గణాంకాలే నిదర్శనం. సెకెనుకు 55,000 హిట్స్ చొప్పున నమోదు చేసుకుంది. రిజిస్ట్రేషన్లు, టీకాలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం dashboard.cowin.gov.in చూడవచ్చు.

******



(Release ID: 1714900) Visitor Counter : 243