నీతి ఆయోగ్
కోవిడ్ నిర్వహణ అంశంపై ఎన్ జిఓలు/ సిఎస్ఓలతో సాధికార బృందం-3 సమావేశం
Posted On:
26 APR 2021 5:24PM by PIB Hyderabad
నీతి ఆయోగ్ సిఇఓ శ్రీ అమితాబ్ కాంత్ నాయకత్వంలోని సాధికార బృందం-3 సోమవారంనాడు లక్షకు పైగా పౌర సమాజ సంస్థల (సిఎస్ఓ) ప్రతినిధులతో సమావేశమై దేశంలో పెరిగిపోతున్న కోవిడ్ కేసుల ప్రభావాన్ని తట్టుకునేందుకు చేపట్టవలసిన సమన్వయపూర్వక వ్యూహాలపై చర్చించారు. ప్రిన్సిపల్ సైంటిఫిక్ సలహాదారు డాక్టర్ కె.విజయరాఘవన్, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సభ్యుడు శ్రీ కమల్ కిశోర్, ఎంఇఏ, ఎంహెచ్ఏ, కేబినెట్ సచివాలయం, ప్రధానమంత్రి కార్యాలయం సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ప్రస్తుత కోవిడ్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆక్సిజెన్, సంబంధిత పరికరాలపై దిగుమతి సుంకాల ఎత్తివేత, 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్, 80 కోట్ల మంది ప్రజలకు రెండు నెలల పాటు ఉచిత ఆహార ధాన్యాల సరఫరా, రవాణాపరమైన (లాజిస్టిక్స్) లోటుపాట్ల దిద్దుబాటు వంటి చర్యల గురించి ఎన్ జిఓలు/ సిఎస్ఓల ప్రతినిధులకు వివరించారు. దేశంలో కోవిడ్-19 దాడిని ఎదుర్కొనే విషయంలో అందించిన సహకారానికి సిఎస్ఓలకు నీతి ఆయోగ్ సిఇఓ కృతజ్ఞతలు తెలియచేస్తూ రెండో విడత కోవిడ్-19 దాడిని ఎదుర్కొనే విషయంలో కూడా అదే తరహా మద్దతు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. indiafightscovid.com లోని సమాచారాన్ని డౌన్ లోడ్ చేసుకుని (జాతీయ గీతం, రేడియో సంగీతం, ఇతర సృజనాత్మక సమాచార సాధనాలు) కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో ప్రజల్లో ఉన్న సాధారణ అపోహలు తొలగించి, కచ్చితమైన సమాచారం అందించేందుకు కృషి చేయాలని ఆయన నొక్కి చెప్పారు.
జిల్లా, పంచాయతీ, రెసిడెంట్ వెల్ఫేర్ సంఘాల స్థాయిలో ప్రభుత్వం చేపట్టిన దిగువ కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే చర్యలు చేపట్టాలని సిఎస్ఓల ప్రతినిధులకు సాధికార బృందం చైర్మన్ విజ్ఞప్తి చేశారు.
- వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా మాస్కులు ధరించడం సహా కోవిడ్ నిరోధానికి ప్రకటించిన జాగ్రత్త చర్యలు కొనసాగించేలా ప్రజల్లో చైతన్యం పెంచాలి.
- పట్టణ పేదల కుటుంబాలకు అవసరమైన మద్దతు అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలకు మద్దతు అందించాలి.
- ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం సబ్సిడీ ఆహార ధాన్యాలు అందుకునేందుకు ప్రకటించిన "ఒక జాతి, ఒక కార్డు" పథకం సహా పలు చర్యలపై సామాజిక బృందాల్లో చైతన్యం పెంచేందుకు కృషి చేయాలి.
- సామాజిక కార్యకర్తలు, వలంటీర్లకు పిపిఇ కిట్లు, వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రత ఉత్పత్తుల పంపిణీలో ప్రభుత్వానికి సహకరించాలి.
- నిరంతర ప్రభుత్వ ఆరోగ్య సర్వీసుల్లో లోటుపాట్లను సరిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలకు అవసరమైన మద్దతు అందించాలి.
- కోవిడ్ మహమ్మారి విజృంభణ అధికంగా ఉన్న ప్రాంతాల్లో సేవలందించేందుకు హాట్ స్పాట్లు గుర్తించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో నివశిస్తున్న వృద్ధులు, వైకల్యాలతో బాధ పడుతున్న వారు, పిల్లలు, ట్రాన్స్ జెండర్లు, ముప్పు ఎదుర్కొంటున్న ఇతర వర్గాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో సహా సేవలందించే వలంటీర్లు, సంరక్షకుల నియామకం ప్రభుత్వానికి సహకరించాలి.
- రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక యంత్రాంగాలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం ద్వారా కోవిడ్ స్పందన చర్యలకు మద్దతు ఇచ్చేందుకు వ్యక్తిగతంగా ఆసక్తి గల వారు, సామాజిక మద్దతు బృందాల నుంచి వలంటీర్ల ఎంపికలో సహకరించాలి.
- కోవిడ్-19 రోగుల విషయంలో సామాజిక భయాలను, వివక్షను పారదోలడంతో పాటు వారి కుటుంబాలకు మద్దతు ఇచ్చేందుకు కృషి చేయాలి. ఇందుకోసం నిర్దేశిత సమాచార వ్యూహాలు అనుసరించాలి.
- కోవిడ్ వ్యాక్సినేషన్ లోని ఆచరణీయ అంశాలపై ప్రభుత్వం తయారుచేసిన సమాచారం విస్తృతంగా పంపిణి అయ్యేలా చూడడంతో పాటు సమాజాల్లో చైతన్యం విషయంలో ఏవైనా లోటుపాట్లుంటే సరిదిద్దాలి.
- వ్యాక్సినేషన్ విషయంలో ప్రజల్లో ఉన్న విముఖతను, అపోహలను తొలగించి అందరూ వ్యాక్సిన్ వేయించుకునేలా ప్రోత్సహించాలి.
అక్షయ పాత్ర, ఇండియన్ కో ఆపరేటివ్ నెట్ వర్క్ ఫర్ వుమన్ (ఐసిఎన్ డబ్ల్యు), నారాయణ్ సేవా సంస్థాన్, కరుణా ట్రస్ట్, మారికో ఇన్నోవేషన్ ఫౌండేషన్, ధర్మ లైఫ్, స్వస్థ్ ఫౌండేషన్, దాది దాదా ఫౌండేషన్, హెల్పేజ్ ఇండియా, గ్రాస్ రూట్స్ రీసెర్చ్ అండ్ అడ్వొకసీ మువ్ మెంట్, వాణి, లుపిన్ ఫౌండేషన్, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, అంతర్జాతీయ రెడ్ క్రాస్ సెంటర్, దిశ ఫౌండేషన్ ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు పలు చర్యలను సూచించాయి. హోమ్ కేర్ సేవలకు ప్రామాణిక నిర్వహణ విధానాలు (ఎస్ఓపి) జారీ చేయడం, వ్యాక్సినేషన్ పట్ల ప్రజల్లో విముఖత తొలగించడం, వ్యాక్సినేషన్ కు పేర్లు నమోదు చేసుకోవడంలో వయో వృద్ధులు, వలస కార్మికులకు సహకరించడం, సిఎస్ఆర్ కార్యకలాపాలకు మద్దతు అందించడం కోసం స్వల్పకాలిక రాయితీలు ప్రకటించడం, 80-జి మినహాయింపులు, ఎఫ్ సిఆర్ఏ రాయితీలు ఇవ్వడం వంటి చర్యలు ఆ సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. సరైన లబ్ధిదారులకు ఆహార ధాన్యాలు అందేలా చూడడంతో పాటు పౌష్టికాహార సమస్యలను పరిష్కరించేందుకు సిఎస్ఓలు కృషి చేయాలని నీతి ఆయోగ్ సిఇఓ సూచించారు.
దేశంలో కోవిడ్-19 దాడిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఆరు సాధికార బృందాలను ఏర్పాటు చేసింది. వాటిలో నీతి ఆయోగ్ సిఇఓ సారథ్యంలోని మూడో బృందానికి (గ్రూప్-3) కోవిడ్-19 మద్దతు చర్యల్లో ప్రైవేటు రంగం, ఎన్ జిఓలు, అంతర్జాతీయ సంఘాల కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యత అప్పగించారు. లక్షకు పైగా పౌర సమాజ సంఘాలు, ఎన్ జిఓలు, ఐక్యరాజ్య సమితి ఏజెన్సీలు, పారిశ్రామిక రంగ భాగస్వాములు, అంతర్జాతీయ సంఘాల మద్దతు కూడగట్టడం ద్వారా ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించేందుకు ఏకీకృత స్పందన వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వానికి మరింత బలం చేకూర్చడంలో ఈ బృందం కీలక పాత్ర పోషిస్తోంది.
****
(Release ID: 1714274)
|