రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కోవిడ్‌-19 కేసుల పెరుగుదలపై పోరాడటానికి పౌరపాల‌న సంస్థ‌ల‌కు అన్ని ర‌కాల స‌హాయాన్ని అందిస్తున్న డీపీఎస్‌యు, ఓఎఫ్‌బీలు

Posted On: 25 APR 2021 1:33PM by PIB Hyderabad

దేశ వ్యాప్తంగా ఇటీవల కోవిడ్-19 కేసులు పెరుగుతుండ‌డానికి వ్యతిరేక పోరాడ‌టంలో.. రాష్ట్ర ప్రభుత్వాలు/ ‌‌పౌర పాల‌న సంస్థ‌ల‌కు కేంద్రం ఆధ్వ‌ర్యంలో పని చేస్తున్న‌ ర‌క్ష‌ణ రంగ సంస్థ‌లు (డీపీఎస్‌యు), ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ (ఓఎఫ్‌బీ) అన్ని ర‌కాల స‌హాయాన్ని అందిస్తున్నాయి.
ఇటీవ‌ల ర‌క్ష‌ణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ నిర్వ‌హించిన స‌మీక్షా స‌మావేశంలో సూచించిన విధంగా
ప్ర‌స్తుత‌ సంక్షోభ స‌మ‌యంలో డీపీఎస్‌యు, ఓఎఫ్‌బీలు రాష్ట్ర ప్రభుత్వాలకు త‌గు సమన్వయంతో  పౌరుల‌కు సేవల‌ను అందిస్తున్నాయి.
దూసుకుపోతున్న హెచ్ఏఎల్‌..
కర్ణాటకలోని బెంగళూరులో గ‌ల‌ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) ఏర్పాటు చేసిన ఐసీయు, ఆక్సిజన్, వెంటిలేటర్ సపోర్ట్‌తో కూడిన 180 పడకల కోవిడ్ కేర్ సెంటర్ రోగుల‌కు సేవ‌ల‌ను అందిస్తోంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కింద డీపీఎస్‌యు బెంగళూరులో మ‌రో 250 పడకల  సౌకర్యాన్ని కూడా సిద్ధం చేసి స్థానిక మునిసిపల్ శాఖ అధికారులకు అప్పగించింది. ఒడిశాలోని కొరాపుట్‌లో 70 పడకల సౌకర్యం, మహారాష్ట్ర నాసిక్‌లో 40 పడకల ఆసుపత్రి కూడా పని చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో న‌గ‌రంలో 250 పడకల కోవిడ్ కేర్ సదుపాయాన్ని ఏర్పాటు చేసే పనిని కూడా హెచ్‌ఏఎల్ చేపట్టింది. ఇది మే నెల మొదటి వారంలో ఇది అందుబాటులోకి రాగ‌ల‌ద‌ని అంచ‌నా. దీనికి తోడు బెంగళూరు, లక్నోలో మరిన్ని వెంటిలేటర్ల‌తో పాటుగా ఆక్సిజ‌న్ పాయింట్లను అందించాలని హెచ్ఏఎల్ యోచిస్తోంది.
మేము సైతం అంటోన్న ఓఎఫ్‌బీ..
మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఒడిశా, ఉత్తరా ఖండ్‌లోని 25 ప్రదేశాలలో ఆక్సిజన్ పడకలతో కూడిన కోవిడ్‌ సంరక్షణ సేవలను ఓఎఫ్‌బీ అందిస్తోంది. కోవిడ్‌-19 సంరక్షణ కోసం ఇది ప్రస్తుతం ఉన్న బ‌ల‌గంలో దాదాపు 60 శాతాన్ని కేటాయించింది. మొత్తం 1,405 నుండి 813 పడకల‌ను ఇప్పుడు కోవిడ్‌ రోగులకు కేటాయించింది. పుణె, అంబర్‌నాథ్, నాగ్‌పూర్, భండారా, చందా, వరంగన్, మహారాష్ట్రలోని భూసావాల్, పశ్చిమ బెంగాల్ ఇషాపూర్ మరియు కోల్‌కతాల‌లో ఈ సౌక‌ర్యాలు అందుబాటులో ఉన్నాయి. కోవిడ్ సంరక్షణ కోసం ఓఎఫ్‌బీ తన సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చిన ఇత‌ర ప్రదేశాలు ఇలా ఉన్నాయి. ఉత్తర ప్ర‌దేశ్‌లోని కాన్పూర్ (2), షాజహాన్‌పూర్‌ (1), మురద్ నగర్ (1); మధ్య ప్రదేశ్‌లో జబల్‌పూర్ (3), ఇటార్సి (1), కట్ని (1); తమిళనాడులో అవడి (1), అరువాంకాడు (1), తిరుచిరప్పల్లి (1); తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ (1); ఉత్తరాఖండ్‌లో డెహ్రాడూన్ (1), ఒడిశాలో బాద్మల్ (1)లు ఈ జాబితాలో ఉన్నాయి.
ఇత‌ర సంస్థ‌లు కూడా..
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్), బీఈఎమ్ఎల్ లిమిటెడ్, హెచ్ఎఏల్, మజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్), గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ & ఇంజినీర్స్ (బీఆర్ఎస్ఈ) లిమిటెడ్, మిథాని వంటి అనేక డీపీఎస్‌యు సంస్థ‌లు సీఎస్ఆర్ కింద  స్థానికంగా వివిధ రాష్ట్రాల‌తో క‌లిసి ప‌ని చేస్తున్నాయి. ప్రభుత్వ ఆసుప‌త్రుల‌కు అందించడానికి వీలుగా.. ఆక్సిజన్ ప్లాంట్ల సమీక‌రించి అందించడాన్ని వేగ‌వంతం చేశాయి.

***



(Release ID: 1714078) Visitor Counter : 149