ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

మితాహారం, కాలానుగుణ ఆహారం ఆరోగ్యానికి కీలకం


ప్రపంచ కాలేయ దినోత్సవంలో అశ్వినీ కుమార్ చౌబే సూచన

“ఫిట్ ఇండియా, ఈట్ రైట్ ఇండియా, యోగా ద్వారా కాలేయ వ్యాధులను,
ఇతర రుగ్మతలను వినూత్న పంథాలో ఎదుర్కొంటున్న భారత్”

Posted On: 19 APR 2021 2:38PM by PIB Hyderabad

  ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా ఈ రోజు జరిగిన కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య, కుటంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే అధ్యక్షత వహించారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001N5T0.jpg
 

  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ కాలేయ దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యం ఉందన్నారు. “మానవ దేహంలో ముఖ్యమైన కార్యకలాపాలను మౌనంగా నిర్వహించే అతి పెద్ద కీలక అవయవం కాలేయం. అసహజమైన, అసాధారణమైన జీవన శైలి కారణంగా కాలేయానికి తీవ్రంగా దెబ్బ తగిలే ఆస్కారం ఉంది. దెబ్బతిన్న కాలేయం తిరిగి సక్రమంగా నిలదొక్కుకోలేని పక్షంలో ఇది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ (ఎన్.ఎ.ఎఫ్.ఎల్.డి.) అనే వ్యాధికి దారితీసే ఆస్కారం ఉంది. ఒకసారి ఈ పరిస్థితి తలెత్తితే అందుకు తగిన నివారణ మార్గం కూడా మనకు అందుబాటులో లేదు. ఈ పరిస్థితుల్లో ఈ వ్యాధికి సంబంధించిన రుగ్మతలేవీ తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం తప్ప గత్యంతరం లేదు.” అని ఆయన అన్నారు. అందువల్ల వేగంగా సాగుతున్న జీవన శైలి సాగిస్తున్న ప్రజలు నియమబద్ధమైన జీవన విధానం, ఆహారపు అలవాట్లు పాటించి బాధ్యతాయుతంగా మెలగవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.

   ఎన్.ఎ.ఎఫ్.ఎల్.డి. అనే రుగ్మత భారతదేశంలో చాపకింద నీరుగా వ్యాపిస్తోందని, ఇది ఆందోళనకరమని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇది వందకోట్ల మందికి (అంటే ప్రపంచ జనాభాలో 20-30శాతం మందికి) సంభవించే అవకాశం ఉందని అంచనా వేశారని తెలిపారు. భారతదేశంలో ఇది 9నుంచి 32శాతం వరకూ వ్యాపించే ఆస్కారం ఉందని, అంటే,..  ప్రతి 10మంది భారతీయుల్లో ఒకరినుంచి ముగ్గురి వరకూ ఫ్యాటీ లివర్ సంబంధిత రుగ్మత కలిగి ఉంటారని ఆయన చెప్పారు. అందువల్ల ఈ వ్యాకులత కారణంగా జనం తమ జీవితాలను, తమవారి జీవితాలు దెబ్బతినకుండా తగిన జాగ్రత్త వహించాలని, వ్యాధికి దారితీసే దూమపానం, మద్యపానం, జంక్ ఫుడ్, వంటి వాటిని మానేయాలని కేంద్ర మంత్రి సూచించారు. తమతమ కుటుంబ సభ్యుల్లో గురక పెట్టడం వంటి వ్యాధి లక్షణాలను పసిగడితే వెంటనే వైద్య సలహాలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో మితాహారం పాటించడం మంచిదని, ఆహారం విషయంలో పొదుపుగా వ్యవహరించడం, చాలావరకు కాలానుగుణంగా, ఏ రుతువులో దొరికే ఆహారాన్ని ఆకాలంలో తినడం అవసరమని, మన ఆయుప్రమాణం పెరిగేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు.

  కాలేయ రక్షణ వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటన్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని, ఎన్.ఎ.ఎఫ్.ఎల్.డి. రుగ్మత, తత్సంబంధిత వ్యాధుల నిరోధానికి జాతీయ స్థాయిలో ఒక సమగ్ర  కార్యక్రమం చేపట్టాలని గుర్తించిన దేశం ప్రపంచంలో భారతదేశం ఒక్కటేనని అన్నారు. క్యాన్సర్, మధుమేహం, గుండె సంబంధ వ్యాధులు వంటి వాటి నిరోధానికి ఒక జాతీయ స్థాయి ప్రధాన కార్యక్రమంగా దీన్ని చేపట్టినట్టు ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రబలే వ్యాధుల్లో ఎక్కువ భాగం భారతదేశంలోనే ఎక్కువని, అయితే జీర్ణ సంబంధమైన వ్యాధులన్నింటికీ కారణాలు కాలేయ సంబంధమైనవేనని, ఈ జాతీయ కార్యక్రమం ద్వారా పటిష్టంగా వ్యాధి నిరోధక చర్యలు తీసుకోవచ్చని కేంద్రమంత్రి అన్నారు. “ఎన్.ఎ.ఎఫ్.ఎల్.డి. రుగ్మతలు ఎక్కువ స్థాయిలో ఉండటాన్ని, వాటికి నివారణ లేదన్న విషయాన్ని గుర్తు పెట్టుకుని, ఎన్.ఎ.ఎఫ్.ఎల్.డి.తో సహా వ్యాధుల నిరోధానికి, నియంత్రణకు ఒక ఉద్యమ స్థాయిలో చర్యలు చేపట్టాలి. ఇది ప్రజా ఉద్యమ కార్యక్రమంగా అందరికీ తెలియాలి. అపుడే మన దేశ పౌరులకు ఆరోగ్యకర జీవనశైలి ఒక జీవన విధానంగా మారుతుంది.“ అని ఆయన అన్నారు. ఈ జాతీయ కార్యక్రమం ద్వారా వివిధ వ్యాధులకు సంబంధించి 75వేల సమగ్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటివరకూ పరీక్షలు నిర్వహించినట్టు, ఆయుష్మాన్ భారత్, ఆరోగ్య, సంక్షేమ కేంద్రాల ద్వారా వీటిని నిర్వహించినట్టు ఈ సందర్భంగా మంత్రికి అధికారులు వివరించారు. కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా, ప్రజాహితంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఈ  కార్యక్రమం కోసం తగిన శిక్షణ ఇవ్వడం, ఆశా కార్యకర్తలకు తోడు పురుష ఉద్యోగులకు కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించడం ద్వారా ప్రాథమిక ఆరోగ్య రక్షణ కార్యక్రమం మరింత విస్తృతం కాగలదని ఆయన అన్నారు.

  పౌరులందరికీ సంపూర్ణ ఆరోగ్యం అన్న ప్రధాని నరేంద్రమోదీ దార్శనికత దృష్టి ఎంతో ప్రశంసనీయమని కేంద్రమంత్రి అన్నారు. “శారీరక బరువును తగ్గించుకోవడం, ఆరోగ్యకరమైన జీవన శైలి, ప్రాణహాని కలిగించే అంశాలను నివారించడం వంటి చర్యల ద్వరా ఎన్.ఎ.ఎఫ్.ఎల్.డి. సంబంధిత రుగ్మతలను నిరోధించవచ్చు. ప్రస్తుతం భారతదేశం అంటువ్యాధుల, ఇతర వ్యాధుల తాకిడిని భారీ స్థాయిలో ఎదుర్కొంటోంది. వాటిని ముందు జాగ్రత్త చర్యల ద్వారా అదుపు చేయవచ్చు. ఫిట్ ఇండియా కార్యక్రమం, ఈట్ రైట్ ఇండియా కార్యక్రమం, యోగాపై దృష్టిని కేంద్రీకరించడం ద్వారా భారతదేశం కాలేయ వ్యాధులను, ఇతర వ్యాధులను విభిన్న పంథాలో ఎదుర్కొంటోంది.” అని ఆయన అన్నారు. చివరిగా ‘సర్వే భవంతు సుఖినా,.. సర్వే సంతు నిరామయ’ అన్న సిద్ధాంతాన్ని ప్రకటిస్తూ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే తన ప్రసంగం ముగించారు. భారతీయులందరికీ సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ సంక్షేమం అన్న లక్ష్య సాధనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆయన చెప్పారు.

 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002KS0Z.jpghttps://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0030JHG.jpg

ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఒ.) తరఫున ఆ సంస్థ ఆగ్నేయ ఆసియా ప్రాంతీయ కార్యాలయ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ పూనం ఖేత్రపాల్ ప్రాతినిధ్యం వహించారు.

  జాతీయ ఆరోగ్య కార్యక్రమం (ఎన్.హెచ్.ఎం.) అదనపు కార్యదర్శి, కార్యక్రమం డైరెక్టర్ వందనా గుర్నానీ,  ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ సునీల్ కుమార్, నాన్ కమ్యూనికబుల్ వ్యాధుల విభాగం సంయుక్త కార్యదర్శి విశాల్ చౌహాన్, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలియరీ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.కె. శారిన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

***



(Release ID: 1712716) Visitor Counter : 192