ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

జమ్మూకాశ్మీర్ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం; భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో బయటివారి ప్రమేయానికి ఆస్కారం లేదు - ఉపరాష్ట్రపతి


·      నవీన పారిశ్రామిక విప్లవ అవసరాలకు అనుగుణంగా వినూత్నమైన కోర్సుల రూపకల్పన జరగాలి

·      ఐఐఎంలకు ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచన

·      ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు క్షేత్రస్థాయిలో నూతన కల్పనలకు శ్రీకారం చుట్టాలి

·      ప్రపంచవ్యాప్తంగా మారుతున్న సాంకేతికతను, సమర్థతను అందిపుచ్చుకుని తదనుగుణంగా ముందుకెళ్లాలి

·      విద్యాసంస్థలతో పరిశ్రమల అనుసంధానం ద్వారా వాస్తవిక ప్రపంచ సమస్యలను అర్థం చేసుకునే వీలుంటుంది

·      జమ్మూ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ మూడవ, నాల్గవ స్నాతకోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సూచన

Posted On: 09 APR 2021 2:37PM by PIB Hyderabad
జమ్మూకాశ్మీర్ సమగ్రాభివృద్ధికి భారతదేశం కట్టుబడి ఉందని, భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో బయటివారి ప్రమేయానికి ఆస్కారం లేదని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.
శుక్రవారం జమ్మూలోని ఐఐఎం (జమ్మూ) మూడవ, నాల్గవ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి, నవీన (4వ) పారిశ్రామిక విప్లవ నేపథ్యంలో ఎదురౌతున్న అవసరాలకు అనుగుణంగా వినూత్నమైన కోర్సులకు రూపకల్పన జరిగి విద్యార్థుల్లో సృజనాత్మకతకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ఐఐఎం వంటి జాతీయ విద్యాసంస్థలు కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
 
వాస్తవిక ప్రపంచంలోని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మన ఉన్నత విద్యపై ప్రత్యేకమైన దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని సూచించిన ఉపరాష్ట్రపతి, ఈ మేరకు భిన్నమైన రంగాలైన వ్యవసాయం, వాణిజ్యం, వ్యాపారం, సాంకేతికత, మానవ విజ్ఞానశాస్త్రం, మేనేజ్‌మెంట్ లను ఒక చోటచేర్చి కోర్సుల రూపంలో విద్యార్థులకు అందించాలన్నారు. నూతన జాతీయ విద్యావిధానంలోనూ ఇదే స్ఫూర్తితో భిన్నమైన అంశాలను బోధించడంపై దృష్టిపెట్టారన్న ఆయన, గతంలో అనుసరించిన విధానాలతో భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనలేమని పేర్కొన్నారు.
 
వ్యవస్థాగత సంస్కరణలను ప్రోత్సహించే విధానాలను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉందన్న ఉపరాష్ట్రపతి, భవిష్యత్ నిర్వహణ శక్తి అయిన విద్యార్థులు సృజనాత్మకత, వినూత్నమైన పద్దతులను అలవర్చుకుంటూ శరవేగంగా ప్రపంచంలో వస్తున్న మార్పులకు పరిష్కారాలు కనుగొనాలని ఆయన సూచించారు. ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులు చోటు చేసుకునే నవీన ప్రపంచంలో సరైన నిర్ణయాలు తీసుకునే విద్యార్థుల సామర్థ్యం, కొత్త సందర్భాలకు అనుగుణంగా వ్యవహరించే చురుకుదనం ఈ దిశగా అత్యంత కీలకమని తెలిపారు. భవిష్యత్ ధోరణులను ఊహించడంలో విద్యా సంస్థలు ముందుచూపుతో, చురుకుగా, అప్రమత్తంగా వ్యవహరించాల్సిన ప్రాధాన్యతను నొక్కిచెప్పిన ఉపరాష్ట్రపతి, అభ్యసన ప్రపంచం మరియు పని ప్రపంచం చాలా వేగంగా మారుతున్నాయన్నారు. మానవాళి గతంలో ఎన్నడూ ఎదుర్కొనని, ఊహించని పరిస్థితుల నేపథ్యంలో అనుకూలంగా మార్చుకోగల నేర్పు, నూతన అవకాశాలను సృష్టించుకోగల సామర్థ్యం, తదనుగుణంగా స్పందించే చొరవ అనే మూడు సూత్రాలతో ముందుకెళ్లాలని ఆయన విద్యార్థులకు సలహా ఇచ్చారు.
 
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, నిర్వాహకులు, సలహాదారులు క్షేత్రస్థాయిలో నూతన కల్పనలను గుర్తించాలన్న ఉపరాష్ట్రపతి, అందుబాటులో ఉన్న శక్తిసామర్థ్యాలను ఉపయోగించి స్వదేశీ పరిష్కారాలను కనుగొనాలని సూచించారు. భారతీయ కళాకారుల సాంప్రదాయ నైపుణ్యానికి, సాంకేతికతను జోడించడం, వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం ద్వారా అన్నదాతకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
 
ప్రజల ఆకాంక్షలను పూర్తిచేసే లక్ష్యంతో భారతదేశం దూసుకెళ్తోందన్న ఉపరాష్ట్రపతి, దేశానికి అతిపెద్ద అభివృద్ధి వనరు అయిన యువతరం భారత అభివృద్ధి ప్రయాణంలో కీలక భాగస్వామి కావాలని ఆకాంక్షించారు. అపారమైన యువశక్తి సామర్థ్యమున్న భారతదేశం, దేన్నైనా సాధించే సత్తా కలిగి ఉందన్నారు. నైపుణ్యాభివృద్ధి, నాణ్యమైన విద్యలను కీలకమైన అభివృద్ధి చోదకులుగా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి, విద్యావిధానంలో నాణ్యతను పెంచే విషయంపై ప్రత్యేకమైన దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.
 
పరిశ్రమలను విద్యాసంస్థలతో అనుసంధానం చేయడాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్న ఉపరాష్ట్రపతి, వాస్తవిక ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం ద్వారానే విద్యార్థులు తాము నేర్చుకుంటున్న విషయాల్లో నైపుణ్యాన్ని పొందుతారన్నారు. వినూత్నమైన, సృజనాత్మకమైన యువతరం ఆలోచనలతో పరిశ్రమలకు కూడా మేలు జరుగుతుందన్నారు.
 
కరోనా మహమ్మారి కారణంగా విద్యారంగంలో సాంకేతికత వినియోగ సామర్థ్యం మనకు తెలిసిందన్న ఉపరాష్ట్రపతి, సాంకేతికతను మరింత విస్తృతంగా వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఈ ప్రయత్నంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న సాంకేతిక అంతరాన్ని తగ్గించాలని ఆయన సూచించారు. మారుమూల ప్రాంతాల్లోని, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు కూడా సాంకేతిక విప్లవం ఫలాలను అందేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని పేర్కొన్నారు.
 
ప్రాచీన కాలంలో జమ్మూకశ్మీర్ విద్యాకేంద్రంగా విరాజిల్లిన విషయాన్ని గుర్తు చేసిన ఉపరాష్ట్రపతి, పతంజలి, ఆనందవర్ధనుడు, లల్లేశ్వరి, హబ్బా ఖాటూన్ వంటి ఎందరోమంది ఈ ప్రాంతానికి చెందిన మహానుభావులు భారతదేశానికి ఘనమైన వారసత్వాన్ని అందించిన విషయాన్ని ప్రస్తావించారు. జమ్మూ ఐఐఎం సాధిస్తున్న ప్రగతిని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, జమ్మూ, కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా, ఐఐఎం జమ్మూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ శ్రీ మిళింద్ కాంబ్లే, ఐఐఎం జమ్మూ డైరెక్టర్ డాక్టర్ బీఎస్ సహాయ్, కళాశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
 
***


(Release ID: 1710679) Visitor Counter : 179