ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

ప్రజా ప్రతినిధుల పని తీరు, దీర్ఘకాలిక ప్రయోజనాలే ఓటు వేసేందుకు కొలమానం కావాలి – ఉపరాష్ట్రపతి


• పాలన కేంద్రిత ఓటర్ల ద్వారానే పౌర కేంద్రిత పాలన సాధ్యం

• ప్రజలందరి జీవన సౌలభ్యం కోసం పాలనను మరింత క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉంది

• విశ్రాంత సివిల్ సర్వీసు అధికారి శ్రీ శైలేంద్ర జోషి రాసిన ‘ఎకో టి కాలింగ్’ పుస్తక తెలుగు సేత “సుపరిపాలన”ను ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి

• కొత్త సివిల్ సర్వీసు అధికారులకు కరదీపికలా పని చేస్తుందని అభినందన

Posted On: 01 APR 2021 11:59AM by PIB Hyderabad

ప్రజా ప్రతినిధుల పని తీరు, దీర్ఘకాలిక ప్రజా ప్రయోజనాలే కొలమానంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని అని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలిపారు. పోటీ చేసే వారి క్యారక్టర్ (గుణం), కెపాసిటీ (సామర్థ్యం), క్యాలిబర్ (యోగ్యత), కాండక్ట్ (నడత) ఆధారంగానే ఎన్నుకోవాలని, అలా గాక క్యాస్ట్ (కులం), కమ్యూనిటీ (వర్గం), క్రిమినాలిటీ (నేరతత్వం), కరెన్సీ (డబ్బు) ఆధారంగా ఎన్నుకోవడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని సూచించారు. పౌర కేంద్రిత పాలన రావాలంటే, పాలనా కేంద్రిత ఓటు వినియోగం ద్వారానే వస్తుందని సూచించారు.

తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి  డాక్టర్ శైలేంద్ర కుమార్ జోషి రచించిన ‘ఎకో టి కాలింగ్’ పుస్తక తెలుగు సేత “సుపరిపాలన”ను హైదరాబాద్ లోని తమ నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాలనా నమూనాలో వస్తున్న మార్పుల గురించి వివరించిన ఉపరాష్ట్రపతి, ప్రభుత్వం కంటే పాలనే కీలకమైనదని, పాలనా ప్రక్రియలో ప్రజలను భాగస్వాములను చేయవలసిన అవసరం ఉందని సూచించారు. శాసనాలు చేయడం, అమలు పరచడం, మూల్యాంకనం చేయడం లాంటి అన్ని విభాగాల్లో పాలు పంచుకునేందుకు పౌరులకు అవకాశం కల్పించాల్సిన అవసరాన్ని ఉపరాష్ట్రపతి నొక్కి చెప్పారు. సౌకర్యాల కల్పనతో పాటు ప్రజలకు అడ్డంకులు లేని ఆనందమయ జీవితాన్ని కల్పించడమే సుపరిపాలన ధ్యేయమని తెలిపారు.

 

ఎన్నికైన ఏ ప్రభుత్వమైనా ప్రజా విశ్వాసంతోనే గెలిచిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్న ఉపరాష్ట్రపతి, ప్రతి ప్రతినిధులు తమ పదవికి సంబంధించిన బాధ్యతలను త్రికరణశుద్ధిగా నిర్వహించాలని, ప్రజలకు పరిపూర్ణమైన సేవలు అందించాలని సూచించారు. పౌరుల జీవన సౌలభ్యాన్ని మెరుగు పరించేందుకు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందన్నారు.

 

కొత్తగా సివిల్ సర్వీసుల్లోకి వచ్చే వారికి ఈ పుస్తకం కరదీపికలా పని చేస్తుందన్న ఉపరాష్ట్రపతి, పథకాల అమలులో ఎదురయ్యే సమస్యలు, ఒత్తిడులు, అడ్డంకులు వంటి ఎన్నో అంశాలను ఇందులో చర్చించినట్లు తెలిపారు. వార్షిక బడ్జెట్ మొదలుకుని ఆత్మనిర్భర భారత్, మిషన్ కర్మయోగి, వ్యవసాయం, రహదారి భద్రత, భూ సేకరణలో మానవతా కోణం, సాంకేతిక విద్య, పర్యావరణం, కోర్టు వివాదాలు, సహకార ఉద్యమం సహా జాతీయ పర్వదినాలు, పండుగల గురించి కూడా ఇందులో ప్రస్తావన ఉందన్నారు. 

ప్రజలు తీసుకోవలసిన ఆహారం, ఆరోగ్యం, థర్డ్ జండర్స్, న్యాయం లాంటి అనేక అంశాల మీద తమ అభిప్రాయాలను వెలువరించిన ఈ పుస్తకం, ఉద్యోగంతో పాటు సమాజం పట్ల శ్రీ జోషి గారు చేసిన అధ్యయనాన్ని తెలియజేస్తుందన్న ఉపరాష్ట్రపతి, రచయిత డాక్టర్ ఎస్‌కే జోషితో పాటు సరళమైన, చక్కని తెలుగులో అనువాదం చేసిన శ్రీ అన్నవరపు బ్రహ్మయ్యకు అభినందనలు తెలిపారు. 

 

ప్రస్తుతం కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఈ పుస్తకాన్ని నిరాడంబరంగా విడుదల చేయడం జరిగిందని, ప్రజలందరికీ ఈ పుస్తకం గురించి తెలియాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. మూసి ఉంచిన గదుల్లో కాకుండా, ఆరుబయట మంచి గాలిని ఆస్వాదించడం లాంటి వాటి ద్వారా కోవిడ్ మహమ్మారి వ్యాప్తి రాకుండా ఆడ్డుకోవచ్చన్న ఆయన, గ్రామీణ ప్రాంతాల ప్రజలు కోవిడ్ మహమ్మారి బారిన తక్కువ పడడానికి ఇది కూడా ఓ కారణమన్నారు. అందుకే వీలైనంత వరకూ ప్రకృతి ఒడిలో గడిపేందుకు ప్రయత్నించాలని సూచించారు.

 

ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత డాక్టర్ ఎస్.కె.జోషి, అనువాదకుడు శ్రీ బ్రహ్మయ్య సహా వారి మిత్రులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

***


(Release ID: 1708968) Visitor Counter : 248