మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
మార్చి 16 నుంచి 31 వరకు పోషణ్ పక్వాడా
ఆహారవనాల పెంపకం ద్వారా పోషకాహార సవాళ్ల అధిగమనం
పోషకాహార లోపంపై చైతన్యం కల్పించేందుకు పోషణ్ పంచాయతీల నిర్వహణ
Posted On:
17 MAR 2021 8:08PM by PIB Hyderabad
మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 2021 మార్చి 16 నుంచి 31వరకు పోషణ్ పక్వాడా నిర్వహిస్తోంది. ఆహార వనాల పెంపకం ద్వారా పోషకాహార సవాళ్లను అధిగమించడం, పోషణ్ పంచాయతీల నిర్వహణపై 2021 పోషణ్ పక్వాడా ప్రధానంగా దృష్టి సారిస్తోంది. పోషకాహార సవాలును అధిగమించడం లక్ష్యంగా ఆయుష్ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పని చేస్తున్న నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు (ఎన్ఎంపిబి) దేశంలోని ఆకాంక్షాపూరిత జిల్లాల్లో ప్రతీ అంగన్ వాడీ కేంద్రానికి (ఎడబ్ల్యుసి) నాలుగేసి పోషక విలువలు గల ఆహార మొక్కలు స్థానిక పంచాయతీ, డిఎం/ డిసి పర్యవేక్షణలో పంపిణీ చేస్తోంది. అలాగే పోషకాహార చైతన్యం కల్పించేందుకు పిఆర్ఐల సభ్యులను భాగస్వాములను చేస్తూ పోషకాహార లోపం, దాని ప్రభావం, పోషణ్ వాటిక, ఆహార వనాలు, ఎస్ఏఎం/ఎంఏఎం గల పిల్లలను గుర్తించడం, నిర్వహణ వంటి అంశాలపై పోషణ పంచాయతీ కూడా నిర్వహిస్తారు.
2018 మార్చి 8వ తేదీన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రారంభించిన పోషణ్ అభియాన్ ప్రజల భాగస్వామ్యంతో ఎంతో దూరం ప్రయాణించింది. వివిధ మంత్రిత్వ శాఖలను భాగస్వాములను చేస్తూ ఒక సమ్యక్ దృక్పథంతో పోషకాహార ఫలితాలను మెరుగుపరచడం కోసం పోషణ్ అభియాన్ కృషి చేస్తుంది. పోషణ్ అభియాన్ లక్ష్యాలు సాధించాలంటే వ్యక్తిగత, సామాజిక స్థాయిలో ప్రవర్తనాపూర్వకమైన మార్పు తీసుకురావడం అవసరం. “మన్ కీ బాత్” సహా పలు సందర్భాల్లో ప్రధానమంత్రి ఎలుగెత్తి ఇచ్చిన పిలుపు జన్ ఆందోళన్ ఆధారిత ప్రజాభాగస్వామ్యంలో పోషకాహారపరమైన అంశాలపై చైతన్యం పెరిగేందుకు దోహదపడింది.
పోషకాహారం ప్రాధాన్యతాంశంగా 2020 సెప్టెంబర్ లో పోషణ మా సందర్భంగా జరిగిన జన్ ఆందోళన్ ఫలితంగా పోషణ్ వాటిక కార్యక్రమం వేగం అందుకుంది. అంగన్ వాడీ స్థాయిలో జరిగిన కిచెన్ గార్డెన్ రూపంలో 10.87 లక్షల మొక్కలు నాటేందుకు ఇది దోహదపడింది. అదే సమయంలో సమాంతరంగా ఆయుష్ ఆధారిత కార్యక్రమాల వల్ల ప్రాచీన కాలం నాటి పోషకాహార అలవాట్లపై ప్రజలకు అవగాహన కల్పించే సమాచారం వ్యాప్తి చేయడం కూడా జరిగింది.
పోషణ్ పక్వాడా సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నోడల్ విభాగంగా సమన్వయం చేస్తుంది. రాష్ర్టాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో పోషణ్ పక్వాడాకు మహిళా, శిశు అభివృద్ధి శాఖ/ సాంఘిక సంక్షేమ శాఖలు నోడల్ విభాగాలుగా వ్యవహరిస్తాయి.
-------
(Release ID: 1705713)
Visitor Counter : 174