రైల్వే మంత్రిత్వ శాఖ
ఏడాది ముగియకముందే సరకు రవాణాలో క్రితం సంవత్సరాన్ని దాటిపోయిన రైల్వే
నిరుడు ఏడాది చివరికి 1145.61 మిలియన్ టన్నుల రవాణా కాగా ఈ మార్చి 11 నాటికే 1145.68 మిలియన్ టన్నుల రవాణా సాధించిన రైల్వేలు
నిరుడు ఇదే నెలతో పోల్చుకుంటే మార్చి 11 వరకు 10% అధికంగా 43.43 మిలియన్ టన్నుల రవాణా
కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థకి నిదర్శనం రైల్వే రవాణాలో అసాధారణ ఎదుగుదల
प्रविष्टि तिथि:
12 MAR 2021 4:50PM by PIB Hyderabad
కోవిడ్ సవాలును సైతం అధిగమించి 2021 మార్చి 11నాడు భారతీయ రైల్వేలు అంతకుముందు సంవత్సరం చివరి వరకూ సాధించిన సరకు రవాణాను అధిగమించాయి. 2021 మార్చి11 నాటికి సరకు రవాణా 1145.68 మిలియన్ టన్నులకు చేరగా నిరుడు మార్చి 31 వరకు చేసిన రవాణా 1145.61 మిలియన్ టన్నులు కావటం గమనార్హం. అంటే 20 రోజుల ముందే కోవిడ్ మధ్య కూడా నిరుటి స్థాయిని మించిపోయింది.
నెలల పరంగా చూసినప్పుడు నిరుడు ఫిబ్రవరి 11-మార్చి 11 మధ్య కాలంలో 39.33 మిలియన్ టన్నుల సరకు రవాణా జరగగా ఈ ఏడాది అదే నెల రోజుల్లో 43.43 మిలియన్ టన్నుల లోడింగ్ జరిగింది. ఈ ఏడాది మార్చి 11న 4.07 మిలియన్ టన్నుల రవాణా జరగగా ఇదే రోజు నిరుడు జరిగిన 3.03 మిలియన్ టన్నుల కంటే ఇది 34% అధికం.
సరకు రవాణా రైళ్ళ సగటు వేగం మార్చి నెలలో 11వ తేడీ వరకు గంటకు 45.49 కిలోమీటర్లు కాగా ఇది నిరుడు నమోదైన గంటకు 23.29 కిలోమీటర్లకు దాదాపు రెట్టింపు. రైల్వే సరకు రవాణాను ఆకర్షణీయంగా మార్చటానికి అనేకరకాలైన రాయితీలు, డిస్కౌంట్లు ఇవ్వటాన్ని కూడా ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాలి. జోన్లలో, డివిజన్లలో బిజినెస్ డెవలప్ మెంట్ యూనిట్లు బలపడటం, పరిశ్రమలతో రవాణా సంస్థలతో సమాలోచనలు కొనసాగించటం, వేగం పెంచటం లాంటి చర్యల వలన రైళ్ళలో సరకు రవాణా పెరిగింది.
కోవిడ్ -19 వలన ఏర్పడిన సంక్షోభాన్ని భారతీయ రైల్వేలు ఒక అవకాశంగా మార్చుకొని సామర్థ్యాన్ని, పనితీరును మెరుగుపరచుకోగలిగింది.
***
(रिलीज़ आईडी: 1704487)
आगंतुक पटल : 179